రిజర్వుబ్యాంక్ నాలుగున్నరేళ్ల తర్వాత గతవారం పావు శాతం వడ్డీ రేట్లు పెంచిన తర్వాత రూపాయి విలువ గణనీయంగా మెరుగుపడటం, స్టాక్‌మార్కెట్ ర్యాలీ జరపడం ఒకేసారి జరిగాయి. భారత్ క్యాపిటల్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు జరుపుతున్న అమ్మకాలకు బ్రేక్ పడుతుందన్న అంచనాలే...కరెన్సీ, స్టాక్ మార్కెట్ల అనుకూల కదలికలకు కారణం. కానీ ఒక రోజు అనంతరం తిరిగి రూపాయి మళ్లీ భారీగా పతనంకావడం, స్టాక్ మార్కెట్ తిరిగి కరెక్షన్ బాటలోకి మళ్లడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసేదే. భారత్‌తో పాటు ఇతర వర్థమాన దేశాల ఈక్విటీలు, కరెన్సీలు కూడా ఇటీవల క్షీణబాటలో వుండగా, అమెరికా సూచీల్లో నాస్‌డాక్ ఇప్పటికే ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరింది. మరో రెండు సూచీలు డోజోన్స్, ఎస్ అండ్ పీ–500లు కొత్త రికార్డువైపు పరుగులు తీస్తున్నాయి. అంటే...విదేశీ ఇన్వెస్టర్లు ఇతర మార్కెట్ల నుంచి నిధుల్ని అమెరికా మార్కెట్లోకి తరలిస్తున్నట్లు భావించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వారం ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌లు తీసుకోబోయే నిర్ణయాలు, వెలువరించే సంకేతాలు భారత్ వంటి వర్థమాన మార్కెట్‌కు కీలకం కానున్నాయి. ఇక ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి....
సెన్సెక్స్ సాంకేతికాలు..
జూన్ 8తో ముగిసిన వారం ప్రథమార్థంలో గత మార్కెట్ పంచాంగంలో సూచించిన అంచనాలకు అనుగుణంగా 34,785 పాయింట్ల కనిష్టస్థాయివరకూ క్షీణించిన బీఎస్‌ఈ సెన్సెక్స్...ద్వితీయార్థంలో 35,628 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 216 పాయింట్ల లాభంతో 35,443 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దాదాపు ఇదేస్థాయి 35,440 పాయింట్లు సెన్సెక్స్‌కు కీలకమైనది. ఈ స్థాయిపైన బుల్లిష్‌గానూ, దిగువన బేరిష్‌గానూ ట్రేడ్‌కావొచ్చు. ఈ వారం మార్కెట్ పెరిగితే 35,630 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆ స్థాయిని చేదిస్తే 35,990 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే చాన్స్ వుంటుంది. 35,440 పాయింట్ల దిగువన కొనసాగితే తిరిగి 35,260 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. ఈ లోపున ముగిస్తే 34,800 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 34,340 పాయింట్ల వరకూ పడిపోవొచ్చు. సమీప భవిష్యత్తులో ఈ మూడో మద్దతు మార్కెట్‌కు కీలకమైనది. ఈ స్థాయిని వదులుకుంటే ఏప్రిల్ తొలివారం నుంచి కొనసాగుతున్న అప్‌ట్రెండ్ ముగిసినట్లేనని టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి.
నిఫ్టీకి 10,765 స్థాయి కీలకం
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం ప్రథమార్థంలో గత కాలమ్‌లో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా 10,551 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత 10,818 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 72 పాయింట్ల లాభంతో 10,768 పాయింట్ల వద్ద ముగిసింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీకి 10,765 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ వారం ఈ స్థాయిపైన స్థిరపడితే 10,835 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన ముగిస్తే 10,930 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంటుంది. ఈ వారం 10,765 స్థాయి దిగువన కొనసాగితే 10,720 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే 10,550పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 10,420 పాయింట్ల స్థాయి వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ చివరి మద్దతును కోల్పోతే మాత్రం మార్కెట్ తిరిగి బేర్స్ గుప్పిట్లో చిక్కుకోవొచ్చు.
35,440 స్థాయి కీలకం
Published Mon, Jun 11 2018 2:30 AM | Last Updated on Mon, Jun 11 2018 2:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment