సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం భారీ ఝలక్ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ నుంచి రూ.52,167 కోట్ల రుణాలను సమీకరించనున్నట్టు బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రూ.19వేల కోట్ల మేర రుణాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కోత విధించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.33వేల కోట్లకు మించి అప్పు లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి తీవ్ర ఇక్కట్లు తప్పేటట్టు లేవు.
కేంద్రం ఆంక్షలతోనే కోత
రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులపై కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన తీవ్ర ఆంక్షలతోనే రాష్ట్రానికి రావాల్సిన అప్పులకు గండిపడినట్టు సమాచారం. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న బడ్జెట్ అప్పులతోపాటు వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను సైతం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలోకి తెస్తున్నట్టు కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. గత రెండేళ్లలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి ఎంత మేర అధిక అప్పులు తీసుకుని ఉంటే ఆ మేర అప్పులను 2022–23 సంవత్సరానికి సంబంధించిన అప్పుల్లో కోత విధిస్తామని చెప్పింది.
రాష్ట్రానికి రావాల్సిన అప్పులను సైతం కొంతకాలంపాటు నిలుపుదల చేసింది. దీనిపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ సైతం రాశారు. ఆ తర్వాత కొద్దిగా ఉపశమనం కల్పించింది. అయితే, ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితిపై కొత్తగా తెచ్చిన నిబంధనలతోనే రాష్ట్రానికి రావాల్సిన అప్పులకు కేంద్రం కోత విధించినట్టు తెలుస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం.. రాష్ట్ర దేశీయ స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) విలువలో 3.5శాతం వరకు రుణాలు తీసుకోవడానికి తెలంగాణకు అనుమతి ఉంది. ఈ లెక్కన రూ.42వేల కోట్ల అప్పులను తీసుకోవడానికి అర్హత ఉందని గతంలో కేంద్రం సైతం తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.52వేల కోట్ల రుణాలను ప్రతిపాదించింది.
కార్పొరేషన్లకు ఇక అప్పు పుట్టదు!
రాష్ట్ర ప్రభుత్వగ్యారెంటీతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి వెలుపల కార్పొరేషన్లు రుణాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కేంద్రం కఠినంగా అమలు చేస్తుండటంతో ఇకపై కార్పొరేషన్లకు రుణాలు లభించకపోవచ్చని తెలుస్తోంది. సంబంధిత కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకు/ఆర్థిక సంస్థ మధ్య కొత్తగా త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే కార్పొరేషన్లకు రుణాలను విడుదల చేస్తామని ఆంక్షలు విధించింది. ఒప్పందం చేసుకుంటే ఈ రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం విముఖతతో ఉంది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం, ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన రుణాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే నిలిచిన రూ.22వేల కోట్ల రుణాలు
ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ వంటి సంస్థల నుంచి నీటిపారుదల శాఖ పరిధిలోని కార్పొరేషన్లకు రావాల్సిన రూ.22వేల కోట్ల రుణాలు ఇప్పటికే నిలిచిపోగా, ఇక భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పీఎఫ్‌సీ నుంచి జెన్‌కోకు రావాల్సిన రుణాలకు మాత్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో విద్యుత్ ప్లాంట్ ద్వారా వచ్చే ఆదాయంతో ఈ రుణాలను తీర్చడానికి వీలుండటంతో కేంద్రం అనుమతిచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీటిని రైతులకు ఉచితంగా సరఫరా చేస్తుండటంతో సంబంధిత కార్పొరేషన్లకు ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఈ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తేవాలని కేంద్రం ఒత్తిడి చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment