
వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కుంభకోణాన్ని గుర్తించిన నాలుగు రోజుల్లోనే ఇటు రిజర్వ్ బ్యాంక్‌కు అటు సీబీఐకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పది రోజులకు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. రూ. 11,400 కోట్ల భారీ కుంభకోణంపై వివరణ ఇవ్వాలంటూ స్టాక్ ఎక్స్చేంజీలు సూచించిన మీదట పీఎన్‌బీ ఈ విషయాలు వెల్లడించింది. మోసం చోటుచేసుకున్న పరిణామక్రమాన్ని వివరించింది. మోదీ, ఆయన కంపెనీలు నకిలీ బ్యాంక్ గ్యారంటీలను ఏ విధంగా ఉపయోగించుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి రుణాలను తీసుకుని, మోసానికి పాల్పడినదీ స్టాక్ ఎక్స్చేంజీలకు పీఎన్‌బీ సవివరంగా తెలియజేసింది.
పరిణామక్రమం ఇదీ..
♦ 2018 జనవరి 25న పీఎన్‌బీ ఈ స్కామ్‌ను గుర్తించింది. జనవరి 29న రిజర్వ్ బ్యాంక్‌కు ఫ్రాడ్ రిపోర్టు సమర్పించింది. అదే రోజున ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి క్రిమినల్ కంప్లైంటు కూడా ఇచ్చింది. ఫిబ్రవరి 5న స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ మోసం గురించి తెలియజేసింది.
♦ మళ్లీ ఫిబ్రవరి 7న ఆర్‌బీఐకి మరో ఫ్రాడ్ రిపోర్టును సమర్పించింది. అదే రోజున సీబీఐకి ఇంకో ఫిర్యాదు కూడా చేసింది. ఫిబ్రవరి 13న నీరవ్ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్, చంద్రి పేపర్ అండ్ అలైడ్ ప్రోడక్ట్స్ సంస్థలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి కూడా పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది. వీటి గురించి ఆ మరుసటి రోజున స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది.
ఫిర్యాదుల సారాంశం ఇదీ..
♦ పీఎన్‌బీ ముంబై శాఖలోని ఫారిన్ ఎక్సే్చంజీ విభాగంలో డిప్యుటీ జీఎంగా పనిచేసిన గోకుల్‌నాథ్ శెట్టి (ప్రస్తుతం రిటైర్డ్) తదితర ఉద్యోగులతో మోదీ, ఆయనకు చెందిన కంపెనీలు కుమ్మక్కయ్యాయి. ముత్యాల దిగుమతికి నిధుల అవసరాల పేరిట పీఎన్‌బీ నుంచి మోసపూరితంగా 1.77 బిలియన్ డాలర్ల విలువ చేసే గ్యారంటీలు పొందాయి. వాటిని ఉపయోగించుకుని విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి రుణాలు తీసుకున్నాయి.
♦ ఆ తర్వాత 2018 జనవరి 16న ముంబైలోని బ్రాడీ హౌస్ పీఎన్‌బీ శాఖకు దిగుమతి పత్రాలతో వచ్చిన నీరవ్ మోదీ గ్రూప్‌నకు చెందిన సంస్థలు .. విదేశీ సరఫరాదారులకు చెల్లింపులు జరిపేందుకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ కోరాయి. అప్పటికి శెట్టి రిటైరయ్యారు. 100 శాతం నగదు మార్జిన్ లేనందున లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) ఇవ్వడం కుదరదంటూ పీఎన్‌బీ సిబ్బంది.. మోదీ సంస్థలకు స్పష్టం చేశాయి. అయితే, తాము చాలా ఏళ్లుగా ఇలాంటి వెసులుబాటు పొందుతున్నామంటూ సదరు సంస్థలు వెల్లడించాయి. దీంతో .. పీఎన్‌బీ వెంటనే ఈ అంశాన్ని పరిశీలించింది. గతంలో కూడా ఎల్‌వోయూలు జారీ అయినట్లు గుర్తించింది. వాటి ఆధారంగా రుణాలు ఇవ్వాలంటూ.. బ్యాంకు అంతర్గత వ్యవస్థలో ఎక్కడా నమోదు చేయకుండా స్విఫ్ట్ విధానం ద్వారా విదేశీ బ్యాంకులకు సందేశాలు వెళ్లినట్లు గుర్తించింది.
♦ ఇవన్నీ బైటపడటంతో .. సదరు మొత్తాలను చెల్లించాలంటూ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్ వర్గాలతో ఢిల్లీ, ముంబైలలో పీఎన్‌బీ చర్చలు జరిపింది. అటుపైన నీరవ్ మోదీకి చెందిన మూడు గ్రూప్ సంస్థల ప్రమేయమున్న రూ. 280 కోట్ల మోసానికి సంబంధించి 2018 జనవరి 29న ఎఫ్‌ఎంఆర్–1 (మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ఆర్‌బీఐ నిర్దేశిత ఫార్మాట్)ను రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించింది. అటుపై ఫిబ్రవరి7న గీతాంజలి గ్రూప్‌నకు చెందిన రెండు కంపెనీలు మోసపూరితంగా తీసుకున్న సుమారు రూ. 65.25 కోట్ల ఎల్‌వోయూలు మెచ్యూర్ కావడంతో మరో రిపోర్టును ఆర్‌బీఐకి పంపింది. హాంకాంగ్‌లోని అలహాబాద్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు శాఖల నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment