నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు
నేటి నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు
Published Mon, Feb 20 2017 9:37 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు విత్ డ్రా పరిమితులతో ఇబ్బందులు పడ్డ ఖాతాదారులకు నేటి నుంచి ఓ శుభవార్త. సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నేటి నుంచి వారానికి రూ.50వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. జనవరి 30న జారీచేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రాలపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పిన ఆర్బీఐ, ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ వారానికి రూ.50వేలు డ్రా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఈ పరిమితి రూ.24వేలుగా ఉండేది. మార్చి 13 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నారు. ప్రస్తుతమైతే, కరెంట్ అకౌంట్ హోల్డర్స్కు నగదు విత్ డ్రాలపై ఎలాంటి పరిమితులు లేవు.
వ్యవసాయదారులైతే వారానికి రూ.50 వేలు, వివాహానికి రూ.2.5 లక్షల విత్ డ్రాయల్స్ను అనుమతిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేసిన అనంతరం రిజర్వు బ్యాంకు ఏటీఎంలలలో, బ్యాంకు బ్రాంచులలో నగదు విత్ డ్రాయల్స్పై ఆంక్షలు విధించింది. కొద్దికొద్దిగా కరెన్సీ కష్టాలు తొలగిస్తూ వస్తున్న ఆర్బీఐ, వారానికి విత్ డ్రా పరిమితిని రూ.50వేలకు పెంచిన సంగతి తెలిసిందే.
Advertisement