సాక్షి, న్యూఢిల్లీ : సంఘటిత రంగంలోని లక్షలాది ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రాట్యుటీ కోరేందుకు అర్హమైన ఉద్యోగుల సర్వీసును ప్రస్తుతమున్న ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించే ప్రతిపాదనను ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం దీన్ని వర్తింపచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972లో ఇందుకు అనుగుణమైన సవరణలు చేపట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకొచ్చింది. గ్రాట్యుటీ గడువును కుదిస్తే ఏర్పడే పర్యవసానాలపై పరిశ్రమ సంస్థల నుంచి కార్మిక మంత్రిత్వ శాఖ ఫీడ్‌బ్యాక్‌ను కోరినట్టు సమాచారం. పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందుంచుతారు. ఇక ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులకు గ్రాట్యుటీ కోరే అవకాశం లేకపోవగడంతో ఇక వారికీ దీన్ని వర్తింపచేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని భావిస్తున్నారు.
గ్రాట్యుటీ చట్టం ప్రకారం పది మంది అంతకు మించి ఉద్యోగులున్న ఏ సంస్థ అయినా ఐదేళ్లకు మించి సంస్థలో పనిచేస్తే వారు పదవీవిరమణ లేదా వైదొలిగే సమయంలో వారు పనిచేసిన సంవత్సరాల ప్రాతిపదికన గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా గ్రాట్యుటీ కోరే సర్వీసు అర్హతను ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలనే ప్రతిపాదన ముందుకొచ్చిన క్రమంలో కాలపరిమితిని మూడేళ్ల కన్నా మరింత తగ్గించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment