మరో మూడురోజులు పాతనోట్లకు ఓకే
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుడి కష్టాలను తగ్గించేందుకు కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది. ప్రజలకు పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల వినియోగాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించింది. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే, బస్సు టికెట్లు, ఎయిుర్ పోర్టుల్లోని కౌంటర్లలో విమాన టికెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఫార్మసీల్లో మందుల కొనుగోలు, ఎల్పీజీ సిలిండర్లు, రైల్వే కేటరింగ్‌ల్లో సోమవారం అర్ధరాత్రి వరకు పాత నోట్లు చెల్లుబాటవుతాయి. ప్రభుత్వ ఆధీనంలోని సహకార కేంద్రాల్లోనూ ధ్రువీకరణ పత్రాలతో పాత నోట్లను వినియోగించవచ్చు. మున్సిపాలిటీ, స్థానిక సంస్థల పన్నులు చెల్లించవచ్చు. శుక్రవారం అర్ధరాత్రి వరకే అనుమతిచ్చినా బ్యాంకులు, ఏటీఎం వద్ద పెరుగుతున్న రద్దీ, ప్రజల్లో ఆందోళన నేపథ్యంలో ఈనెల 14 అర్ధరాత్రి దాకా అనుమతిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆ లోపు కొత్త కరెన్సీ అందుబాటులోకి రావొచ్చని భావిస్తోంది.
టోల్ రద్దు పొడిగింపు
జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా టోల్ గేట్ల వద్ద పన్ను వసూళ్ల నిలుపుదలను కూడా కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజులు పొడగించింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు టోల్ కట్టాల్సిన పని లేదంటూ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఔటర్ రింగురోడ్డుపై కూడా ఈ నెల 14 వరకు టోల్ కట్టాల్సిన అవసరం లేదంటూ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటన విడుదల చేశారు.