Telangana Finance Department
-
కేంద్రం కొర్రీ.. రాష్ట్రం వర్రీ.. తెలంగాణ సర్కారుకు భారీ ఝలక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం భారీ ఝలక్ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ నుంచి రూ.52,167 కోట్ల రుణాలను సమీకరించనున్నట్టు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రూ.19వేల కోట్ల మేర రుణాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కోత విధించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.33వేల కోట్లకు మించి అప్పు లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి తీవ్ర ఇక్కట్లు తప్పేటట్టు లేవు. కేంద్రం ఆంక్షలతోనే కోత రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులపై కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన తీవ్ర ఆంక్షలతోనే రాష్ట్రానికి రావాల్సిన అప్పులకు గండిపడినట్టు సమాచారం. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న బడ్జెట్ అప్పులతోపాటు వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను సైతం ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోకి తెస్తున్నట్టు కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. గత రెండేళ్లలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి ఎంత మేర అధిక అప్పులు తీసుకుని ఉంటే ఆ మేర అప్పులను 2022–23 సంవత్సరానికి సంబంధించిన అప్పుల్లో కోత విధిస్తామని చెప్పింది. రాష్ట్రానికి రావాల్సిన అప్పులను సైతం కొంతకాలంపాటు నిలుపుదల చేసింది. దీనిపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ సైతం రాశారు. ఆ తర్వాత కొద్దిగా ఉపశమనం కల్పించింది. అయితే, ఎఫ్ఆర్బీఎం రుణపరిమితిపై కొత్తగా తెచ్చిన నిబంధనలతోనే రాష్ట్రానికి రావాల్సిన అప్పులకు కేంద్రం కోత విధించినట్టు తెలుస్తోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం.. రాష్ట్ర దేశీయ స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) విలువలో 3.5శాతం వరకు రుణాలు తీసుకోవడానికి తెలంగాణకు అనుమతి ఉంది. ఈ లెక్కన రూ.42వేల కోట్ల అప్పులను తీసుకోవడానికి అర్హత ఉందని గతంలో కేంద్రం సైతం తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.52వేల కోట్ల రుణాలను ప్రతిపాదించింది. కార్పొరేషన్లకు ఇక అప్పు పుట్టదు! రాష్ట్ర ప్రభుత్వగ్యారెంటీతో ఎఫ్ఆర్బీఎం పరిమితికి వెలుపల కార్పొరేషన్లు రుణాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను కేంద్రం కఠినంగా అమలు చేస్తుండటంతో ఇకపై కార్పొరేషన్లకు రుణాలు లభించకపోవచ్చని తెలుస్తోంది. సంబంధిత కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకు/ఆర్థిక సంస్థ మధ్య కొత్తగా త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే కార్పొరేషన్లకు రుణాలను విడుదల చేస్తామని ఆంక్షలు విధించింది. ఒప్పందం చేసుకుంటే ఈ రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం విముఖతతో ఉంది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం, ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన రుణాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నిలిచిన రూ.22వేల కోట్ల రుణాలు ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి సంస్థల నుంచి నీటిపారుదల శాఖ పరిధిలోని కార్పొరేషన్లకు రావాల్సిన రూ.22వేల కోట్ల రుణాలు ఇప్పటికే నిలిచిపోగా, ఇక భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పీఎఫ్సీ నుంచి జెన్కోకు రావాల్సిన రుణాలకు మాత్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో విద్యుత్ ప్లాంట్ ద్వారా వచ్చే ఆదాయంతో ఈ రుణాలను తీర్చడానికి వీలుండటంతో కేంద్రం అనుమతిచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీటిని రైతులకు ఉచితంగా సరఫరా చేస్తుండటంతో సంబంధిత కార్పొరేషన్లకు ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఈ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తేవాలని కేంద్రం ఒత్తిడి చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. -
సర్వీసు పరిగణన 58 ఏళ్ల వరకే
