ఆన్‌లైన్‌లో కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశం
కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయొద్దని ఆంక్షలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్‌బీఐ పేర్కొంది.
అయితే, క్రెడిట్ కార్డు కస్టమర్లు సహా ప్రస్తుతమున్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకు ఎక్స్‌టర్నల్ ఆడిట్‌ను నిర్వహించి, అందులో బయటపడే సమస్యలను, తాము గు ర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్న కారణంగా 2020 డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై కూడా ఆర్‌బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఐటీ సంబంధ తనిఖీలో కీలకాంశాలు
2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధ తనిఖీల్లో తీవ్ర ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నిబంధనలను పాటించకపోవడం మొదలైన వాటిని గుర్తించాం‘ అని వివరించింది. వాటిని సమగ్రంగా, సకాలంలో పరిష్కరించడంలో బ్యాంకు నిరంతరం వైఫల్యం చెందుతున్న కారణంగా తాజా చర్యలు తీసుకోవాల్సి వచి్చందని ఆర్‌బీఐ తెలిపింది.
పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు, రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కోర్ బ్యాంకింగ్ సిస్టం (సీబీఎస్), ఆన్‌లైన్ .. డిజిటల్ బ్యాంకింగ్ మాధ్యమాలు గత రెండేళ్లుగా తరచూ మొరాయిస్తూ, కస్టమర్లను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట వ్యాపార విభాగాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment