PRC recommended
-
పాత పద్ధతిలోనే అదనపు పెన్షన్
గ్రాట్యుటీ పెంపునకు గ్రీన్‌సిగ్నల్ * సీఎం ఆమోదానికి పంపిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ సిఫారసులను యధాతథంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల విషయంలో వెనకాడుతోంది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న అదనపు పెన్షన్ (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్)ను పెంచేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ విముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అదనపు పెన్షన్ విధానాన్ని యధాతథంగానే కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌కు సంబంధించి పీఆర్సీ సిఫారసుల ప్రకారమే ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రెండింటికీ సంబంధించిన ఫైళ్లను ఆర్థికశాఖ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదానికి పంపించింది. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పీఆర్సీ సిఫారసుల్లో హేతుబద్ధంగా లేని అంశాలపైనే తమ అభ్యంతరాలు తెలిపినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తే అందించే డెత్ అలవెన్స్‌ను పెంచాలని పీఆర్సీ కమిషన్ చేసిన సిఫారసును ఆర్థిక శాఖ అంగీకరించింది. వారి కుటుంబీకులు మరణించినప్పుడు కూడా ఈ అలవెన్స్ ఇవ్వాలనే సూచనను తోసిపుచ్చింది. ప్రస్తుతం 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ మంజూరు చేసే విధానం అమలవుతోంది. అంతవరకు ఉన్న పెన్షన్‌కు 15 శాతం అదనంగా కలిపి చెల్లిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ అదనపు పెన్షన్ అయిదేళ్లకోసారి అయిదు శాతం చొప్పున పెరుగుతుంది. ఒకే హోదాలో పని చేసినప్పటికీ పదేళ్ల కిందట రిటైరైన ఉద్యోగులకు.. ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌లో భారీగా వ్యత్యాసముంటోంది. ఇది సరికాదని తొమ్మిదో పీఆర్సీ పేర్కొంది. పదో పీఆర్సీ ఈ అదనపు పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచే అందించాలని సూచించింది. కానీ ఆ సిఫారసుకు హేతుబద్ధత లేదని ఆర్థిక శాఖ పేర్కొంటోంది. -
ఉద్యోగులకు పెరిగిన అలవెన్స్
- యాభై శాతం పెరిగిన టీఏ - ఒకేరోజు ఏడు పీఆర్సీ జీవోల జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీవోలు శనివారం వెలువడ్డాయి. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించే కొత్త అలవెన్సుల వివరాలతో ఆర్థిక శాఖ ఒకేరోజున ఏడు జీవోలను జారీచేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల ప్రయాణాలకు చెల్లించే దినసరి భత్యం యాభై శాతం పెరిగింది. రాష్ట్రంలో చేసే పర్యటనలకు సంబంధించి రూ.49,870-రూ.1,00,770 ఆపైన పేస్కేలు ఉన్న ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం దినసరి భత్యాన్ని రూ.450కి పెంచారు. రాష్ట్రం దాటి వెళ్లే పర్యటనలకు రూ.600కు పెంచారు. గ్రేడ్ 2లో రూ.28,940-రూ.78,910, రూ.46,060 నుంచి రూ.98,440 మధ్య ఉన్న ఉద్యోగులకు రాష్ట్రంలో పర్యటనలకు ఇచ్చే దినసరి భత్యాన్ని రూ.200, రాష్ట్రం దాటి వెళితే రూ.450 చొప్పున చెల్లిస్తారు. గ్రేడ్-3 మిగతా ఉద్యోగులందరికీ రాష్ట్రంలో పర్యటనలకు రూ.225, రాష్ట్రం దాటి వెళితే రూ.300 చెల్లిస్తారు. సబ్ జైలు విధులకు హాజరయ్యే అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు ఇచ్చే జైలు అలవెన్స్‌ను రూ.300కు పెంచారు. హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్లకు ఇచ్చే ఇన్సెంటివ్ అలవెన్స్, ఉపాధ్యాయులకు ఇచ్చే స్కౌట్స్ అలవెన్స్‌కు ప్రత్యేక జీవో జారీ చేశారు. గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందికి ఇచ్చే స్పెషల్ అలవెన్స్లతో మరో జీవో విడుదల చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు ఇచ్చే కబేళా అలవెన్స్ పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. టైప్‌రైటర్, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ లేనట్లయితే న్యాయ విభాగంలో పనిచేస్తున్న కాపీయర్లకు మిషన్ అలవెన్స్ మంజూరుకు వీలుగా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో అంగవైకల్య ఉద్యోగులకు సంబంధించిన అలవెన్సు జీవో తప్ప మిగతావన్నీ విడుదలయ్యాయి. బకాయిల చెల్లింపు విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.