రూ. 5,000 కోట్ల నోట్లు పంపండి
⇒ రిజర్వు బ్యాంకుకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
⇒ బ్యాంకులు, ఏటీఎంలన్నింటా నోట్ల కొరత
⇒ ఆర్‌బీఐ డబ్బులివ్వడం లేదంటున్న బ్యాంకర్లు
⇒ 7,548 ఏటీఎంలలో పనిచేస్తున్నవి కేవలం 1,658
⇒ బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్‌స
⇒ పరిస్థితుల అంచనా కోసం నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర నగదు కొరత నుంచి గట్టెక్కేందుకు.. వెంటనే రాష్ట్రానికి రూ.5,000 కోట్ల విలువైన కొత్త, చిల్లర నోట్లను పంపించాలని ప్రభుత్వం రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కు లేఖ రాసింది. రాష్ట్రంలోని చాలా బ్యాంకుల్లో నగదు లేదని, అత్యధిక శాతం ఏటీఎంలు పనిచేయడం లేదని నివేదించింది. పాత నోట్ల మార్పిడి కోసం, తమ అవసరాలకు డబ్బును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వివరించింది.
అన్నీ రూ. 2 వేల నోట్లే..!
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత ఆర్‌బీఐ తెలంగాణలోని బ్యాంకులకు రూ.8,000 కోట్ల విలువైన నోట్లను పంపిణీ చేసింది. అయితే వాటిలో అత్యధికం రూ.2 వేల నోట్లు, మిగతావి రూ.వంద నోట్లు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇప్పటివరకు అంతకు రెట్టింపు స్థాయిలో నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. దాదాపు రూ.6,000 కోట్లకుపైగా నగదు మార్పిడి జరిగింది. నోట్ల రద్దుతో పాటు నగదు ఉపసంహరణ ఆంక్షలతో మార్కెట్లో చిన్న నోట్ల కొరత తలెత్తింది. కొత్తగా విడుదల చేసిన రూ.2 వేల నోట్లు అందుబాటులో ఉన్నా... వాటిని చిల్లర మార్చుకునేందుకు ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రానికి కొత్త రూ.500 నోట్లు పంపిణీ కాకపోవడంతో చిల్లర సమస్య మరింత ఎక్కువగా తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈసారి పంపిణీ చేసే నగదులో రూ.2వేల నోట్లకు బదులు రూ.500, రూ.100, రూ.50 నోట్లు ఎక్కువగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐని కోరింది.
ఏటీఎంలు ఉండీ లేనట్లే..
రాష్ట్రంలోని కొన్ని బ్యాంకుల్లో నగదు లేదని.. ఏటీఎంలలో అత్యధికం పనిచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి మంగళవారం అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్ల ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌సలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రజలు నోట్లు మార్చుకునేందుకు, నగదు ఉపసంహరణ కోసం పడుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 7,548 ఏటీఎంలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పటివరకు 3,620 ఏటీఎంలను కొత్త నోట్ల జారీకి వీలుగా సిద్ధమయ్యాయని, ఇందులో 1,653 ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉందని బ్యాంకర్లు నివేదించారు. ఆధునీకరణకు నోచుకోని ఏటీఎంలలో అత్యధికంగా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఆంధ్రా బ్యాంకులకు చెందినవే ఉన్నాయి.
ఆర్‌బీఐ తమకు సరిపడేంత డబ్బు ఇవ్వడం లేదని, దీంతో తమ ఏటీఎంలు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవలు అందించలేకపోతున్నామని యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. వీరితో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, సిండికేట్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, యూకో బ్యాక్, టెస్కాబ్‌లు తమ బ్రాంచీల్లోనూ నగదు లేకపోవడంతో ఖాతాదారులను తిప్పి పంపించాల్సి వస్తోందని వెల్లడించారుు. ముందుగా పంపిణీ చేసిన రూ.8,000 కోట్లలో కొంతమేరకు తిరిగి ఖాతాల్లోకి వస్తుందని అంచనా వేశామని.. కానీ అన్నీ చెల్లుబాటు కాని నోట్లే జమవుతుండటంతో... సరిపడేన్ని నోట్లు తిరిగి బ్యాంకులకు ఇవ్వలేకపోతున్నామని ఆర్‌బీఐ వర్గాలు సైతం వివరించినట్లు తెలిసింది.
నేడు కేంద్ర బృందం రాక
రాష్ట్రంలో నోట్ల రద్దు పరిణామాలను అధ్యయనం చేసేందు కు కేంద్ర అధికారుల బృందం బుధవారం (నేడు)రాష్ట్రానికి రానుంది. కేంద్ర మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ బృందంలో ఉంటారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఈ బృందం పర్యటిస్తుంది. వివిధ రంగాలపై పడిన ప్రభావాన్ని తెలుసుకునేందుకు సం బంధిత శాఖల అధికారుల తోనూ భేటీ అవుతుంది.