ఖాతాల్లోకి ‘బ్లాక్’ వద్దు
నల్లధనం డిపాజిట్‌కు అనుమతిస్తే చర్యలు తప్పవు
- నేడు ఖాతా ఉన్న బ్యాంకులోనే మార్పిడి, సీనియర్ సిటిజన్లకు మినహారుుంపు
- క్రమంగా నగదు మార్పిడి ఎత్తివేతకు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: నల్లధనం దాచుకునేందుకు బ్యాంకు ఖాతాల్ని దుర్వినియోగం చేస్తే వారిపై చర్యలు తప్పవని కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. జన్‌ధన్ ఖాతాదారులు, గృహిణులు, ఇతరులు తమ ఖాతాల్ని నల్లధనం డిపాజిట్లకు అనుమతిస్తే ఐటీ చట్టం కింద విచారిస్తామని ప్రకటించింది. ఇతరుల బ్యాంకు ఖాతాల్ని వాడుకుని కొందరు నల్లధనం మార్చుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకు ప్రతిగా కొందరికి డబ్బు ఎరచూపుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సాధారణ ఖాతాల్లో రూ. 2.50 లక్షల వరకూ, జన్‌ధన్ ఖాతాల్లో రూ. 50 వేల వరకూ జమ చేసుకోవచ్చు. ‘ఇతరుల నల్లధనం మీ ఖాతాలో జమ చేసుకునేందుకు అనుమతిస్తే... విచారణలో అది నిజమని రుజువైతే ఆ నగదుపై ఆదాయపు పన్నుతో పాటు పెనాల్టీ విధిస్తాం. ఖాతాను దుర్వినియోగం చేసేందుకు అనుమతించిన వ్యక్తిని ఆదాయపు పన్ను చట్టం కింద విచారిస్తాం’ అని ఆర్థిక శాఖ పేర్కొంది. నల్లధనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే పన్ను, వడ్డీతో పాటు 200 శాతం పెనాల్టీ విధించనున్నారు. బ్యాంకు లాకర్లు సీజ్ చేసి బంగారం, వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకుంటారన్న వార్తల్లో నిజం లేదని, అవి వదంతులేనని పునరుద్ఘాటించింది.
సరిపడా కొత్తవి రాగానే మార్పిడి ఎత్తివేత
నగదు మార్పిడిని రూ. 2 వేలకు తగ్గించిన కేంద్రం క్రమంగా దాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తోంది. దానికి బదులుగా నగదును ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలంటూ ప్రజల్ని కోరనుంది. మొదట్లో నగదు మార్పిడి పరిమితి రోజుకు రూ. 4 వేలు ఉండగా, తర్వాత 4,500కు పెంచారు. డిసెంబర్ 30 వరకూ ఒక్కసారే వినియోగించుకోవాలంటూ నిబంధన విధించింది. నవంబర్ 17న ఈ పరిమితిని ఒక్కసారే రూ. 2 వేలకు తగ్గించింది. ‘పెద్ద నోట్ల రద్దు అనంతరం మార్కెట్లో 60% నగదు లభ్యత ఉండాలన్న లక్ష్యాన్ని అధిగమించాం. మిగతా లక్ష్యం చేరుకోగానే నోట్ల మార్పిడిని రద్దు చేస్తాం. సరిపడా కొత్త నోట్లు చలామణీలోకి వస్తే మార్పిడి సదుపాయం తొలగిస్తాం’ అని ఒక ఉన్నతాధికారి చెప్పారు.
ఆదివారం బ్యాంకులకు సెలవు
నేడు(శనివారం) ఏ బ్యాంకులో ఖాతా ఉంటే అక్కడే పాత నోట్లను మార్చుకోవాలి. ఈ నిబంధన నుంచి సీనియర్ సిటిజన్సకు మినహారుుంపునిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. నగదు మార్పిడి పరిమితి మాత్రం రూ. 2 వేలే ఉంటుందని పేర్కొంది. తమ ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే ఆదివారం బ్యాంకులు పనిచేయవని తెలిపింది.
దేశవ్యాప్తంగా దాదాపు 700 పెట్రోల్ బంకుల్లో నగదు స్వైప్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. డెబిట్ కార్డుతో రోజుకు రూ.2 వేలు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ఈ వారం చివరికల్లా 2,500 బంకులకు విస్తరించనున్నారు. 20 వేల బంకులకు విస్తరించే ప్రతిపాదనను ప్రస్తుతం పక్కన పెట్టారు. పెట్రోల్ బంకుల్లో నగదు విత్‌డ్రా వల్ల పెట్రో ఉత్పత్తుల కొనుగోలుకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని, మొత్తం 646 బంకుల్లో నగదు విత్‌డ్రా సౌకర్యం కల్పించామని కేంద్రం వెల్లడించింది. 350 ఇండియన్ ఆరుుల్, 266 భారత్ పెట్రోలియం, 70 హిందుస్తాన్ పెట్రోలియం బంకుల్లో ఈ అవకాశం కల్పించామని తెలిపింది.
ఆ నోట్ల వివరాలు వెల్లడించలేం
బ్యాంకులకు పంపిన రూ. 500 కొత్త నోట్ల వివరాల్ని భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేమని మద్రాసు హైకోర్టుకు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. రూ. 500 కొత్త నోట్లు తమిళనాడులో అందుబాటులో ఉన్నాయో లేదో చెప్పాలని కోర్టు ఆదేశించడంతో ఆర్బీఐ ఈమేరకు చెప్పింది. అక్రమాలు నిరోధించేందుకే జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడిపై నిషేధం విధించామంది.
రూ. 400 కోట్ల నకిలీ నోట్ల చలామణీకి చెక్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 400 కోట్ల మేర నకిలీ నోట్ల చలామణీ నిలిచిపోరుుందని, అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి నకిలీ నోట్ల సరఫరా ఆగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు చెప్పారు. ‘ప్రతి ఏడాది దేశంలోకి రూ. 70 కోట్ల మేర నకిలీ నోట్లను చలామణీ చేస్తున్నారు. 2015లో రూ. 34.99 కోట్లు, 2014లో రూ. 36.11 క్లోట్లు, 2013లో రూ. 42.90 కోట్ల నకిలీ నోట్లు సీజ్ చేశాం’ అని రిజుజు చెప్పారు. రూ. 700-800 కోట్ల మేర నిధుల్ని ఉగ్రవాదులు వినియోగిస్తున్నారని, ఇందులో నక్సల్స్‌కు రూ. 300- 400 కోట్లు; కశ్మీర్ వేర్పాటువాదులకు రూ. 20-30 కోట్లు, ఈశాన్య భారతంలో చొరబాటుదారులకు రూ. 350-400 కోట్లు అందుతున్నాయని తెలిపారు.
ఐటీ దాడులు
బెంగళూరులో రూ.16 కోట్లు, గోవాలో రూ.4 కోట్లు స్వాధీనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరుసహా గోవాలో శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... బెంగళూరులోని యలహంకలో చంద్రప్ప అనే ఫైనాన్షియర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసి రూ.16 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో హైదరాబాద్‌కు బయల్దేరిన వ్యక్తి నుంచి రూ.13.30 లక్షల నగదు, 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.50 లక్షల విలువైన పాత రూ.1000 నోట్ల కట్టలతో భువనేశ్వర్ నుంచి బెంగళూరు చేరుకున్న వ్యక్తిని అరెస్టుచేశారు.
మరోవైపు, పణజీలో ఓ హోటల్లో ఉన్న వ్యక్తి నుంచి రూ.96.45 లక్షల విలువైన పాత నోట్లతో పాటు రూ.3 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను కొందరికి ఎక్కువ రేటుకు వీటిని అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. మంగళూరులోని ఐదు సహకార సంఘాల కార్యాలయాల్లో సోదాలు చేయగా పాత తేదీలను వేసి నగదు లావాదేవీలు జరిపిన విషయం బయటపడింది. కోట్ల విలువైన పాత కరెన్సీని ఎలా మార్చుకోవాలో తెలీక కొందరు రోడ్డుపై వెదజల్లుతూ వెళ్లిన ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరులో చోటుచేసుకుంది.