♦ ఆ తర్వాత చెల్లుబాటు కాదు ♦ ఉత్తర్వులిచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీలో భాగంగా తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల రిటైర్మెంట్, సర్వీసు కాలంపై స్పష్టత ఇస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగుల పదవీ కాలాన్ని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం యథాతథంగా 58 ఏళ్ల పదవీ కాలాన్ని కొనసాగించింది. అయితే 58 ఏళ్లకు పైబడ్డ ఉద్యోగులు ఇప్పటికీ ఏపీలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల తుది కేటాయింపులో వీరు తెలంగాణకు వస్తే సర్వీసు కాలం, రిటైర్మెంట్ తేదీని ఎలా పరిగణించాలనే చిక్కుముడి తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందుకు సంబంధించిన స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం (జీవో నం.47) ఉత్తర్వులు జారీ చేశారు. 58 ఏళ్లకు మించి ఏపీలో పనిచేసిన ఉద్యోగులు తుది పంపిణీలో తెలంగాణకు వచ్చినట్లయితే వారి రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లు నిండిన తేదీనే పరిగణించాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేశారు. ఆ వయస్సు దాటి పని చేసిన కాలాన్ని ‘జస్ట్ సర్వీస్’గా పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. పెన్షన్ ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లకు ఈ కాలం చెల్లుబాటు కావని... ఈ అదనపు కాలంలోని లీవులు సైతం పరిగణనలోకి రావని పేర్కొంది. -
పాత పద్ధతిలోనే అదనపు పెన్షన్
గ్రాట్యుటీ పెంపునకు గ్రీన్‌సిగ్నల్ * సీఎం ఆమోదానికి పంపిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ సిఫారసులను యధాతథంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల విషయంలో వెనకాడుతోంది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న అదనపు పెన్షన్ (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్)ను పెంచేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ విముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ విధానాన్ని యధాతథంగానే కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌కు సంబంధించి పీఆర్సీ సిఫారసుల ప్రకారమే ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రెండింటికీ సంబంధించిన ఫైళ్లను ఆర్థికశాఖ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించింది. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పీఆర్సీ సిఫారసుల్లో హేతుబద్ధంగా లేని అంశాలపైనే తమ అభ్యంతరాలు తెలిపినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తే అందించే డెత్ అలవెన్స్‌ను పెంచాలని పీఆర్సీ కమిషన్ చేసిన సిఫారసును ఆర్థిక శాఖ అంగీకరించింది. వారి కుటుంబీకులు మరణించినప్పుడు కూడా ఈ అలవెన్స్ ఇవ్వాలనే సూచనను తోసిపుచ్చింది. ప్రస్తుతం 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేసే విధానం అమలవుతోంది. అంతవరకు ఉన్న పెన్షన్‌కు 15 శాతం అదనంగా కలిపి చెల్లిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ అదనపు పెన్షన్ అయిదేళ్లకోసారి అయిదు శాతం చొప్పున పెరుగుతుంది. ఒకే హోదాలో పని చేసినప్పటికీ పదేళ్ల కిందట రిటైరైన ఉద్యోగులకు.. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌లో భారీగా వ్యత్యాసముంటోంది. ఇది సరికాదని తొమ్మిదో పీఆర్సీ పేర్కొంది. పదో పీఆర్సీ ఈ అదనపు పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచే అందించాలని సూచించింది. కానీ ఆ సిఫారసుకు హేతుబద్ధత లేదని ఆర్థిక శాఖ పేర్కొంటోంది. -
ఆర్బీఐ కోరిన సమాచారం పంపిన తెలంగాణ
* ఆగస్టు 13న ఎస్ఎల్బీసీ సమావేశం సాక్షి. హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ కోరిన సమాచారాన్ని తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు మంగళవారం పంపించారు. 2013 ఖరీఫ్ సీజన్లో 50 శాతం పంట దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాల వివరాలు ఇవ్వాలని, ఒకవేళ రుణాల రీ షెడ్యూల్ చేస్తే ప్రభుత్వం ఏ విధంగా ఆ నిధులను సర్దుబాటు చేస్తుందని, ఆదాయమార్గాలు ఏమిటని ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీంతో పూర్తి వివరాలతో ప్రభుత్వం లేఖ రాసింది. పంట దిగుబడి సరాసరిని చూడొద్దని ఆర్థికశాఖ ఆర్బీఐని కోరింది. నిధుల సమీకరణలో భాగంగా.. భూముల విక్రయం, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, పన్నుల వసూళ్లలో లోపాలను అధిగమించ డం, మొండిబకాయిల వసూళ్లు, ప్రభుత్వం పొదుపు చేసిన నిధులను బ్యాంకులకు చెల్లించడానికి వినియోగించనున్నట్టు ఆర్థికశాఖ అధికారులు రిజర్వ్‌బ్యాంకుకు వివరించనున్నారు. పంటల నూర్పిడి సమయంలో భారీవర్షాల కారణంగా రైతులు పంటలు పోయి తీవ్రంగా నష్టపోయారని ఆర్థికశాఖ వివరించింది. ఈ లేఖపై ఆర్బీఐ స్పందన ఎలా ఉంటుందో తెలియదు కాని, మంగళవారం రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. 50% తక్కువ దిగుబడి వస్తేనే రీ షెడ్యూల్ సాధ్యమని, ఆ విధంగా తక్కువ దిగుబడి వచ్చిన వాటి ప్రాంతాల గురించి సమాచారం ఇవ్వాలని ఆ ప్రభుత్వాలను కోరినట్టు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం ఈ నెల 13న నిర్వహించనున్నట్టు తెలిసింది.