సెన్సెక్స్ 516 పాయింట్లు డౌన్ | Sensex thumbs down RBI's 25 basis points rate cut, sinks over 500 points | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 516 పాయింట్లు డౌన్

Published Wed, Apr 6 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

సెన్సెక్స్ 516 పాయింట్లు డౌన్

సెన్సెక్స్ 516 పాయింట్లు డౌన్

వడ్డీ రేటు తగ్గింపు స్వల్పమేనన్న నిరుత్సాహం
ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ
156 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ఫెడ్ భయాలతో ప్రతికూలంగా ప్రపంచ మార్కెట్లు

ముంబై: రిజర్వుబ్యాంక్ వడ్డీ రేటును పావుశాతమే తగ్గించిందన్న నిరుత్సాహానికి ప్రతికూల అంతర్జాతీయ ట్రెండ్ తోడవటంతో మంగళవారం ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు పతనమై 25,000 పాయింట్లస్థాయి దిగువకు జారిపోయింది. రేట్ల కోత అంచనాలతో నెలరోజులుగా పెరిగిన బ్యాంకింగ్ షేర్లే ఆర్‌బీఐ పాలసీ ప్రకటన అనంతరం అధికంగా క్షీణించాయి.

ఆర్‌బీఐ కేవలం రెపో రేటును మాత్రమే తగ్గించి, సీఆర్‌ఆర్‌ను యథాతథంగా అట్టిపెట్టడం కూడా ఇన్వెస్టర్లకు రుచించలేదు. బ్యాంకింగ్ షేర్లలో ఎక్కువగా ఐసీఐసీఐ బ్యాంక్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఈ షేరు 5.45 శాతం క్షీణించగా, ఎస్‌బీఐ 5.38 శాతం పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ 2.89 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.03 శాతం చొప్పున తగ్గాయి. ఫార్మా షేరు లుపిన్ మినహా సెన్సెక్స్-30లో భాగమైన మిగిలిన షేర్లన్నీ తగ్గుదలతో ముగిశాయి.

 25,372 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకదశలో 24,837 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 516 పాయింట్ల భారీనష్టంతో 24,884 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయి 7,603 పాయింట్ల వద్ద ముగిసింది.

 ఫెడ్ ఎఫెక్ట్...
మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయం ప్రపంచ మార్కెట్లను వెన్నాడుతూ ఉంది. ఫెడ్ గత సమావేశపు మినిట్స్ బుధవారం వెల్లడికానున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించడం కూడా ఇక్కడి ట్రేడింగ్‌పై ప్రభావం చూపింది. పైగా మార్చి నెలలో పెట్టుబడుల జోరుతో పోలిస్తే గత కొద్దిరోజుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు నెమ్మదించాయని, నగదు మార్కెట్లో లావాదేవీలు తగ్గాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. తాజా లాభాల స్వీకరణకు ఇది కూడా ఒక కారణమని ఆయన విశ్లేషించారు.

 బ్యాంకింగ్ షేర్లతో పాటు అదాని పోర్ట్స్ 6.23 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 5.03 శాతం, టాటా మోటార్స్ 4.52 శాతం, బీహెచ్‌ఈఎల్ 3.67 శాతం, మారుతి 3.66 శాతం, ఎల్ అండ్ టీ 3.30 శాతం, కోల్ ఇండియా 3.26 శాతం, ఎన్‌టీపీసీ 3.09 శాతం చొప్పున తగ్గాయి. రంగాలవారీగా బీఎస్‌ఈ టెలికం సూచీ అన్నింటికంటే ఎక్కువగా 3.71 శాతం తగ్గగా, బ్యాంకింగ్ సూచి 3.21 శాతం, ఆటో 2.84 శాతం చొప్పున తగ్గాయి. ట్రేడయిన మొత్తం షేర్లలో 1,631 షేర్లు క్షీణించగా, 882 షేర్లు లాభపడ్డాయి.

 అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుపై అనిశ్చితి కారణంగా ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. జపాన్ నికాయ్ 2.42 శాతం తగ్గగా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు 0.8-1.57 శాతం మధ్య క్షీణించాయి. యూరప్‌లోని కీలక ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సూచీలు 1.5-3 శాతం మధ్య తగ్గాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా సూచీలు తగ్గుదలతో ట్రేడవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement