డబ్బే..డబ్బు
రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు రూ. 2.5 కోట్లు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కినట్లుగా వ్యవహరిస్తున్న పార్టీల నేతలు నగదు బట్వాడాలో ఏమాత్రం తగ్గేది లేదని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం నిర్వహించిన దాడుల్లో రూ.2.50 కోట్లు స్వాధీనం అయింది. అలాగే పెద్ద ఎత్తున బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఉడుమలైపేటలో నిర్వహించిన వాహనతనిఖీలో రూ.39.20 లక్షలు పట్టుబడింది. తిరుచందూరు సమీపంలో శనివారం ఉదయం నిర్వహించిన వాహనతనీఖీల్లో అదే నియోజకవర్గం నుండి పోటీచేస్తున్న నటుడు శరత్‌కుమార్ ప్రయాణిస్తున్న కారు నుండి రూ.9లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
తంజావూరు జిల్లా తిరువాయూరు సమీపం విలాంగుడి వద్ద తనిఖీల్లో ఒక మినీ వ్యాన్ నుండి రూ.59 లక్షల విలువైన నగలు పట్టుబడ్డాయి. కాంచీపురం జిల్లా తిరుంపెరుంబుత్తూరులోని టోల్‌గేట్ వద్ద ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా చెన్నై నుండి వస్తున్న కారు నుండి రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వేలూరు జిల్లా అన్నాడీఎంకే కౌన్సిలర్ ఏఎస్ బిచ్చై ఇంటిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రూ.2.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
గోపీ జిల్లాలో ఒక బస్సును తనిఖీ చేయగా 1.5 కిలోల 23 కాలి వెండి గొలుసులు, 12.5 కిలోల వెండి కడ్డీలు, రూ.50వేల నగదు పట్టుబడింది. పేరావూరణి సమీపం పిన్నవాసల్ గృహసముదాయం వద్ద ఒక కారును తనిఖీ చేసి 225 చీరలు, 15 శాలువాలు, 20 పట్టుచీరలు 295 వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50వేలని అధికారులు తెలిపారు. ముగప్పేరులోని అన్నాడీఎంకే నేత సుధాకర్ ఇంటిలో రూ.7 కోట్లు నగదు దాచి ఉంచినట్లు సమాచారం అందడంతో డీఎంకే, కాంగ్రెస్ నేతలు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ తరువాత ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శుక్రవారం అర్దరాత్రి తనికీలు చేసారు. సుమారు గంటపాటూ జరిపిన తనిఖీల్లో నగదు బైటపడలేదు.
రూ.20వేలకే పరిమితం@ ఈసీ
ప్రచారానికి వెళ్లే అభ్యర్థులు, నేతలు తమ వద్ద రూ.20వేలకు మించి తమ వద్ద ఉంచుకోరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ శనివారం ప్రకటించారు. అంతకు మించి నగదు ఉన్నట్లయితే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకుంటారని ఆయన హెచ్చరించారు.