
రాష్ట్రానికి పెద్ద నోట్ల కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రూ.2,000 నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు పూర్తిగా నిలి పేసింది. వాటి స్థానంలో రూ.500 నోట్లను పంపిణీ చేస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 67 వేల కోట్ల విలువైన నోట్లను రిజర్వు బాంకు సరఫరా చేయగా వాటిలో దాదాపు 90 శాతం రూ.2,000 నోట్లే ఉన్నాయి. అందుకు భిన్నంగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో రూ.2,000 నోట్ల సరఫరా తగ్గింది.
ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత పెద్ద నోట్ల పంపిణీ ఆర్బీఐ భారీగా తగ్గించేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో రిజర్వు బాంకు నుంచి రాష్ట్రానికి రూ. 25 వేల కోట్ల విలువైన కరెన్సీ రాగా, అందులో అధికంగా రూ.500, రూ.100 నోట్లున్నాయి. రూ.2,000 సరఫరా 5 శాతం మించిలేదని అధికారులు చెబుతున్నారు. చిల్లర సమస్యతో పాటు గ్రామీణ ప్రాంతాల అవసరాల దృష్ట్యా చిన్న నోట్ల చలామణికే బ్యాంకు ప్రాధాన్యమిస్తోందనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు ఆర్‌బీఐ త్వరలోనే కొత్తగా రూ.200 నోట్లను ముద్రించి చలామణిలోకి తెచ్చే అవకాశాలున్నాయి. రూ. 2,000 నోట్ల సరఫరాను తగ్గించి రద్దు చేయాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి.