సాక్షి, చెన్నై : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ర్టంలో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ప్రత్యేక స్క్వాడ్‌లు ఓ వైపు, ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లను అను సంధానిస్తూ ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. చేతికి నగదు చిక్కితే చాలు, సీజ్ చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్న తనిఖీల బృందాలపై విమర్శలు బయలు దేరుతున్నాయి. లెక్కలోకి రాని నగదు అంటూ ముందుగా పట్టుకుని సీజ్ చేయడం, వాటికి లెక్కలు చూపించిన తరువాయి అప్పగించడం సాగుతూ వస్తోంది.
విధి నిర్వహణలో తాము ఏ మేరకు నిక్కచ్చితనంగా వ్యవహరిస్తున్నామో అని చాటుకునేందుకు ఏకంగా రిజర్వు బ్యాంక్‌కే ప్రత్యేక బృందాలు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ నుంచి అధికారుల్ని పరుగులు తీయించాయి.
రిజర్వు బ్యాంక్‌కు షాక్: నామక్కల్‌జిల్లా పరమత్తి సమీపంలో ప్రత్యేక బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యాయి. ప్రత్యేక అధికారి బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఈ తనిఖీలు సాగుతుండగా, టోల్‌గేట్ వైపుగా నాలుగు కంటైనర్లు ఒకదాని తర్వాత మరొకటి రావడంతో అనుమానం నెలకొంది. ఆ కంటైనర్లను నిలిపి తనిఖీ చేశారు.
అందులో చిల్లర నాణేలు ఉండడం, అందుకు తగ్గ లెక్కలు లేని దృష్ట్యా, ఆ నాలుగు లారీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. ఆ కంటైనర్లలో ఉన్న చిల్లర నాణేలు రిజర్వు బ్యాంక్‌కు చెందినట్టు డ్రైవర్లు చెప్పుకున్నా, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. వాటిని లెక్కించగా కోటి రూపాయల వరకు రూ. పది నాణేలు, 75 లక్షల వరకు రూ. ఐదు నాణేలు, 37 లక్షల వరకు రూ. రెండు నాణేలు, 23 లక్షల వరకు రూ. 1 నాణెం ఉన్నట్టు గుర్తించారు. ఆ నాణెలు హైదరాబాద్ నుంచి కేరళకు వెళ్తున్నట్టు తేలింది.
అయితే, ఆ నాణేలు రిజర్వు బ్యాంక్ నుంచి వెళ్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేని దృష్ట్యా, సీజ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో ఆ కంటైనర్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వాటిలో నాణేలు ఉన్న సమాచారంతో ఆ పరిసర వాసులు కంటైనర్లు చూడడానికి ఎగబడ్డారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో షాక్‌కు గురైన హైద రాబాద్‌లోని రిజర్వు బ్యాంక్ అధికారులు హుటా హుటిన ఆధారాలకు తగ్గ సమాచారాలు, ఆ నగదు బట్వాడాకు చెందిన వివరాల్ని నామక్కల్ పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫ్యాక్స్ రూపంలో పంపాల్సి వచ్చింది.
వాటిని పరిశీలించినానంతరం మూడు గంటల సమయంలో కంటైనర్లను వదలి పెట్టారు. ఇక, గుడియాత్తం సమీపంలో వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు మోటార్ సైకిల్‌పై వచ్చిన శరవణన్ అనే వ్యక్తి వద్ద రూ. నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సొంత పని మీద ఇంటి నుంచి నగదు తీసుకుని వెళ్తున్నట్టు వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. ఇక, కళ్లకురిచ్చి సమీపంలో ఓ కారులో రూ. 60 వేలు తీసుకొస్తున్న మణి అనే వ్యక్తిని తనిఖీ చేసి, ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
అయితే, తన కుమారుడికి ఫీజులు చెల్లించడం కోసం బంధువుల వద్ద నుంచి రూ. 60 వేలు అప్పు తీసుకుని, వస్తుంటే, దానిని కూడా స్వాధీనం చేసుకోవడం ఏమిటో అంటూ మణి గగ్గోలు పెడుతున్నాడు. కొన్ని చోట్ల తనిఖీల పేరిట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు బయలుదేరాయి.
రిజర్వు బ్యాంక్‌కు షాక్
Published Mon, Mar 14 2016 4:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement