న్యూఢిల్లీ: భారతీయులకు డాలర్ల అవసరం పెరుగుతోంది. విదేశీ పర్యటనలు, షాపింగ్, విదేశీ విద్య, పెట్టుబడులు, ఆరోగ్య అవసరాల కోసం వారు పెద్ద మొత్తంలో డాలర్లను తీసుకుని ప్రయాణం అవుతున్నారు. స్వేచ్ఛాయుత డబ్బు బదిలీ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద 2018లో బయటకు పంపిన నిధుల (రెమిటెన్స్) మొత్తం 13 బిలియన్ డాలర్లు. 2015లో ఉన్న 4.5 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ కంటే 3 రెట్లు పెరిగినట్టు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు, ఏటేటా ఈ మొత్తం భారీగా పెరుగుతుండటం గమనార్హం. విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో తమ పిల్లల చదువులు, పర్యాటకం, తమ బంధువులకు తీవ్ర అనారోగ్య కారణాలతో చికిత్సల కోసం చేసిన ఖర్చులే వీటిల్లో అధికంగా ఉన్నాయి. సంపన్నులైన వారు తమ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయులు తమ పొదుపు నిధులను స్వదేశంలోనే ఉంచడానికి పరిమితం కాకుండా, విదేశీ పెట్టుబడి అవకాశాల కోసం కూడా చూస్తున్నారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ముఖ్య ఆర్థిక వేత్త ఎస్‌కే ఘోష్ తెలిపారు.
విదేశీ విద్యకు ఎక్కువ ఖర్చు
2004లో కేంద్రం ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. విదేశాల్లో షాపింగ్, స్టాక్స్, బాండ్లు, ప్రాపర్టీలపై పెట్టుబడులు తదితర కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ లావాదేవీల కోసం ఒక ఏడాదిలో ఒక వ్యక్తి విదేశాలకు 2,50,000 డాలర్లను పంపుకునేందుకు అనుమతించారు. నలుగురున్న కుటుంబం ఈ పథకం కింద 10 లక్షల డాలర్లను ఒక ఏడాదిలో పంపుకోవచ్చు. అయితే 2015 సంవత్సరం మధ్యస్థం నాటికి ప్రతి నెలా సగటున బయటకు పంపే నిధుల మొత్తం 200–300 మిలియన్ డాలర్లను దాటిపోయింది. విదేశీ విద్య, పర్యాటకంపై చేసే ఖర్చులకూ ఈ పథకం కింద ఆర్‌బీఐ అవకాశం కల్పించడం దీన్ని మరింత విస్తృతం చేసింది. విదేశాలకు తరలించే డాలర్లలో అత్య ధికం ఈ రెండింటికే వినియోగిస్తున్నారు. విదేశీ విద్య, పర్యాటకం కోసం ఏటా వెచ్చించే మొత్తంలో పెరుగుదల ఎంతో వేగంగా ఉంటోంది. ఫలితంగా బయటకు వెళ్లిపోతున్న నిధుల పరిమాణం అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ విద్య కోసం ఎక్కువ మొత్తంలో డాలర్లను భారతీయులు పంపడం వెనుక గడిచిన కొన్నేళ్లలో అక్కడ స్కాలర్‌షిప్ అవకాశాలు తగ్గిపోవడం కూడా ఒక కారణం
విదేశీ పెట్టుబడులు
ఇక అమెరికా, బ్రిటన్‌లో మన వారు పెట్టుబడులకూ ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం. టెక్నాలజీ పరంగా అక్కడి కంపెనీలకు ఎక్కువ వృద్ధి అవకాశాలు ఉండటం మనవారిని పెట్టుబడుల కోసం అటువైపు ఆకర్షిస్తోంది. చాలా వరకు పెట్టుబడి పథకాలు, విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ సైతం గూగుల్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. ఈ కంపెనీలకు భారత్‌లో పోటీనిచ్చేవి లేకపోవడం, వీటిల్లో పెట్టుబడులకు మొగ్గుచూపేలా చేస్తోంది. ‘‘పిల్లల విద్య కోసం, విదేశీ పర్యటనల కోసం చేసే వ్యయాలకు తోడు, డాలర్‌తో రూపాయి బలహీనత, ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి వల్ల చాలా మంది హెచ్‌ఎన్‌ఐలు విదేశాల్లో పెట్టుబడి అవకాశాల కోసం చూస్తున్నారు’’ అని ఖైతాన్ అండ్ కంపెనీ పార్ట్‌నర్ మోయిన్‌లద్ధా తెలిపారు. మెరుగైన సదుపాయం కోసం ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకురాగా, కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఆర్‌బీఐ తన పర్యవేక్షణను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా ఈ పథకం కింద రోజువారీ లావాదేవీల వివరాలను రిపోర్ట్ చేయాలని ఆర్‌బీఐ గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది.
మన డాలర్లకు రెక్కలు..!
Published Wed, Feb 20 2019 2:12 AM | Last Updated on Wed, Feb 20 2019 2:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment