
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ. 13,000 కోట్ల మేర లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) కుంభకోణం దరిమిలా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఎల్‌వోయూలు జారీ చేయడాన్ని నిషేధించింది. వాణిజ్య రుణాలకు సంబంధించి బ్యాంకులు.. ఎల్‌వోయూలు, లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్‌వోసీ)ల జారీ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వివరించింది.
మార్గదర్శకాలను పునఃసమీక్షించిన అనంతరం.. కేటగిరీ–1 బ్యాంకులు ఎల్‌వోయూలు/ఎల్‌వోసీలు జారీ చేసే విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే, దిగుమతులకు సంబంధించి వివిధ సంస్థల రుణ అవసరాల కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్, బ్యాంక్ గ్యారంటీల జారీని బ్యాంకులు య«థాప్రకారం కొనసాగించవచ్చని పేర్కొంది.
పీఎన్‌బీ అధికారులతో కుమ్మక్కై తీసుకున్న ఎల్‌వోయూల ఆధారంగా వజ్రాభరణాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా నిబంధనలతో ఎక్కువగా ఎల్‌వోయూలమీదే ఆధారపడే వ్యాపార సంస్థలపై ప్రతికూల ప్రభావం పడనుంది. అయితే, బ్యాంక్ గ్యారంటీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం యథాప్రకారం కొనసాగనున్నందున వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్‌ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు.
ఎల్‌వోయూలను ఎక్కువగా వజ్రాభరణాల రంగంలోని పెద్ద సంస్థలే ఉపయోగిస్తాయని ఆయన తెలిపారు. మరోవైపు, నీరవ్ మోదీ 2011 మార్చి 10న ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీ హౌస్ శాఖ నుంచి తొలిసారిగా ఎల్‌వోయూ తీసుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభకు తెలిపారు. ఆ తర్వాత 74 నెలల వ్యవధిలో ఏకంగా 1,212 ఎల్‌వోయూలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment