పొంతనలేని ఆలోచన, ఆచరణ | demonetization is worst idea and implementation | Sakshi
Sakshi News home page

పొంతనలేని ఆలోచన, ఆచరణ

Published Fri, Dec 2 2016 6:57 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

పొంతనలేని ఆలోచన, ఆచరణ - Sakshi

పొంతనలేని ఆలోచన, ఆచరణ

అభిప్రాయం
అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పెళ్లికి కేవలం రూ. 2.5 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం, మళ్లీ ఇందుకు రిజర్వు బ్యాంకు అనేక నిబంధనలు పెట్టడం మరీ విడ్డూరం. నోట్లు మార్చుకోవడానికి వెళ్లినవారి వేళ్లకు గుర్తులు వేయడం కూడా అవమానకరమే. ఖరీఫ్ సీజన్ తుది దశకు చేరుకుని, పంటల నూర్పిళ్లు, కోతలు దగ్గర పడినాయి. వెంటనే రబీ సాగుకు సన్నద్ధం కావాలి. ఇలాంటి పరిస్థితిలో గ్రామ సహకార పరపతి సంఘానికి వారానికి రూ. 50 వేలు మాత్రం ఇవ్వడం ఏం సబబు?
 
నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. నల్లధనానికీ, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడంతో పాటు, ఉగ్రవాదులకు నగదు సరఫరా కూడా ఈ చర్యతో ఆగుతుందని ప్రధాని ప్రకటించారు. దేశ పౌరులు గానీ, రాజకీయ పక్షాలు గానీ ఈ లక్ష్య సాధనను వ్యతిరేకిస్తున్నాయని అనుకోనక్కరలేదు. ఇప్పుడు వస్తున్న విమర్శలు, అభిప్రాయాలు అన్నీ డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు)కు అనుసరించిన పద్ధతి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం గురించే. 2013 నాటి భూసేకరణ చట్టంలో చేర్చిన ‘సామాజిక ప్రభావ అంచనా’ పద్ధతిని డీమోనిటైజేషన్ విషయంలో కూడా కేంద్రం అనుసరించి ఉంటే నేడు కోట్లాదిమందికి ఈ ఇబ్బందులు తప్పేవి.
 
దేశంలో అప్రకటిత బినామి ఆస్తులు, పన్ను ఎగవేత, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారుల అవినీతి చర్యల ద్వారా మొత్తంగా పోగుపడిన సంపద దాదాపు రూ. 30 లక్షల కోట్లని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందులో నగదు రూపంలోని నల్లధనం 3 నుంచి 4 లక్షల కోట్లు ఉండవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొన్ని నెలల క్రితం ప్రకటించిన స్వచ్ఛంద వెల్లడి పథకం ద్వారా దాదాపు రూ. 65 వేల కోట్ల అప్రకటిత ఆదాయానికి సంబంధించిన వివరాలు కేంద్రానికి అందాయి. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో ఏ దశలలో, ఏఏ వర్గాలకు సంబంధించి ఏఏ చర్యలు తీసుకోవాలో సరైన ఆలోచన జరగలేదన్న విషయం వాస్తవం. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధానం చూస్తే, తిమింగలాలను వదిలి, చిరు చేపలను పడుతున్నట్టే ఉంది.

1947 నుంచి చూస్తే విదేశాలలో భారతీయుల సంపద రూ. 45 లక్షల కోట్లు పైనేనని ఒక అంచనా. పలువురు రాజకీయ నాయకుల పేర్ల మీద, హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వంటి వ్యాపార వర్గాలకు చెందిన దాదాపు వేరుు మంది పేర్ల మీద స్విస్ బ్యాంకులలో, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌‌స, మారిషస్, సింగపూర్‌లలోని బ్యాంకులలో లక్షల కోట్లు ఉన్నాయని పనామా పత్రాలు, వికీలీక్స్ బయటపెట్టినా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశాలలోని భారతీయుల ఖాతాలలో 500 బిలియన్ డాలర్ల సంపద ఉందని ఫిబ్రవరి, 2012న సుప్రీంకోర్టుకు ఇచ్చిన పత్రంలో ప్రభుత్వం పేర్కొన్నది.

మొన్నటి ఎన్నికలలో బీజేపీ విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న మన నల్లడబ్బును స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న. మోదీ ప్రధాని హోదాలో అనేక దేశాలలో పర్యటించారు. అప్పుడు విదేశాలలో మూలుగుతున్న భారతీయుల అక్రమ సంపదను రాబట్టేందుకు గట్టిగా కృషి చేసి ఉంటే అది స్వదేశానికి చేరడానికి వీలుం డేది కదా! కాబట్టి విదేశాలలోని నల్లడబ్బును తెచ్చేందుకు మోదీ చేసిన కృషి స్వల్పం. ఇంకా చిత్రం-విదేశాలలోని భారతీయుల నల్లధనం ఇప్పటికీ మారిషస్, సింగపూర్ వంటి దేశాల నుంచి మనీల్యాండరింగ్ పద్ధతిలో, ఇంకా రౌండ్ టిప్పింగ్, పార్టిసిపేటరీ నోట్స్ పేరిట దేశానికి తిరిగి వస్తున్నది.
 
రైతుల దగ్గర అంత ఆదాయమా?
మరికొందరు నల్లధనాన్ని సక్రమ ఆదాయంగా చూపడానికి సేద్యాన్ని వాడుకుంటున్నారు. అడ్డగోలుగా వారి వద్ద పోగుపడిన సంపద వ్యవసాయం నుంచి వచ్చిందంటూ ఆదాయ పన్ను శాఖకు చెబుతున్న లక్షలాది మంది ఖాతాదారులపైన చర్యలు తీసుకుని ఉంటే లక్షల కోట్ల అక్రమార్జనలు వెలుగులోకి వచ్చేవి. దేశంలో వ్యవసాయ ఆదాయం మీద పన్ను లేదు. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు దీనిని అవకాశంగా తీసుకుని తమకు కోట్లాది రూపాయలు వ్యవసాయం ద్వారా లభిస్తున్నాయని చూపించుకోవడానికి అవకాశం చిక్కింది. ఈ ధోరణి 2007 నుంచి కనిపిస్తున్నది. ఉదాహరణకు- 2007లోనే 78,794 మంది తమ సగటు వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 2.9 లక్షలుగా చూపించారు. 2010లో 4,25,085 మంది తమ వార్షిక వ్యవసాయ ఆదాయం 19.7 లక్షలుగా నమోదు చేయించారు. తరువాత ఈ ధోరణి విశ్వరూపం దాల్చింది.

2011లో అనూహ్యంగా 6,56,944 మంది సగటు వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 30.04 కోట్లుగా ప్రకటించారు. 2012లో 8,12,426 మంది సగటు వ్యవసాయ వార్షిక ఆదాయాన్ని రూ. 874 లక్షల కోట్లుగా చూపారు. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఎన్నో రెట్లు అధికం. విజయ్‌శర్మ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త పట్నా హైకోర్టులో వేసిన పిటిషన్ మేరకు ఇన్‌కమ్‌ట్యాక్స్ డెరైక్టరేట్ ఈ వివరాలు వెల్లడించింది. కాబట్టి ఈ వ్యవహారం మీద ఆదాయ పన్ను శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖలు తీసుకున్న చర్యల గురించి దేశానికి తెలియచేయాలి.
 
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులకు రావలసిన మొండి బకాయిలు లక్షల కోట్లలో ఉన్నాయి. వీటిని చెల్లించవలసిందంటూ మొన్నటిదాకా ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ ఈ సంవత్సరమే నోటీసులు కూడా ఇచ్చారు. ఇలా బకాయిలు పడిన ఆ సంస్థల ఆస్తుల విలువ బ్యాంకులకు చెల్లించవలసిన అప్పులో 3వ వంతు కూడా లేవు. ఉదాహరణకు అనిల్ అంబానీ ఆస్తుల విలువ రూ. 60 వేల కోట్లు, అప్పు లక్షా 24 వేల కోట్లు గత 10 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా ఇన్‌కంట్యాక్స్, ఎక్సైజ్‌డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, రాయితీలను ఈ బడా కంపెనీలకు అందజేస్తూ ఉన్నా పర్యవసానంగా దాదాపు రూ. 4 నుండి రూ. 5 లక్షల కోట్ల మేరకు కేంద్రం ఆదాయాన్ని కోల్పోతూ ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బడా బాబులకు దాదాపు రూ. 1.12 లక్షల కోట్ల మేరకు రుణమాఫీ ఇచ్చింది. రైతులు, చిరు వ్యాపారులు, చిన్న మధ్యతరహా పరిశ్రమల యూనిట్ల నుండి రుణ వసూళ్ల విషయంలో అత్యంత కర్కశంగా ఆస్తులను కూడా వేలం వేసే జాతీయ బ్యాంకులు ఈ పెద్ద వ్యాపారస్తుల ఎడల మెతక వైఖరిని అవలంబిస్తూ ఉండటం గమనార్హం.
 
గ్రామీణ ప్రజలకు ఒరిగేది ఏమిటి?
పెద్ద నోట్ల రద్దుకు పూర్వం తమ ఖాతాలలో ప్రజలు దాచుకున్న ధనాన్ని వారి వారి అవసరాల కోసం తీసుకునే సౌకర్యం కూడా ప్రస్తుతం లేకపోవడం అన్యాయం. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పెళ్లికి కేవలం రూ. 2.5 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం, మళ్లీ ఇందుకు రిజర్వు బ్యాంకు అనేక నిబంధనలు పెట్టడం మరీ విడ్డూరం. నోట్లు మార్చుకోవడానికి వెళ్లినవారి వేళ్లకు గుర్తులు వేయడం కూడా అవమానకరమే. ఖరీఫ్ సీజన్ తుది దశకు చేరుకుని, పంటల నూర్పిళ్లు, కోతలు దగ్గర పడినాయి. వెంటనే రబీ సాగుకు సన్నద్ధం కావాలి. ఇలాంటి పరిస్థితిలో గ్రామ సహకార పరపతి సంఘానికి వారానికి రూ. 50 వేలు మాత్రం ఇవ్వడం ఏం సబబు? సభ్యులకు ఇది ఏ విధంగా ఉపకరిస్తుంది? దేశంలో అన్ని వర్గాల ప్రజలు నోట్లతో ఇబ్బంది పడుతున్నారు. క్యూలలో నిలబడిన వారిలో దాదాపు 70 మంది చనిపోవడం శోచనీయం.
 
ఏ విధంగా చూసినా డీమోనిటైజేషన్ నిర్ణయం నల్లధనాన్ని అరికట్టాలన్న లక్ష్యంతో పాటు కొన్ని ఇతర రాజకీయ ప్రయోజనాలను కూడా ఆశించి తీసుకున్నట్టే ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలలో ఈ చర్య ద్వారా విపక్షాలను చిత్తు చేయాలన్న వ్యూహం అందులో ఒకటి. డీమోనిటైజేషన్ ద్వారా బ్యాంకులకు రూ. 3 నుంచి 4 లక్షల కోట్ల మేరకు (నల్లధనం మురిగిపోతుందని అంచనా వలన) లబ్ధి చేకూరుతుందని, ఆ మేరకు నూతనంగా కరెన్సీ ముద్రించుకుని బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచుకోవచ్చునని కేంద్రం భావిస్తున్నది. అరుుతే ఈ ధనం తిరిగి పెద్ద పెద్ద పారిశ్రామిక, వ్యవసాయ వేత్తలకే వెళ్తుంది. అంతేతప్ప సామాన్యులకు ఏదో ఒరుగుతుందని ఆశిస్తే అవివేకమే. గ్రామీణ ప్రజలు, రైతుల అవసరాల ఎడల బ్యాంకులు చూపుతున్న పక్షపాత ధోరణి ఇందుకు నిదర్శనం. గ్రామాలలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోగా వచ్చిన ధనాన్ని దాచడానికి, అవసరానికి రుణం తీసుకొనడానికి కూడా సహకార బ్యాంకులపై ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు వారందరికీ ఎనలేని కష్టాలు వచ్చి పడ్డాయి.
 
తక్షణ-దీర్ఘకాలిక చర్యలు అవసరం
దేశంలో స్టేట్ బ్యాంకుతో సహా ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల శాఖలు 3,997. ప్రైవేటు రంగంలో 1,987 బ్యాంకు శాఖలు, సహకార రంగంలో 933 శాఖలు ఉన్నాయి. అయితే ఇటీవల రిజర్వు బ్యాంకు అందించిన  కొత్తనోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలకు అందజేసిన దానికన్నా, కొద్ది సంఖ్యలోనే ఉన్న ప్రైవేటు బ్యాంకులకు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా అందచేయటం ఏమి సబబు? పర్సంటేజి కమీషన్లతో పాత పెద్దనోట్ల మార్పిడులు జరిగాయన్న సమాచారంలో ప్రైవేటు బ్యాంకులదే పెద్ద పాత్ర అని తెలుస్తూనే ఉంది. మోదీ ప్రభుత్వం ప్రధానంగా  హెచ్చు స్థాయిలో నల్లధనం పోగుపడడానికి అవకాశం ఉన్న రియల్ ఎస్టేట్ రంగం, బినామీ ఆస్తులు, పన్ను ఎగవేత అంశం, విదేశాల నుండి నల్లధనం రాబట్టడం, రాజకీయ, ఉద్యోగ రంగాలలో అవినీతి వంటి అంశాలపై తక్షణం దృష్టి సారించి, అవసరమైన మేరకు చట్టాలను సవరించి, కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని రాబట్టి సామాన్య ప్రజల అవసరాలను తీర్చే విధంగా రుణ పరపతి సౌకర్యాన్ని విస్తరింపజేయటం  అవసరం.

ప్రస్తుతం నగదు లావాదేవీలలో అనుసరిస్తూ ఉన్న పరిమితులను సడలించి, సామాన్య ప్రజానీకం దైనందిక జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వెనువెంటనే చర్యలను చేపట్టాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పరిధిలో ఉన్న సహకార సంఘాల పట్ల వివక్ష చూపకుండా జాతీయ బ్యాంకులకు ఏ విధమైన నియమ నిబంధనలను విధించారో అవే సూత్రాలను సహకార బ్యాంకులకు కూడా వర్తింపజేసి నగదు లావాదేవీలు నిర్వహించే అవకాశాలు కల్పించి సంక్షోభాన్ని వెంటనే నివారించవలసిన అవసరం ఉంది. గాంధీజీ చెప్పినట్టు లక్ష్యమే కాదు, మార్గం కూడా సజావుగా ఉండాలి.
 

వడ్డే శోభనాద్రీశ్వరరావు
వ్యాసకర్త మాజీ మంత్రి, మాజీ ఎంపీ
ఈ-మెయిల్ : vaddesrao@yahoo.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement