* ఆగస్టు 13న ఎస్‌ఎల్‌బీసీ సమావేశం
సాక్షి. హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్‌పై ఆర్‌బీఐ కోరిన సమాచారాన్ని తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు మంగళవారం పంపించారు. 2013 ఖరీఫ్ సీజన్‌లో 50 శాతం పంట దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాల వివరాలు ఇవ్వాలని, ఒకవేళ రుణాల రీ షెడ్యూల్ చేస్తే ప్రభుత్వం ఏ విధంగా ఆ నిధులను సర్దుబాటు చేస్తుందని, ఆదాయమార్గాలు ఏమిటని ఆర్‌బీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీంతో పూర్తి వివరాలతో ప్రభుత్వం లేఖ రాసింది. పంట దిగుబడి సరాసరిని చూడొద్దని ఆర్థికశాఖ ఆర్‌బీఐని కోరింది.
నిధుల సమీకరణలో భాగంగా.. భూముల విక్రయం, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, పన్నుల వసూళ్లలో లోపాలను అధిగమించ డం, మొండిబకాయిల వసూళ్లు, ప్రభుత్వం పొదుపు చేసిన నిధులను బ్యాంకులకు చెల్లించడానికి వినియోగించనున్నట్టు ఆర్థికశాఖ అధికారులు రిజర్వ్‌బ్యాంకుకు వివరించనున్నారు. పంటల నూర్పిడి సమయంలో భారీవర్షాల కారణంగా రైతులు పంటలు పోయి తీవ్రంగా నష్టపోయారని ఆర్థికశాఖ వివరించింది.
ఈ లేఖపై ఆర్‌బీఐ స్పందన ఎలా ఉంటుందో తెలియదు కాని, మంగళవారం రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. 50% తక్కువ దిగుబడి వస్తేనే రీ షెడ్యూల్ సాధ్యమని, ఆ విధంగా తక్కువ దిగుబడి వచ్చిన వాటి ప్రాంతాల గురించి సమాచారం ఇవ్వాలని ఆ ప్రభుత్వాలను కోరినట్టు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం ఈ నెల 13న నిర్వహించనున్నట్టు తెలిసింది.
ఆర్‌బీఐ కోరిన సమాచారం పంపిన తెలంగాణ
Published Wed, Aug 6 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement