గంజాయి తీసుకుంటున్న యువకులు.. పట్టుకున్న పోలీసులు..! | - | Sakshi
Sakshi News home page

గంజాయి తీసుకుంటున్న యువకులు.. పట్టుకున్న పోలీసులు..!

Published Tue, Nov 7 2023 1:34 AM | Last Updated on Tue, Nov 7 2023 10:35 AM

- - Sakshi

సూర్యాపేట క్రైం: వివరాలు వెల్లడిస్తున్న సూర్యాపేట ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సూర్యాపేట క్రైం: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని కోదాడ రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ రాహుల్‌ హెగ్డే విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం రామాపురం క్రాస్‌ రోడ్డు చెక్‌పోస్ట్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో రూ.12.50లక్షల విలువైన 50 కేజీల గంజాయిని గుర్తించి సీజ్‌ చేశారు.

బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లాకు చెందిన పండ్ల వ్యాపారి అవదేశ్‌ చంద్రశేఖర్‌వర్మతో పాటు అదే ప్రాంతానికి చెందిన గృహిణులు శైల ప్రదీప్‌ దండకర్‌, సారిక విలాస్‌ మోహితెను అరెస్టు చేసి విచారించారు. పట్టుబడిన ముగ్గురు ఈ నెల 3వ తేదీన మహారాష్ట్ర నుంచి రైలులో విశాఖపట్నం వెళ్లి శివారు ప్రాంతాల్లో 50కేజీల గంజాయిని లక్ష రూపాయలకు కొనుగోలు చేసి దానిని 12 ప్యాకెట్లుగా కట్టి నాలుగు లగేజ్‌ బ్యాగులలో నింపి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌కు తరలిస్తూ పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుల నుంచి రూ.30వేలు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కోదాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన కోదాడ డీఎస్పీ బి. ప్రకాష్‌, సీఐ డి. రామకృష్ణారెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ షేక్‌ అబ్దుల్‌ సమద్‌ను ఎస్పీ అభినందించారు.

గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువకులు
గంజాయి విక్రయించడంతో పాటు సేవిస్తున్న యువకులను సూర్యాపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ జి. రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం. సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ వద్దకు సోమవారం పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు వెళ్లగా 10 మంది యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకొని విచారించగా.. నకిరేకల్‌కు చెందిన ఆకారపు నందు దగ్గర గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేటలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

పట్టుబడిన వారిలో సూర్యాపేట పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన షేక్‌ షరీఫ్‌, తిరుపతి మదన్‌, తాళ్లగడ్డకు చెందిన అబ్బగోని శ్రీమాన్‌, 60 ఫీట్ల రోడ్డుకు చెందిన దున్న విక్రమ్‌తో పాటు రత్నాల శంకర్‌, సూర్యాపేట మండలం కాసరబాద్‌ గ్రామానికి చెందిన మల్లెబోయిన సాయి, నకిరేకల్‌ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన పాలడుగు నరేందర్‌, పడిదెల మనోహర్‌ కుమార్‌, కట్టంగూర్‌కు చెందిన మేడి పవన్‌, రామన్నగూడెం గ్రామానికి చెందిన గూగులోత్‌ అరుణ్‌ ఉన్నట్లు సీఐ తెలిపారు. వీరి నుంచి ఒక కేజీ 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

దామరచర్లలో ఇద్దరి అరెస్ట్‌..
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్‌ అధికారులు దామరచర్ల మండంలోని తాళ్లవీరప్పగూడెంలో పట్టుకున్నారు. ఎక్సైజ్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన మనోరంజన్‌ సర్కార్‌, జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన మహమ్మద్‌ షకీల్‌ బైక్‌పై దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం గుండా వెళ్తుండగా వాహనాల తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్‌ అధికారులు వారి వద్ద ఉన్న సంచుల్లో ఐదు కిలోల ఎండు గంజాయిని గుర్తించారు.

ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నల్లగొండలో వారు అద్దెకు ఉంటున్న ఇంట్లో మరో 4.250 కిలోల ఎండు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9.250కిలోల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ సీజ్‌ చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్‌ ఎస్‌ఐలు రామకృష్ణ, పర్వీన్‌, లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.

చివ్వెంల మండలంలో ఇద్దరు..
గంజాయి విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ వై. అశోక్‌ రెడ్డి, ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన కంచుగొమ్ముల శివ, గాదె టోనీ, సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన గట్టు తరుణ్‌ కలిసి గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శివ, టోనీ మున్యానాయక్‌ తండాకు చెందిన మహేష్‌ ద్వారా పెన్‌పహాడ్‌ మండలానికి చెందిన దినేష్‌ వద్ద 400గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు.

ఆ గంజాయిని తీసుకొని సోమవారం తాళ్లగడ్డలో ఉంటున్న తరుణ్‌ వద్దకు స్కూటర్‌పై వెళ్తుండగా కుడకుడ గ్రామం వద్ద పోలీసులు వారిని పట్టుకొని తనిఖీ చేయగా 20 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. శివ, టోనీని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం వెతుకుతున్నామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement