ప్రీపెయిడ్ సాధనాల నిబంధనలు సడలింపు
ముంబై: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా.. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల (పీపీఐ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సడలించింది. అన్‌లిస్టెడ్ కార్పొరేట్ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు మొదలైనవి తమ ఉద్యోగులకు పీపీఐలను అందించే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు బ్యాంకులు పీపీఐలను జారీ చేయొచ్చని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకులు జారీ చేసే ప్రీపెయిడ్ సాధనాలను పొందే అర్హత లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే ఉంది.
మరోవైపు, సిబ్బంది గుర్తింపు ధృవీకరణ బాధ్యతలన్నీ సదరు సంస్థ యాజమాన్యానికే ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. పీపీఐలు తీసుకుంటున్న ఉద్యోగుల వివరాలన్నీ సక్రమంగా రికార్డు చేసేలా బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సంస్థ నుంచి తగు అనుమతులు వచ్చిన తర్వాత పీపీఐలలో బ్యాంకులు నగదును లోడ్ చేస్తాయి. పీపీఐలో గరిష్టంగా రూ. 50,000 లోడ్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని వస్తు, సేవల కొనుగోలు, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ మొదలైన లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు.