
ముంబై: వరుసగా ఆరు సెషన్ల రూపాయి పతనానికి బ్రేక్ పడింది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ 18 పైసలు బలపడి 74.21 వద్ద క్లోజయ్యింది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజ్ (ఫారెక్స్)లో ఒకింత మెరుగ్గా 74.18 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఒక దశలో 74.05 గరిష్ట స్థాయికి కూడా తాకింది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడిన నేపథ్యంలో దేశీయంగా ఎగుమతిదారులు అమెరికా కరెన్సీని విక్రయించడం ఇందుకు తోడ్పడింది. అయితే, ప్రారంభ లాభాలు కొంత వదులుకున్న రూపాయి.. చివరికి 18 పైసల లాభంతో 74.21 వద్ద క్లోజయ్యింది. దీంతో వరుసగా ఆరు సెషన్ల పతనం తర్వాత తొలిసారిగా దేశీ కరెన్సీ కోలుకున్నట్లయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి కొత్త కనిష్ట స్థాయి 74.39కి పడిపోయిన సంగతి తెలిసిందే.
దేశీ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ కూడా రూపాయి బలపడటానికి తోడ్పడి ఉంటుందని ట్రేడర్స్ అభిప్రాయపడ్డారు. అలాగే, పండుగల సీజన్‌లో ద్రవ్య లభ్యతను మెరుగుపర్చేందుకు అక్టోబర్ 11న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా రూ. 12,000 కోట్ల మేర నిధులను వ్యవస్థలో అందుబాటులోకి తేవాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం కూడా రూపాయి రికవరీకి దోహదపడిందని వివరించారు. ఇక, నగదు సంక్షోభంలో చిక్కుకున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను ఆదుకునే దిశగా సుమారు రూ. 45,000 కోట్ల అసెట్స్‌ను కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రకటించడమూ సానుకూలంగా మారిందని ట్రేడర్లు తెలిపారు.