స్టేట్బ్యాంకుకు రూ. 5.6 లక్షల జరిమానా
కరెన్సీ చెస్ట్ నిబంధనలను అతిక్రమించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వు బ్యాంకు 5.6 లక్షల రూపాయల జరిమానా విధించింది. కరెన్సీ చెస్టులను తెరిచి, నిర్వహించే విషయంలో తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో మొత్తం 5,62,555 రూపాయల జరిమానాను విధించినట్లు రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
అంతకుముందు గత నెలలో నో యువర్ కస్టమర్, మనీలాండరింగ్ నిరోధక పద్ధతులు సరిగా పాటించనందుకు స్టేట్ బ్యాంకుకు మూడుకోట్ల రూపాయల జరిమానాను రిజర్వు బ్యాంకు విధించింది. ఒక ఆన్లైన్ పోర్టల్ ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో రిజర్వు బ్యాంకు ఈ చర్యలు తీసుకుంది. ఈ కేసులో అన్ని రకాల వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం స్టేట్ బ్యాంకు తగిన విధంగా వ్యవహరించట్లేదని నిర్ధారణకు వచ్చి, ఈ జరిమానా వడ్డించింది. బ్యాంకు ఖాతాలు తెరిచేటప్పుడు, లాకర్లు కేటాయించేటప్పుడు కేవైసీ పద్ధతులు పాటించకపోవడంతో వారు తమ నల్లడబ్బును తెల్లగా మార్చుకుని నకిలీ పాన్ కార్డులు కడా పొందుతున్నట్లు తేలింది.