ప్రభుత్వానికి సమర్పించిన ఉన్నత విద్యామండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా పలు ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుతోపాటు ఇప్పటికే నెలకొని ఉన్న సంస్థల అభివృద్ధికి రూ.1747 కోట్ల మేర కేంద్ర నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం నివేదికలు సిద్ధంచేసింది. రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) కింద ఈ నిధులు సమకూర్చాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. వివిధ విద్యాసంస్థల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ రూపొందించిన ప్రతిపాదనలను ఏపీ ఉన్నత విద్యామండలి గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. వీటికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేశాక కేంద్రానికి సమర్పించనున్నారు.
రూసా నిధులకోసం జాబితా ఇదే
-ప్రస్తుతం ఉన్న అటానమస్ కాలేజీలుగా ఉన్న పీజీ సెంటర్లను కొత్త యూనివర్సిటీలుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు ఒక్కొక్క కాలేజీకి రూ.55 కోట్లు కేటాయించాలి. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలలో ఏయూ పీజీ సెంటర్లు, ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏఎన్‌యూ పీజీ సెంటర్‌ను యూనివర్సిటీలుగా మార్చనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పొట్టిశ్రీరాములు తెలుగుపీఠాన్ని ప్రత్యేక వర్సిటీగా రూపొందించనున్నారు. వీటన్నిటికీ కలిపి రూ.220 కోట్లు ప్రతిపాదించారు.
-శ్రీకాకుళంలో ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నరసన్నపేట డిగ్రీకాలేజీ, కర్నూలులోని ఎస్‌జే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీకాలేజీ, ప్రభుత్వ బాలుర డిగ్రీకాలేజీల అభివద్ధికి ఒక్కొక్కదానికి రూ.55 కోట్ల చొప్పున రూ. 110 కోట్ల నిధులకోసం ప్రతిపాదించారు.
-ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, ఆదికవి నన్నయ్య, యోగివేమన, బీఆర్ అంబేద్కర్ (శ్రీకాకుళం), కష్ణ, విక్రమ సింహపురి, రాయలసీమ, ద్రవిడ, జేఎన్‌యూ కాకినాడ, జేఎన్‌యూ అనంతపురం, ఆర్జేయూకేటీ (ఇడుపులపాయ) శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాలకు మౌలికసదుపాయాల కల్పనకోసం ఒకొక్కదానికి రూ.20 కోట్ల చొప్పున రూ.300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన చేశారు.
-శ్రీకాకుళంజిల్లా పాతపట్నం, విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీకాలేజీలు, అనంతపురంలో ఏర్పాటుచేయనున్న ప్రభుత్వ డిగ్రీకాలేజీని కొత్తగా ఆదర్శకాలేజీలుగా తీర్చిదిద్దేందుకు రూ.36 కోట్లు ప్రతిపాదించారు.
-తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీకాలేజీలను మోడల్‌కాలేజీలుగా మార్చేందుకు రూ.48 కోట్లు ప్రతిపాదనలు చేశారు.
-వీరఘట్టం (శ్రీకాకుళం), ఏలేశ్వరం (తూ.గో), బుట్టాయగూడెం (ప.గో), కంభం (ప్రకాశం), ఎర్రగుంట్ల (కర్నూలు)లోని ప్రభుత్వ డిగ్రీకాలేజీలు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో కొత్తగా నెలకొల్పబోయే కాలేజీలను మోడల్ కాలేజీలుగా ఏర్పాటుచేసేందుకు ఒకొక్కదానికి రూ.4 కోట్ల చొప్పున రూ.28 కోట్ల కోసం ప్రతిపాదనలు పొందుపరిచారు.
-కర్నూలు, శ్రీకాకుళం, నరసారావుపేట, విజయవాడ, నెల్లూరు, అనంతపురంలలో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు, తిరుపతిలో మహిళా ఇంజనీరింగ్ కాలేజీ, ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చి సెంటర్, కాకినాడలో స్కూల్ ఆఫ్ మెరైన్ బయాలజీ, గుంటూరులో స్కూల్ ఆఫ్ ఆర్టిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్, తిరుపతిలో ఇంగ్లీషు అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఇన్‌స్టిట్యూట్, కడపలో ఉర్దూ సంస్థల స్థాపనకు ఒక్కొక్క దానికి రూ.26 కోట్ల చొప్పున రూ.312 కోట్లు అవసరమని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నారు.
-137 డిగ్రీకాలేజీలు, ఒక ఓరియెంటల్ కాలేజి, కొత్తగా ఏర్పాటుచేయతలపెట్టిన 14 కాలేజీలకు, నాగార్జునసాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీకి, 15 వర్సిటీలు, 42 ముఖ్యకేంద్రాల్లోని డిగ్రీకాలేజీల్లో సదుపాయాల మెరుగుదలకు రూ.390 కోట్లు కావాలని ప్రతిపాదించారు.
-వర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీకాలేజీల్లో పరిశోధన, నైపుణ్యాల మెరుగుదలకు రూ.120 కోట్లు కావాలి.
- వివిధయూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు రూ.103 కోట్లు కావాలని ప్రతిపాదించారు. ఉన్నత విద్యామండలి, కాలేజియేట్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాల్లో ఇంటర్మీడియెట్‌బోర్డులలో మౌలిక ఏర్పాట్లగురించి నిధులకోసం కేంద్రానికి ప్రతిపాదిస్తున్నారు.
కొత్త విద్యాసంస్థలకోసం రూ.1747 కోట్ల నిధులకు ప్రతిపాదనలు
Published Fri, Oct 31 2014 12:31 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement