న్యూఢిల్లీ, సాక్షి: రాజకీయాలతో ముడిపడిన కేసు, పైగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు గనుకే.. ఓటుకు నోటు కేసు విచారణ ప్రభావితం కాకుండా మరో చోటుకి బదిలీ కోరుతున్నామని సుప్రీం కోర్టులో పిటిషనర్ వాదించారు. శుక్రవారం ఉదయం ఓటుకు నోటు కేసు పిటిషన్‌కు సంబంధించిన విచారణ జరిగింది.
ఈ పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు పంపించింది. అయితే రెండు వైపుల నుంచి కౌంటర్ మాత్రం దాఖలు కాలేదు. దీంతో కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే.. కౌంటర్ తప్పకుండా వేయాలంటూ తాము ఆదేశించలేమని జస్టిస్ గవాయితో కూడిన త్రిసభ్య ధర్మాసనం, పిటిషనర్‌కు స్పష్టం చేస్తూ విచారణను జులైకి వాయిదా వేసింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో విచారణ భోపాల్ కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపుతోంది.
ఇక.. విచారణ సమయంలో ఇరువర్గాల న్యాయవాదులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒకానొక దశలో పరిస్థితి శ్రుతి మించడంతో ‘‘ఇంతటి క్రమశిక్షణరాహిత్యాన్ని ఎప్పుడూ చూడలేదు’’ అంటూ జస్టిస్ బిఆర్. గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఈ కేసు విచారణను భోపాల్‌కే ఎందుకు బదిలీ చేయాలని కోరుతున్నారని బెంచ్ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న కేసు కాబట్టే.. బదిలీ కోరుతున్నామని జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది బెంచ్‌కు తెలియజేశారు.
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఇందుకు మధ్యవర్తిగా నియమించారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇస్తూ రేవంత్ తెలంగాణ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తదనంతర పరిణామాల్లో.. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ నడుస్తున్న పిటిషన్‌లో రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రాలు వాదనలు వినిపిస్తున్నారు.
చంద్రబాబు పేరెక్కడ?
చంద్రబాబు ప్రలోభ పర్వాన్ని తెలంగాణ ఏసీబీ బయటపెట్టింది. ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’’ అని చంద్రబాబున్నారు. ఆ గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ సైతం నిర్ధారించింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల గడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఏసీబీ ఈ కేసు ఛార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించింది. అయినా కూడా ఆయన పేరును నిందితుడిగా చేర్చకపోవడాన్ని ఆర్కే తన పిటిషన్ ద్వారా లేవనెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment