మూడు రోజుల్లో 1,550 కోట్లు
రాష్ట్రానికి మొత్తంగా వచ్చిన నగదు 22 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రిజర్వు బ్యాంకు గత మూడు రోజుల్లో మన రాష్ట్రానికి రూ.1,550 కోట్ల విలువైన నగదును సరఫరా చేసింది. అందులో ఎక్కువగా రూ.500, రూ.100 నోట్లే ఉండటంతో చిల్లర కష్టాలకు ఉపశమనం లభించనుంది. ఇకపై మూడు రోజులకోసారి రాష్ట్రాలకు నగదు కేటాయించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అంటే వారంలో రెండుసార్లు నగదు రాష్ట్రానికి పంపిణీ కానుందని, దాంతో కరెన్సీ కొరత తీరుతుందని అధికారులు చెబుతున్నారు.ఇప్పటిదాకా పెద్దనోట్లే! : ఈ నెల 20, 21 తేదీల్లో తెలంగాణకు రూ.1,550 కోట్ల నగదు పంపిణీ జరిగిందని.. గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు ఆ నగదును సరఫరా చేశారని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. దీంతో నోట్ల రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన కరెన్సీ రూ.22 వేల కోట్లకు చేరింది. అయితే అందులో రూ.3 వేల కోట్లే చిన్న నోట్లు.. మిగతా సొమ్ము రూ.2 వేల నోట్లు కావడం గమనార్హం.