
తపాలాశాఖ చేతులెత్తేసింది
- చాలా పోస్టాఫీసులకు అందని కొత్త నోట్లు
- రూ.60 కోట్లడిగితే ఇచ్చింది రూ.12 కోట్లే
- చెల్లింపులు చేయలేమంటూ బోర్డులు
సాక్షి, హైదరాబాద్: రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి తమవల్ల కాదంటూ పోస్టల్ శాఖ చేతులెత్తేసింది. రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకులు తపాలా కార్యాలయాలకు చాలినంత నగదు పంపడంలో నిర్లక్ష్యం చూపుతుండటంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలా కార్యాలయాలు పెద్ద నోట్ల మార్పిడిని అనుమతించలేదు. పాత నోట్లను మార్చలేమంటూ బోర్డులు పెట్టేశాయి. నగదు మార్పిడికి అవకాశం కల్పించేందుకు పోస్టాఫీసులకు కూడా నగదు పంపాలని కేంద్రం నిర్ణరుుంచడం తెలిసిందే. ఆ మేరకు ఆర్‌బీఐ, స్టేట్ బ్యాంకు శాఖల నుంచి ఏ రోజుకా రోజు పోస్టాఫీసులకు నగదు అందాలి. ఇలా తొలి రోజునే పోస్టాఫీసుల ద్వారా రాష్ట్రంలో రూ.52 కోట్ల మార్పిడి జరిగింది. దాంతో రోజుకు రూ.60 కోట్లకు తగ్గకుండా నగదు కావాలని తపాలా అధికారులు కోరినా రూ.30 కోట్లకు మించ కుండానే ఆర్‌బీఐ, స్టేట్‌బ్యాంకు పంపుతు న్నాయి.
పోస్టాఫీసులు తమ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు కూడా కలిపి నోట్ల మార్పిడి చేస్తూ వచ్చారుు. రెండో రోజు రూ.78 కోట్లు, మూడో రోజు రూ.83 కోట్లు, నాలుగోరోజు రూ.50 కోట్లు, ఐదోరోజు 60 కోట్లు, ఆరోరోజు రూ.65 కోట్ల చొప్పున మార్చారుు. రోజుకు రూ.60 కోట్లు సమకూర్చాలని రాష్ట్ర అధికారులు బుధవారం కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వానికీ ఫిర్యాదు చేశారు. కానీ, పరిస్థితి మరింత దిగజారింది. గురువారం రూ.12 కోట్ల నగదే వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్ పరిధిలో నాలుగో వంతు కంటే తక్కువ పోస్టాఫీసులకు, సికింద్రాబాద్‌లో కొన్నింటికి, జిల్లాల్లోని ప్రధాన పోస్టాఫీసులకు, అది కూడా అరకొరగానే కొత్త నోట్లు అందారుు. దాంతో గురువారం నామమాత్రంగానే మార్పిడి జరిగింది.
పేరుకుపోతున్న పాత నోట్లు
మరోవైపు పోస్టాఫీసులకు నిత్యం రూ.55 కోట్లకు తగ్గకుండా పాత నోట్లు వస్తుండటంతో వాటిని స్టేట్‌బ్యాంకులకు పంపుతున్నారు. కానీ తమ వద్దే భారీగా నోట్లు పేరుకుపోతున్నందున తీసుకోలేమని అవి బదులిస్తుండటంతో పోస్టాఫీసుల్లో పాత నోట్లు కుప్పలు పడుతున్నారుు. వాటిని ఎక్కడ దాచాలో కూడా తెలియని గందరగోళం నెలకొంది. ప్రస్తుతం పోస్టాఫీసుల వద్ద రూ.250 కోట్ల వరకు పాత నోట్ల నిల్వ ఉంటుందని అధికారులంటున్నారు.