Gratuity hike
-
ఏప్రిల్ నుంచి టేక్ హోమ్ శాలరీలో కోత!
న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22) నుంచీ ఉద్యోగులకు లభించే నికర వేతనాలలో కోతపడే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం ఇకపై అలవెన్సుల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్ శాలరీని 50 శాతంగా నిర్ణయించవలసి ఉంటుందని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. 2019 కొత్త వేతన నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలయ్యే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీంతో కంపెనీలు పే ప్యాకేజీలలో సవరణలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డాయి. ఫలితంగా ఏప్రిల్ నుంచీ టేక్ హోమ్ శాలరీ తగ్గే చాన్స్ ఉన్నట్లు తెలియజేశాయి. తాజా నిబంధనలపై నిపుణులు ఏమంటున్నారంటే... చదవండి: (23,000 క్యాంపస్ ఉద్యోగాలకు రెడీ) రిటైర్మెంట్ లబ్ది కొత్త వేతన నిబంధనలు అమలైతే జీతాలలో అలవెన్స్ వాటా 50 శాతానికి మించరాదు. దీంతో బేసిక్ శాలరీ వాటా 50 శాతానికి చేర్చవలసి ఉంటుంది. ఫలితంగా గ్రాట్యుటీకోసం చెల్లింపులు, ప్రావిడెండ్ ఫండ్‌కు ఉద్యోగుల జమలు పెరిగే అవకాశముంది. వెరసి ఉద్యోగులు అందుకునే నికర వేతనాలలో ఆమేర కోత పడే చాన్స్ ఉంది. అయితే ఈ మార్పులతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరగనున్నాయి. ప్రయివేట్ రంగంలో చాల కంపెనీలు అలవెన్సుల వాటాను అధికంగా ఉంచుతూ.. నాన్అలవెన్స్ వాటాను 50 శాతానికంటే తక్కువ స్థాయిలో అమలు చేస్తున్నాయి. ఫలితంగా కొత్త వేతన నిబంధనలు ప్రయివేట్ రంగ కంపెనీలపై అధికంగా ప్రభావం చూపే వీలుంది. అయితే తాజా నిబంధనలు ఉద్యోగులకు సామాజిక భద్రతతోపాటు.. పదవీ విరమణ లాభాలను పెంచే వీలుంది. కొత్త వేతన నిబంధనలు అమలుచేస్తే కంపెనీలకు 10-12 శాతం మేర ఉద్యోగ వ్యయాలు పెరగవచ్చు. వేతన కోడ్‌ను గతేడాది పార్లమెంట్ ఆమోదించింది. తుది నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం ముసాయిదా నిబంధనలు విడుదల చేసింది. చదవండి: (జనవరి 1 నుంచి విప్రో వేతన పెంపు!) -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : సంఘటిత రంగంలోని లక్షలాది ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రాట్యుటీ కోరేందుకు అర్హమైన ఉద్యోగుల సర్వీసును ప్రస్తుతమున్న ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించే ప్రతిపాదనను ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం దీన్ని వర్తింపచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972లో ఇందుకు అనుగుణమైన సవరణలు చేపట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకొచ్చింది. గ్రాట్యుటీ గడువును కుదిస్తే ఏర్పడే పర్యవసానాలపై పరిశ్రమ సంస్థల నుంచి కార్మిక మంత్రిత్వ శాఖ ఫీడ్‌బ్యాక్‌ను కోరినట్టు సమాచారం. పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందుంచుతారు. ఇక ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులకు గ్రాట్యుటీ కోరే అవకాశం లేకపోవగడంతో ఇక వారికీ దీన్ని వర్తింపచేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని భావిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టం ప్రకారం పది మంది అంతకు మించి ఉద్యోగులున్న ఏ సంస్థ అయినా ఐదేళ్లకు మించి సంస్థలో పనిచేస్తే వారు పదవీవిరమణ లేదా వైదొలిగే సమయంలో వారు పనిచేసిన సంవత్సరాల ప్రాతిపదికన గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా గ్రాట్యుటీ కోరే సర్వీసు అర్హతను ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలనే ప్రతిపాదన ముందుకొచ్చిన క్రమంలో కాలపరిమితిని మూడేళ్ల కన్నా మరింత తగ్గించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఎయిరిండియా ఉద్యోగులకు గుడ్‌న్యూస్
-
ఎయిరిండియా ఉద్యోగులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీ సీలింగ్ మొత్తాన్ని రెండింతలు చేసింది. దీంతో ఈ మొత్తం 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెరిగింది. జూన్ 26న ఈ మేరకు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘2018 మే 21న జరిగిన ఎయిరిండియా లిమిటెడ్ బోర్డు మీటింగ్‌లో ఉద్యోగులకు అందించే ప్రస్తుతమున్న సీలింగ్ పరిమితిని గ్రాట్యుటీ చెల్లింపుల సవరణ చట్టం 2018 కింద 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించాం. 2018 మార్చి 29 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని పేర్కొంది. ఈ ప్రకటన సుమారు 6500 మంది ఎయిరిండియా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. అంతకముందు ఒకవేళ ఎవరికైనా గ్రాట్యుటీ 10 లక్షల కంటే ఎక్కువగా అందాల్సి ఉంటే, కేవలం 10 లక్షల రూపాయలను మాత్రమే అందించేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీ మొత్తాన్ని పొందవచ్చు. ఎయిరిండియా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం మరో మూడు లేదా నాలుగు నెలల పాటు ‘వెయిట్ అండ్ వాచ్’ పాలసీని చేపట్టాలని నిర్ణయించినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. మే 31తో ముగిసిన బిడ్డింగ్‌లో ఏ బిడ్డర్‌ను కూడా ఎయిరిండియా ఆకట్టుకోలేకపోయింది. అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ సంస్థను ఏ ఒక్క బిడ్డర్ కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఇంధన ధరలు పెరుగుతుండటంతో, ప్రస్తుతం డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ క్లిష్టతరమవుతుందని ఎయిరిండియా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎయిరిండియాలో 76 శాతం వాటాను విక్రయించాలనుకుంటోంది. -
పాత పద్ధతిలోనే అదనపు పెన్షన్
గ్రాట్యుటీ పెంపునకు గ్రీన్‌సిగ్నల్ * సీఎం ఆమోదానికి పంపిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ సిఫారసులను యధాతథంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల విషయంలో వెనకాడుతోంది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న అదనపు పెన్షన్ (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్)ను పెంచేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ విముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ విధానాన్ని యధాతథంగానే కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌కు సంబంధించి పీఆర్సీ సిఫారసుల ప్రకారమే ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రెండింటికీ సంబంధించిన ఫైళ్లను ఆర్థికశాఖ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించింది. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పీఆర్సీ సిఫారసుల్లో హేతుబద్ధంగా లేని అంశాలపైనే తమ అభ్యంతరాలు తెలిపినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తే అందించే డెత్ అలవెన్స్‌ను పెంచాలని పీఆర్సీ కమిషన్ చేసిన సిఫారసును ఆర్థిక శాఖ అంగీకరించింది. వారి కుటుంబీకులు మరణించినప్పుడు కూడా ఈ అలవెన్స్ ఇవ్వాలనే సూచనను తోసిపుచ్చింది. ప్రస్తుతం 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేసే విధానం అమలవుతోంది. అంతవరకు ఉన్న పెన్షన్‌కు 15 శాతం అదనంగా కలిపి చెల్లిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ అదనపు పెన్షన్ అయిదేళ్లకోసారి అయిదు శాతం చొప్పున పెరుగుతుంది. ఒకే హోదాలో పని చేసినప్పటికీ పదేళ్ల కిందట రిటైరైన ఉద్యోగులకు.. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌లో భారీగా వ్యత్యాసముంటోంది. ఇది సరికాదని తొమ్మిదో పీఆర్సీ పేర్కొంది. పదో పీఆర్సీ ఈ అదనపు పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచే అందించాలని సూచించింది. కానీ ఆ సిఫారసుకు హేతుబద్ధత లేదని ఆర్థిక శాఖ పేర్కొంటోంది.