ఆర్‌బీఐ పాలసీపైనే చూపు
♦ కొన్ని కీలక కంపెనీల ఫలితాలు ఈ వారంలోనే
♦ ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం
♦ ఈ వారం మార్కెట్ గమనంపై అంచనాలు
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ వెలువరించే ద్రవ్య పరపతి విధానం, ఎస్‌బీఐ, హీరో మోటోకార్ప్ తదితర కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి, పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఈ అంశాలన్నీ ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు వర్షపాత విస్తరణ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం.. తదితర అంశాల ప్రభావమూ ఉంటుందని వారంటున్నారు.
యథాతథంగానే రేట్లు...
రెండు నెలలకొకసారి నిర్వహించే ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష ఈ మంగళవారం(ఈ నెల 9న) జరగనున్నది. కాగా కీలక రేట్లలో యథాతథ స్థితిని ఆర్‌బీఐ కొనసాగించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఆర్‌బీఐ పాలసీ, కంపెనీల ఆర్థిక ఫలితాలపైననే అందరి చూపు ఉంటుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కంపెనీల క్యూ1 ఫలితాల వెల్లడి దాదాపు పూర్తికావచ్చిందని పేర్కొన్నారు.
శుక్రవారం కీలక గణాంకాలు..
ఈ వారంలో పలు కీలక కంపెనీలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 12(శుక్రవారం) వెలువడనున్నాయి. అదే రోజు జూలై నెల వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వెల్లడికానున్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, వివిధ దేశాల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారంలో వెలువడనున్నాయి. జూన్ నెల జర్మనీ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సోమవారం, ఇంగ్లండ్ జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాం కాలు మంగళవారం రోజున, జూలై నెల చైనా పారిశ్రామిక గణాంకాలు గురువారం వెలువడతాయి.
కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల జోరు
భారత స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరు కొనసాగుతోంది. రాజ్యసభలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా ఈ నెల మొదటివారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,290 కోట్లు పెట్టుబడులు పెట్టారు.