పైన సాధారణ నోటు.. కింద స్టార్ నోటు
అమలాపురం టౌన్: కొన్ని కరెన్సీ నోట్లపై నోటు క్రమ సంఖ్యతో పాటు స్టార్ గుర్తు ఉంటుంది. కొన్ని నోట్లపై మాత్రమే ఈ స్టార్ గుర్తు ఎందుకు ఉంటుందనే అంశంపై ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే ఇటీవల కాలంలో స్టార్ ఉన్న నోట్లు నకిలీవి అంటూ కొంత మంది సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి స్టార్ గుర్తుతో ఉన్న నోట్లు అనేకం సేకరించిన అమలాపురానికి చెందిన కరెన్సీ నోట్ల సేకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ నోట్లపై ఈ స్టార్‌ను రిజర్వు బ్యాంకు ఎందుకు ముద్రిస్తుందో, అందుకు అనుసరించే సాంకేతిక, శాసీ్త్రయ అంశాలేమిటో వివరించారు.
స్టార్ నోట్లు ఇలా..
దేశంలోని ప్రతి కరెన్సీ నోటుపై మొదటి రెండు అంకెల తర్వాత ఒక ఆంగ్ల అక్షరం (ఒక రూపాయి నుంచి రూ.20 వరకూ), లేదా ఒక అంకె తర్వాత రెండు ఆంగ్ల అక్షరాలు (రూ.50 విలువ పైబడిన నోట్లన్నిటి మీద) ఉంటాయి. దీనిని ప్రిఫిక్స్ అంటారు. ఇలా ముద్రించిన రెండంకెలు, ఆంగ్ల అక్షరం తర్వాత కొంత ఖాళీ ఉండి.. తర్వాత ఆరంకెల క్రమ సంఖ్య ఉంటుంది. కొన్ని నోట్ల మీద ఇలా ఖాళీ ఉన్న భాగంలో స్టార్ గుర్తు ఉంటుంది. వీటిని స్టార్ నోట్లు లేదా రీ ప్లేస్‌మెంట్ నోట్లు అని అంటారు.
పాడైన నోట్ల పైనే స్టార్లు
సాధారణంగా చిరిగిపోయిన లేదా బాగా పాడైపోయిన నోట్లను బ్యాంకుల్లో జమ చేస్తాం. అవన్నీ రిజర్వు బ్యాంక్‌కు చేరతాయి. వాటిని ఒకచోట భద్రపరచి మళ్లీ అవే నంబర్లతో నోట్లు విడుదల చేస్తారు. పాత నోట్ల మీద అప్పటి గవర్నర్ సంతకం ఉంటుంది కాబట్టి వాటి మీద కొత్త గవర్నర్ సంతకం ముద్రించేందుకు వీలుగా ఈ స్టార్‌ను ముద్రిస్తారు. పాత లేదా పాడైపోయిన నోట్ల రీ ప్లేస్‌మెంట్ కోసం ఓ గుర్తుగా స్టార్‌ను ముద్రిస్తారు.
ఇంత వరకూ ఎన్ని స్టార్ నోట్లు ముద్రించామన్నది రిజర్వు బ్యాంక్ వద్ద ఉంటుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ 2006 ఆగస్టు 31న ఈ స్టార్ నోట్ల విడుదల గురించి ప్రత్యేక ప్రకటన చేసింది. ఈ స్టార్ నోట్లు కలిగి ఉన్న బండిల్స్ మీద కూడా ప్రత్యేక గుర్తు ముద్రించి ఉంటుందని కృష్ణకామేశ్వర్ తెలిపారు. ఈ స్టార్ నోట్లు కూడా సాధారణ నోట్ల మాదిరిగానే చలామణీ అవుతాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment