( ఫైల్ ఫోటో )
జగ్గంపేట: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను తుంగలోకి తొక్కి, పన్నులను ఎగ్గొడుతూ రూ.కోట్ల నగదు, బంగారాన్ని ప్రైవేటు బస్సులలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఘటనలపై కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ వద్ద శుక్రవారం పోలీసు అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగు చూసిన సంగతి విదితమే. దీనిపై కస్టమ్స్, జీఎస్టీ, ఐటీ అధికారులు జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావును శనివారం కలిసి వివరాలు సేకరించారు.
అనంతరం 10 కేజీల బంగారాన్ని విజయవాడ నుంచి విశాఖ తరలిస్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావును, టెక్కలి నుంచి విజయవాడ వైపు రూ.5.65 కోట్ల నగదు తరలింపులో పట్టుబడిన బస్సు డ్రైవర్ సుదర్శనరావును విచారించారు. విజయవాడలో రామవరప్పాడు వద్ద బంగారం ఎవరిచ్చారు, విశాఖలో ఎవరికి అందజేయమన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా బంగారం, నగదు అక్రమ రవాణా పద్మావతి ట్రావెల్స్‌లోనే జరుగుతోందా, ఇతర ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా జరుగుతోందా అనే అంశంపైనా దృష్టి సారించారు. కాగా, కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద పట్టుబడిన రూ.5.65 కోట్ల నగదు, సుమారు 10 కేజీల బంగారాన్ని రాజమహేంద్రవరంలోని ట్రెజరీలో జమ చేసినట్లు సీఐ చెప్పారు.
(చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్‌ఎటాక్)
Comments
Please login to add a commentAdd a comment