గ్రాట్యుటీ పెంపునకు గ్రీన్‌సిగ్నల్
* సీఎం ఆమోదానికి పంపిన ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్‌సీ సిఫారసులను యధాతథంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల విషయంలో వెనకాడుతోంది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న అదనపు పెన్షన్ (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్)ను పెంచేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ విముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ విధానాన్ని యధాతథంగానే కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌కు సంబంధించి పీఆర్‌సీ సిఫారసుల ప్రకారమే ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ రెండింటికీ సంబంధించిన ఫైళ్లను ఆర్థికశాఖ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించింది. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పీఆర్‌సీ సిఫారసుల్లో హేతుబద్ధంగా లేని అంశాలపైనే తమ అభ్యంతరాలు తెలిపినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తే అందించే డెత్ అలవెన్స్‌ను పెంచాలని పీఆర్‌సీ కమిషన్ చేసిన సిఫారసును ఆర్థిక శాఖ అంగీకరించింది. వారి కుటుంబీకులు మరణించినప్పుడు కూడా ఈ అలవెన్స్ ఇవ్వాలనే సూచనను తోసిపుచ్చింది. ప్రస్తుతం 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేసే విధానం అమలవుతోంది.
అంతవరకు ఉన్న పెన్షన్‌కు 15 శాతం అదనంగా కలిపి చెల్లిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ అదనపు పెన్షన్ అయిదేళ్లకోసారి అయిదు శాతం చొప్పున పెరుగుతుంది. ఒకే హోదాలో పని చేసినప్పటికీ పదేళ్ల కిందట రిటైరైన ఉద్యోగులకు.. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌లో భారీగా వ్యత్యాసముంటోంది. ఇది సరికాదని తొమ్మిదో పీఆర్‌సీ పేర్కొంది. పదో పీఆర్‌సీ ఈ అదనపు పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచే అందించాలని సూచించింది. కానీ ఆ సిఫారసుకు హేతుబద్ధత లేదని ఆర్థిక శాఖ పేర్కొంటోంది.
పాత పద్ధతిలోనే అదనపు పెన్షన్
Published Sat, Jul 11 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM
Advertisement
Advertisement