యంత్రుడా... అక్రమాల తంత్రుడా | Heavily mechanized sand mining | Sakshi
Sakshi News home page

యంత్రుడా... అక్రమాల తంత్రుడా

Published Sat, Jan 7 2017 10:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

యంత్రుడా... అక్రమాల తంత్రుడా - Sakshi

యంత్రుడా... అక్రమాల తంత్రుడా

అమరావతి : ఈ చిత్రం చూశారా!... అది విజయవాడ రూరల్‌ మండలం సూరయ్యపాలెంలోని ఇసుక ర్యాంపు. ఉచిత ఇసుక ముసుగులో అధికార టీడీపీ పెద్దల అనుచరుల అవినీతికి నిదర్శనం ఈ ర్యాంపు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలకు కేంద్రస్థానం. అందుకే అధికార యంత్రాంగం మిన్నుకుండిపోయింది.

కానీ హైకోర్టు మాత్రం బాధ్యతాయుతంగా స్పందించి కొరడా ఝళిపించింది. యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయించాలని అధికార యంత్రాంగాన్ని తాజాగా ఆదేశించింది. హైకోర్టు జోక్యం చేసుకుంటేగానీ సాధ్యం కానంతగా ఈ ర్యాంపు అక్రమాలు సాగాయని ఆశ్చర్యపోతున్నారా! ఆ ఇసుక అక్రమాల కథకమామిషు చూడండి...

‘ఉచిత ఇసుక’ ముసుగులో టీడీపీ పెద్దల అక్రమాలకు విజయవాడ రూరల్‌ మండలం సూరయ్యపాలెం ఇసుక క్వారీ ఓ మచ్చుతునక. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో స్వామీ అయ్యప్ప బోట్స్‌మెన్‌ సొసైటీకి ఈ క్వారీని లీజుకు తీసుకుంది. ఓ ప్రైవేటు వ్యక్తి పొలాన్ని లీజుకు తీసుకుని క్వారీ నిర్వహించారు. నది నుంచి బోట్ల ద్వారా ఇసుక తీసుకువచ్చి ట్రాక్టర్ల ద్వారా విక్రయించేవారు. అనంతరం టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఏడాదికిపైగా డ్వాక్రా సంఘాల సభ్యుల ద్వారా ఇసుక వ్యాపారం చేశారు. డీఆర్‌డీయే మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం 2016, మార్చిలో ‘ఉచిత ఇసుక’ విధానాన్ని ప్రకటించింది. అంతే దీన్నే ఆసరగా చేసుకుని జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేత ముఖ్య అనుచరులు రంగ ప్రవేశం చేశారు.

విజయవాడకు సమీపంలో ఉన్న ఆ క్వారీపై ఆయన ఎన్నాళ్ల నుంచో కన్నేశారు. కీలక నేత పేరుతో బోటు యజమానుల అసోషియేషన్‌ను బెదిరించి మరీ  2015 మార్చిలో ఆ క్వారీని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు.  ఇసుక వ్యాపారం చేపట్టారు. దీనిపై ప్రశ్నిస్తే ‘ఉచిత ఇసుక కదా... చేసుకుంటున్నాం’అని సమాధానం ఇచ్చారు.  స్థానికులుగానీ ఇతరులుగానీ ప్రవేశించనివ్వకుండా ఆ క్వారీని తమ అడ్డగా మార్చుకున్నారు.

9 నెలల్లో రూ.8.64కోట్ల ఇసుక దోపిడీ
సూరయ్యపాలెం క్వారీ వద్ద ఏకంగా తమ సిబ్బందిని నియోగించారు. టోకెన్లు ఇస్తూ మరీ ఇసుక అమ్మకాలు చేపట్టారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయకూడదు. కానీ అధికార బలంతో రెండు పొక్లెయిన్‌లు ఏర్పాటుచేసి భారీగా ఇసుకను తవ్వసాగారు. ఒక లారీ ఇసుకకు రూ.800 లేబర్‌ చార్జీ పేరుతో వసూలు చేయసాగారు. రోజుకు 400 లారీల ఇసుక విక్రయిస్తున్నారు. ఆ ప్రకారం రోజుకు రూ.3.20లక్షలు అంటే రూ.96లక్షల అక్రమ ఇసుక వ్యాపారం సాగించారు. గత 9నెలల్లో రూ.8.64కోట్ల విలువైన ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుపోయారని స్పష్టమవుతోంది.

హైకోర్టు కొరడా
బోటు యజమానుల సొసైటీ సభ్యులు టీడీపీ వర్గీయుల అక్రమాలపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేస్తున్నారని హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించింది. ఆ క్వారీలో యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయించాలని మైనింగ్‌ శాఖను ఆదేశించింది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా సాగుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకుంటారా!... చూడాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement