సెన్సెక్స్ 58 పాయింట్లు డౌన్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణులు నెలకొన్న నేపథ్యంలో దేశీ మార్కెట్లు గురువారం స్వల్పంగా క్షీణించాయి. సెన్సెక్స్ 58 పాయింట్లు, నిఫ్టీ 16 పాయింట్లు తగ్గాయి. బ్రిటన్‌లో ఎన్నికలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ విధాన సమావేశం తదితర అంశాలు దీనికి కారణమయ్యాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండొచ్చని, వ్యవసాయ రుణాల మాఫీతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందన్న రిజర్వ్ బ్యాంక్ వ్యాఖ్యలతో కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌పై ప్రభావం పడినట్లు బ్రోకింగ్ సంస్థలు పేర్కొన్నాయి. మెరుగ్గానే ప్రారంభమైనప్పటికీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రిస్కులకు ఇష్టపడని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో .. మార్కెట్లు క్షీణించినట్లు వివరించాయి.
గురువారం మెరుగ్గా 31,317 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత 31,355–31,194 శ్రేణిలో ట్రేడయి చివరికి 31,213 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 9,669–9,641 మధ్య తిరుగాడి ఆఖరికి 9,647 వద్ద క్లోజయ్యింది. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ అత్యధికంగా 1.38 శాతం క్షీణించగా .. ఐటీ 1.33 శాతం, పీఎస్‌యూ 0.60 శాతం మేర తగ్గాయి. సెన్సెక్స్ స్టాక్స్‌లో టీసీఎస్ అత్యధికంగా 3.59 శాతం పతనమైంది. నష్టపోయిన షేర్లలో ఇన్ఫోసిస్, గెయిల్, హీరోమోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ మొదలైనవి ఉన్నాయి. అయితే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా తదితర ఫార్మా స్టాక్స్ దాదాపు 3.79 శాతం దాకా పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే నికాయ్ 0.38 శాతం తగ్గగా, షాంఘై కాంపోజిట్ 0.32 శాతం, హాంగ్ సెంగ్ 0.34 శాతం పెరిగాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడయ్యాయి.
ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల వెల్లువ ..
కీలక మార్కెట్లలో వీసాలపరమైన సమస్యలు, ఇతరత్రా సవాళ్ల నేపథ్యంలో ఐటీ రంగ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టీసీఎస్ 3.59 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.30 శాతం, హెక్సావేర్ టెక్ 0.63శాతం, ఇన్ఫోసిస్ 0.54%, టెక్ మహీంద్రా 0.54శాతం, విప్రో 0.06% క్షీణించాయి. బీఎస్‌ఈ ఐటీ సూచీ 1.33 శాతం తగ్గి 10,178 వద్ద క్లోజయ్యింది. గత సెషన్లో కూడా ఐటీ స్టాక్స్ దాదాపు 5 శాతం దాకా తగ్గాయి.