కార్డులకు కత్తెర
- ఆరు అంచెల్లో వడబోత
– సమాయత్తమైన ప్రభుత్వం
– అదను చూసి వేటు వేసేందుకు సిద్ధం
అనంతపురం అర్బన్ : తెల్ల కార్డులకు కోత పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు ఆరు అంచెల (సిక్స్ స్టెప్స్) ప్రణాళిక తయారు చేసింది. వీటిలో ఏ ఒక్కటి వర్తించినా కార్డుకు కోత పెట్టాలని నిర్ణయించింది. అయితే ఒక్కసారిగా కాకూండా అదను చూసి వేటువేసేందుకు సంసిద్ధంగా ఉంది. ఇందులో ఇప్పటికే రెండు అంచెల కింద జిల్లావ్యాప్తంగా నాలుగు వేల కార్డులు తొలగించింది.
కార్డుల కోతకు అరు అంచెలు ఇవే
+ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం
+ విద్యుత్ వినియోగం 200 యూనిట్లుకు బిల్లు చెల్లిస్తే
+ ఆదాయ పన్ను చెల్లించి ఉండడం
+ సొంత ఇల్లు 750 చదరపు అడుగులకు మించి ఉండడం.
+ వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతంల్లో రూ.60 వేలు మించి ఉండడం
+ తరి పొలం 2.50 ఎకరాలు లేదా మెట్ట పొలం 5 ఎకరాలకు మించి ఉండడం... ఇలా ఏ ఒక్కటి వర్తించినా రానున్న రోజుల్లో తెల్లరేషన్ కార్డు రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
నాలుగు వేల కార్డుల తొలగింపు
ప్రస్తుతానికి మూడు అంచెలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వంల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు వేల కార్డులను తొలగించింది. నాలుగు చక్రాల వాహనం ఉందని, వార్షిక ఆదాయం నిర్దేశించిన మొత్తాని కంటే అధికంగా ఉందని, ఇంటి అద్దె ఎక్కువగా చెల్లిస్తున్నారని ఇలా జిల్లాలో మొత్తం నాలుగు వేల తెల్లరేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది.
అదను చూసి వేటేసేందుకు
ఇప్పటికే ఆరు అంచెల్లో మూడు అంచెల నిర్దేశాల మేరకు నాలుగు వేల కార్డులు తొలగించిన ప్రభుత్వం, మిగతా మూడు అంచెలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి తొలగింపు అంశాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పొలం విషయంలో నిర్దేశించిన తరి 2.50 ఎకరాలు, మెట్ట 5 ఎకరాలకు మించి కలిగి ఉన్న అర్హత ప్రకారం జిల్లాలో చాలా మందికి కార్డులు తొలగించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ నిబంధన ప్రకారం కార్డుల తొలగింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఎప్పటికైనా ప్రభుత్వం ఆరు అంచెల నిర్దేశాల మేరకు కార్డులు తొలగించి తీరుతుందని అధికారులు స్పష్టం చేశారు.