- యాభై శాతం పెరిగిన టీఏ
- ఒకేరోజు ఏడు పీఆర్సీ జీవోల జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీవోలు శనివారం వెలువడ్డాయి. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించే కొత్త అలవెన్సుల వివరాలతో ఆర్థిక శాఖ ఒకేరోజున ఏడు జీవోలను జారీచేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల ప్రయాణాలకు చెల్లించే దినసరి భత్యం యాభై శాతం పెరిగింది. రాష్ట్రంలో చేసే పర్యటనలకు సంబంధించి రూ.49,870-రూ.1,00,770 ఆపైన పేస్కేలు ఉన్న ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం దినసరి భత్యాన్ని రూ.450కి పెంచారు. రాష్ట్రం దాటి వెళ్లే పర్యటనలకు రూ.600కు పెంచారు.
గ్రేడ్ 2లో రూ.28,940-రూ.78,910, రూ.46,060 నుంచి రూ.98,440 మధ్య ఉన్న ఉద్యోగులకు రాష్ట్రంలో పర్యటనలకు ఇచ్చే దినసరి భత్యాన్ని రూ.200, రాష్ట్రం దాటి వెళితే రూ.450 చొప్పున చెల్లిస్తారు. గ్రేడ్-3 మిగతా ఉద్యోగులందరికీ రాష్ట్రంలో పర్యటనలకు రూ.225, రాష్ట్రం దాటి వెళితే రూ.300 చెల్లిస్తారు. సబ్ జైలు విధులకు హాజరయ్యే అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు ఇచ్చే జైలు అలవెన్స్‌ను రూ.300కు పెంచారు. హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్‌లకు ఇచ్చే ఇన్సెంటివ్ అలవెన్స్, ఉపాధ్యాయులకు ఇచ్చే స్కౌట్స్ అలవెన్స్‌కు ప్రత్యేక జీవో జారీ చేశారు.
గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందికి ఇచ్చే స్పెషల్ అలవెన్స్‌లతో మరో జీవో విడుదల చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లకు ఇచ్చే కబేళా అలవెన్స్ పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. టైప్‌రైటర్, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ లేనట్లయితే న్యాయ విభాగంలో పనిచేస్తున్న కాపీయర్‌లకు మిషన్ అలవెన్స్ మంజూరుకు వీలుగా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో అంగవైకల్య ఉద్యోగులకు సంబంధించిన అలవెన్సు జీవో తప్ప మిగతావన్నీ విడుదలయ్యాయి. బకాయిల చెల్లింపు విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
ఉద్యోగులకు పెరిగిన అలవెన్స్
Published Sun, May 3 2015 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM
Advertisement
Advertisement