పిల్లల కోసం ఎస్‌బీఐ ప్రత్యేక స్కీము
ముంబై: పదేళ్లకు మించిన మైనర్లు సొంతంగా బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడానికి, లావాదేవీలు నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన నేపథ్యంలో బాలల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తామని బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది. ‘మైనర్ల అకౌంట్లకు సంబంధించి ఓవర్‌డ్రాఫ్టులపై ఆంక్షలున్నాయి. ఓవర్‌డ్రాఫ్టులుంటే వాటిని వసూలు చేయలేం. డిపాజిట్లపై ఆంక్షల్లేవు.
బాలల కోసం మూడునెలల్లో ప్రత్యేక పథకాన్ని మేం ప్రారంభిస్తాం’ అని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య గురువారం ముంబైలో మీడియాకు తెలిపారు. బ్యాంకింగ్ సౌకర్యాలను అందరికీ అందుబాటులోకి తేవడమే రిజర్వ్ బ్యాంకు ఉద్దేశమని చెప్పారు. ముందుగా చెల్లించే చర వడ్డీ రుణాలపై ప్రీపేమెంట్ పెనాల్టీ వసూలు చేయవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలు ఎస్‌బీఐపై ఎలాంటి ప్రభావం చూపుతాయని ప్రశ్నించగా, తమ బ్యాంకులో అలాంటి చార్జీలేవీ లేవని బదులిచ్చారు