రూ.450 కోట్లు 'నల్ల'బాట! | 450 crores under went for black money | Sakshi
Sakshi News home page

రూ.450 కోట్లు 'నల్ల'బాట!

Published Sat, Nov 26 2016 2:35 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

రూ.450 కోట్లు 'నల్ల'బాట! - Sakshi

రూ.450 కోట్లు 'నల్ల'బాట!

  •  భారీగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన రిజర్వుబ్యాంకు
  •  ఇందులో పోస్టాఫీసులు, సహకార బ్యాంకులదే ప్రధాన పాత్ర
  •  ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మేనేజర్ల చేతివాటం..
  •  ప్రైవేట్ బ్యాంకులపైనా అనుమానాలు
  •  బ్యాంకుల్లో నగదు లావాదేవీల పరిశీలనకు ప్రత్యేక బృందాలు
  •  రిజర్వుబ్యాంకు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ  
  • సాక్షి, హైదరాబాద్
    మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన దగ్గర రూ.2 కోట్ల విలువైన పాత రూ.500, 1,000 నోట్లు ఉన్నాయని, ప్రత్యామ్నాయ నగదు ఇస్తే 25 శాతం కమీషన్ ఇస్తానని ఈ నెల 22న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేశారు. అయితే తన బ్యాంకు నుంచి సర్దుబాటు చేయడం కష్టమని.. తాను ఇచ్చే మొబైల్ నంబర్‌ను సంప్రదిస్తే హైదరాబాద్‌లోని ఓ పోస్టాఫీసు నుంచి ప్రత్యేక పార్శిళ్ల ద్వారా కొత్త రూ.2వేల నోట్లను దశలవారీగా సమకూరుస్తారని చెప్పారు. ఆ తరువాత కొద్దిసేపటికే హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసులపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి.. నగదుతో కూడిన కొన్ని పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
     
    నోట్లు రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే ఇలా నగదు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నట్లు నిఘా సంస్థలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. దీనిపై అప్రమత్తమయ్యే లోపే దాదాపు రూ.450 కోట్ల మేర నగదు పక్కదారి పట్టినట్లు రిజర్వుబ్యాంకు తాజాగా అంచనాకు వచ్చింది. నగదు ఏయే రూపాల్లో, ఏ విధంగా అక్రమార్కుల చేతికి చేరిందన్న వివరాలను అంతర్గత విచారణ ద్వారా సేకరించింది.
     
    కొద్దిరోజుల్లోనే..
    నగదు మార్పిడి ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే పోస్టాఫీసులు, సహకార బ్యాంకుల ద్వారా దాదాపు రూ.250 కోట్ల మేర, ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా మరో రూ.200 కోట్ల మేర కొత్త నోట్లు అక్రమార్కులకు చేరినట్లు అంచనా వేశారు. తొలుత 40 శాతం కమీషన్‌పై పాత నోట్లు తీసుకుని ప్రత్యామ్నాయ నగదు అందజేస్తామంటూ మొదలైన అక్రమ వ్యాపారం ఇప్పుడు 15 శాతానికి తగ్గిపోరుుంది. ఓ ఉన్నతాధికారి మాటల్లో చెప్పాలంటే ‘ఇప్పుడు రూ.100, రూ.2,000 నోట్లు ఇస్తామని ముందుకు వచ్చేవారు 10 మంది ఉంటే. పాత నోట్లు తీసుకుంటారా అని అడిగేవారు నలుగురు కూడా లేరు’. ఈ లెక్కన ఇప్పటికే భారీ మొత్తంలో నగదు పక్కదారి పట్టి ఉంటుందని రిజర్వుబ్యాంకు అంచనాకు వచ్చి పలు కోణాల్లో విచారణ జరిపింది.
     
    పటిష్టమైన నిఘా
    సహకార బ్యాంకులకు నగదు తరలించిన 48 గంటల్లోనే పక్కదారి పట్టిన విషయం తెలిసి రిజర్వుబ్యాంకు దిగ్బ్రాంతికి గురైంది. ఆ వెంటనే సహకార బ్యాంకులకు నగదు సరఫరా నిలిపివేసింది. అంతేకాదు సహకార బ్యాంకుల నగదు లావాదేవీలపై విచారణ జరపాలని నాబార్డ్‌ను ఆదేశించింది. తెలంగాణలోని ఏ సహకార బ్యాంకుకు ఎంత మొత్తంలో నగదు వెళ్లిందన్న వివరాలను నాబార్డ్‌తో పాటు సీబీఐకి అందజేసింది. సహకార బ్యాంకుల్లో ప్రతి రూపారుుకి లెక్క అడుగుతున్నామని, అనుమానం వస్తే విచారణ జరిపిస్తామని నాబార్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కొద్ది రోజుల్లోనే నగదు దుర్వినియోగం చేసిన బ్యాంకులు, బాధ్యులైన అధికారుల చిట్టా బయటపెడతామన్నారు.

    మరోవైపు పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు సక్రమంగా నగదు చేరుతుందని తొలుత రిజర్వుబ్యాంకు భావించినా... వారంలోపే వాటిల్లోనూ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించింది. దీంతో అనుమానిత పోస్టాఫీసులతోపాటు ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల వద్ద నిఘా పెంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొందరు బ్యాంకు మేనేజర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, అనుమానిత కాల్స్‌ను రికార్డు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను నిఘా వర్గాలు సమకూర్చుకున్నాయని తెలుస్తోంది. ఆ సంభాషణల ఆధారంగా కొన్ని లావాదేవీలను గుర్తించారని సమాచారం.
     
    నగదు లావాదేవీల పరిశీలనకు ప్రత్యేక బృందాలు
    ఎక్కువ మొత్తంలో నగదు ఉపసంహరణ, నోట్ల మార్పిడి పేరిట విపరీతంగా రూ.2వేల నోట్లు వినియోగించిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రికార్డుల పరిశీలనకు రిజర్వుబ్యాంకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ బహుళజాతి ఆర్థిక సంస్థ నిపుణుల సేవలను కూడా వినియోగించుకుంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ కొందరు సీనియర్ మేనేజర్లు పలు కంపెనీలు, అత్యవసర సర్వీసుల పేరుతో భారీగా నగదు జారీ చేసిన విషయం బయటపడింది. ఆ నగదు ఉపసంహరించిన వారు ఆ మొత్తాన్ని దేనికి వాడారు, ఎవరెవరికి చెల్లించారన్న వివరాలను సేకరించే పనిని సీబీఐకి అప్పగించినట్లు తెలిసింది.

    నగదు మార్పిడి పేరుతో ఒక రోజు వచ్చిన ఆధార్, ఇతర డాక్యుమెంట్లను మూడో రోజు, ఏడో రోజు, పదో రోజు సమర్పించి పెద్ద ఎత్తున నగదు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా కూడా విచారణ జరుగుతోందని.. వారిలో కొంతమందిని ప్రశ్చించడంతో పాటు సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని సీబీఐ వర్గాలు వెల్లడించారుు. ఈ అక్రమాలపై ప్రాథమిక నివేదిక అందాకే కేంద్ర ప్రభుత్వం వేలికి ఇంకు గుర్తు పెట్టాలన్న నిర్ణయంతీసుకుందని ఆ వర్గాలు తెలియజేశాయి.
     
    త్వరలో అరెస్టులు
    నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణల్లో అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న కొందరిని సీబీఐ ప్రశ్నిస్తోందని.. త్వరలోనే కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిమందిని సీబీఐ అదుపులోకి తీసుకుందని.. వారిలో కొందరు దళారులతోపాటు, పోస్టాఫీసు, బ్యాంకుల సిబ్బంది ఉన్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement