Cuttings
-
చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది!
ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్‌లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్‌ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది... విద్యార్థి తల్లిగా నమ్మించి... జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్‌ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది. చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది! చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్‌కేస్‌లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్‌కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వర్క్ ఫ్రమ్ హోం: జీతపు కోతలు.. అనూహ్య స్పందన
వర్క్‌ఫ్రమ్ హోం-ఆఫీస్ వ్యవహారంలో టెక్ కంపెనీలు-ఉద్యోగుల మధ్య హైడ్రామా నడుస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుండడంతో ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీలు అడుగుతుంటే.. ఉద్యోగాలైనా వదిలేసుకుంటాం తప్ప రాబోమంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు ఉద్యోగులు. ఈ తరుణంలో కంపెనీలు మాత్రం మొండిపట్టు వీడడం లేదు. ఒకవేళ రిమోట్ వర్క్‌కే పట్టుబడితే కట్టింగ్లు తప్పవని ఉద్యోగులకు కరాఖండిగా చెప్పేశాయి కూడా. ఈ తరుణంలో ఉద్యోగుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించిన నేపథ్యంలో.. జీతాల కట్టింగ్‌కు తాము సిద్ధమేనని గూగుల్ ఉద్యోగులు బదులిచ్చారు. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోంకి అనుమతి ఇస్తే.. కట్టింగ్‌లపై తమకూ ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవని, కాకపోతే పర్ఫార్మెన్స్ ఆధారంగా ఏడాదికి ఒకసారి ఇచ్చే హైకులను మాత్రం కొనసాగించాలంటూ వేల మంది ఉద్యోగుల నుంచి రిప్లై మెయిల్స్ వెళ్తున్నాయి గూగుల్‌కి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల కండిషన్స్‌కు కంపెనీ సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాబ్ లొకేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా లొకేషన్ టూల్ జీతభత్యాల చెల్లింపునకు గూగుల్ సిద్ధపడుతుండగా.. అందుకు కూడా తాము సిద్ధమేనని సమ్మతి తెలిపారు ఉద్యోగులు. ఇది చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: అమెజాన్ నిర్ణయం ఇది ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌కి సుమారు లక్షా 35 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో గతంలో చాలామంది వర్క్‌ఫ్రమ్ హోం రిక్వెస్ట్‌లు పెట్టుకోగా.. కేవలం గత రెండు నెలల్లోనే సుమారు పది వేల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అర్జీలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో 85 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతి ఇవ్వాలని గూగుల్ నిర్ణయించుకుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోం, రీ లొకేషన్ విజ్ఞప్తులు తిరస్కరణకు గురైన ఉద్యోగులు.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా గూగుల్ నిర్ణయించింది. ఇక గూగుల్ నుంచి ఈ స్పందన వచ్చిన వెంటనే.. మరికొన్ని టెక్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టగా.. ఉద్యోగుల నుంచి ఇలాంటి స్పందనే వస్తోంది. ఇదీ చదవండి: ఆఫీసులకు వెళ్తేనే కదా అసలు మజా! వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పని భారం, మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ కరోనా వైరస్ భయం, ఉద్యోగాల్లో అభద్రతా భావం, ఎక్కువ సేపు ఇంట్లోనే గడిపే వీలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, డబ్బు సేవింగ్స్, ఇతర పనులు చక్కబెట్టుకునే వీలు!.. తదితర కారణాలతో కట్టింగ్లు అయినా సరే ‘వర్క్ ఫ్రమ్ హోం’కే ఉద్యోగులు మొగ్గుచూపిస్తున్నారు. ఇక డెల్టా వేరియెంట్ విజృంభణతో ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ను అక్టోబర్ 18 వరకు వాయిదా వేశాయి గూగుల్, యాపిల్ సహా ఇతరత్రా టెక్ కంపెనీలు. -
అమెరికా ‘శరణార్థుల’ కోత
వాషింగ్టన్: వచ్చే ఏడాదికి తమ దేశంలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యలో భారీగా కోతపెట్టాలని అమెరికా నిర్ణయించింది. కేవలం 45 వేల మందిని మాత్రమే శరణార్థులుగా అనుమతించాలని అమెరికా హోం ల్యాండ్ భద్రత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2016లో అనుమతించిన శరణార్థుల సంఖ్యలో ఇది దాదాపు సగం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయగానే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఈ విషయాన్ని అమెరికన్ కాంగ్రెస్‌కు అధికారికంగా వెల్లడించనున్నారు. తాజా ప్రతిపాదన మేరకు అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న 2018 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్రికా నుంచి 19 వేలు, తూర్పు ఆసియా నుంచి 5 వేలు, యూరప్, మధ్య ఆసియా నుంచి 2 వేలు, లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల నుంచి 1500, ఎన్‌ఈఎస్‌ఏ (నియర్ ఈస్ట్ సౌత్ ఏసియా) దేశాల నుంచి 17 వేల మందిని అనుమతిస్తారు. ప్రతిపాదన వివరాల్ని అమెరికా అధికారి వెల్లడిస్తూ.. ‘వచ్చే ఏడాది శరణార్థుల సంఖ్యను తగ్గిస్తున్నాం. అలాగే కొత్తగా వచ్చేవారి తనిఖీల అంశంపై వచ్చే నెల్లో సమీక్ష పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం’ అని పేర్కొన్నారు. అమెరికా ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, ఆ దిశగానే ఈ నిర్ణయమని ఆయన చెప్పారు. మానవతా సాయంలో అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో ముందు వరుసలో ఉందని, గతేడాది రూ. 44,800 కోట్లకు పైగా సాయం చేసిందని ఆ అధికారి వెల్లడించారు. 2017లో సిరియాకు రూ. 9 వేల కోట్ల మానవతా సాయం అందించామని తెలిపారు. అయితే అమెరికా నిర్ణయాన్ని ఆ దేశ కాంగ్రెస్ చట్ట సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తలు తప్పుపట్టారు. ‘శరణార్థుల సంఖ్యపై 45 వేల పరిమితి ఆమోదయోగ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మానవతా సంక్షోభం నేపథ్యంలో ఇలా పరిమితి విధించడం ఏమాత్రం సరికాదు’ అని సెనేటర్ డియన్నె ఫెయిన్స్టెన్ అన్నారు. ఈ నిర్ణయం అమానవీయమని మరో సెనేటర్ టామ్ కార్పర్ పేర్కొన్నారు. 2016లో 85 వేల శరణార్థులు: 2016లో 84,995 మంది శరణార్థులకు అమెరికా ఆశ్రయమివ్వగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 50 వేలకు తగ్గించారు. నిజానికి ప్రపంచంలో ఎక్కువమంది శరణార్థులకు ఆశ్రయమిస్తున్న దేశం అమెరికానే.. 1980లో 2 లక్షలకు పైగా శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టారు. 1975 నుంచి ఇప్పటివరకూ 30 లక్షలకు పైగా శరణార్థులకు అమెరికా ఆహ్వానం పలికింది. కాగా ఐక్యరాజ్యసమితిలో శరణార్థుల హైకమిషనర్ లెక్క మేరకు ప్రపంచవ్యాప్తంగా 2.25 కోట్ల మంది శరణార్థులు ఉండగా.. 6.56 కోట్ల మంది నిర్వాసితులుగా మారారు. కొత్త పన్ను విధానాలు: ట్రంప్ కొత్త పన్ను విధానాల్ని ప్రతిపాదించారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ప్రస్తుతమున్న పన్ను శ్లాబుల్ని మూడు(10, 25, 35)కు తగ్గించాలని ప్రతిపాదించారు. పన్ను మినహాయింపుల్ని కూడా రెండింతలు చేయాలని, బిజినెస్ పన్ను రేటును 15 శాతానికి తగ్గించాలనీ సూచించారు. ఈ ప్రతిపాదనల్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తేనే అమల్లోకి వస్తాయి. ఏ దేశం నుంచి ఎంతమందికి అనుమతి ఆఫ్రికా 19,000 తూర్పు ఆసియా 5,000 యూరప్, మధ్య ఆసియా 2,000 లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులు 1,500 నియర్ ఈస్ట్ సౌత్ ఏసియా దేశాలు 17,000 ట్రంప్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చిన జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ట్రంప్ వ్యతిరేకమని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తోసిపుచ్చారు. ప్రతి రోజూ ప్రజల్ని ఏకం చేసేందుకు ఫేస్బుక్ కృషిచేస్తుందని, ప్రజల ఆలోచనలకు ఫేస్బుక్ వేదికని ఆయన పేర్కొన్నారు. 2016 అమెరికా ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండేందుకే ఫేస్బుక్ ప్రయత్నించిందని జుకర్‌బర్గ్ గుర్తుచేశారు. -
కార్డులకు కత్తెర
- ఆరు అంచెల్లో వడబోత – సమాయత్తమైన ప్రభుత్వం – అదను చూసి వేటు వేసేందుకు సిద్ధం అనంతపురం అర్బన్ : తెల్ల కార్డులకు కోత పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు ఆరు అంచెల (సిక్స్ స్టెప్స్) ప్రణాళిక తయారు చేసింది. వీటిలో ఏ ఒక్కటి వర్తించినా కార్డుకు కోత పెట్టాలని నిర్ణయించింది. అయితే ఒక్కసారిగా కాకూండా అదను చూసి వేటువేసేందుకు సంసిద్ధంగా ఉంది. ఇందులో ఇప్పటికే రెండు అంచెల కింద జిల్లావ్యాప్తంగా నాలుగు వేల కార్డులు తొలగించింది. కార్డుల కోతకు అరు అంచెలు ఇవే + నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం + విద్యుత్ వినియోగం 200 యూనిట్లుకు బిల్లు చెల్లిస్తే + ఆదాయ పన్ను చెల్లించి ఉండడం + సొంత ఇల్లు 750 చదరపు అడుగులకు మించి ఉండడం. + వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతంల్లో రూ.60 వేలు మించి ఉండడం + తరి పొలం 2.50 ఎకరాలు లేదా మెట్ట పొలం 5 ఎకరాలకు మించి ఉండడం... ఇలా ఏ ఒక్కటి వర్తించినా రానున్న రోజుల్లో తెల్లరేషన్ కార్డు రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నాలుగు వేల కార్డుల తొలగింపు ప్రస్తుతానికి మూడు అంచెలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వంల జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు వేల కార్డులను తొలగించింది. నాలుగు చక్రాల వాహనం ఉందని, వార్షిక ఆదాయం నిర్దేశించిన మొత్తాని కంటే అధికంగా ఉందని, ఇంటి అద్దె ఎక్కువగా చెల్లిస్తున్నారని ఇలా జిల్లాలో మొత్తం నాలుగు వేల తెల్లరేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. అదను చూసి వేటేసేందుకు ఇప్పటికే ఆరు అంచెల్లో మూడు అంచెల నిర్దేశాల మేరకు నాలుగు వేల కార్డులు తొలగించిన ప్రభుత్వం, మిగతా మూడు అంచెలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి తొలగింపు అంశాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పొలం విషయంలో నిర్దేశించిన తరి 2.50 ఎకరాలు, మెట్ట 5 ఎకరాలకు మించి కలిగి ఉన్న అర్హత ప్రకారం జిల్లాలో చాలా మందికి కార్డులు తొలగించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ నిబంధన ప్రకారం కార్డుల తొలగింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఎప్పటికైనా ప్రభుత్వం ఆరు అంచెల నిర్దేశాల మేరకు కార్డులు తొలగించి తీరుతుందని అధికారులు స్పష్టం చేశారు. -
బాబూ...ఇదేం తీరు!
పింఛన్ లబ్ధిదారుల మెడపై కత్తి పింఛన్ నుంచి ఇంటి పన్ను వసూలు ఎలా బతికేది ‘బాబూ...’ ఎల్.ఎన్.పేట : ‘అధికారంలోకి వస్తే వికలాంగులకు నెలకు రూ.1500, వితంతు, వృద్ధాప్య, చేనేత, కళ్లుగీత కార్మికులకు నెలకు రూ.వెయ్యి పింఛన్.. ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే మీ ఇంటికే పంపిస్తాం...’ ఇది ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన బూటకపు హామీ. ఈ హామీలు బూటకమని తెలుసుకోలేని ప్రజలు ఓట్లు వేశారు. గద్దెనెక్కించారు. హామీల అమలుకు దిక్కు లేకుండా పోతుంది. పోనీ అమలు చేసిన హామీలపై నెలకో విధమైన కోత తప్పడం లేదు. పింఛన్‌దారుల డబ్బులపై ఇంటి పన్ను రూపంలో కోత పడింది. పంచాయతీ కార్యదర్శులపై ఇంటి పన్ను లక్ష్యాల భారం పెట్టడంతో మరో గత్యంతరం లేక పింఛన్ లబ్ధిదారుల నుంచి వారి ఇళ్లకు చెందిన ఇంటి పన్నును వసూలు చేసుకుంటున్నారు. ఒక్కోక్క పింఛన్ దారుని నుంచి రూ.100 నుంచి రూ.400ల వరకు ఇంటి పన్ను వసూలు చేసి మిగిలిన పింఛన్ డబ్బులతో పాటు ఇంటి పన్ను రశీదును చేతిలో పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. చాలీచాలని డబ్బులతో నెలంతా ఎలా బతికేది ‘బాబూ...’ అంటు పలువురు వృద్ధులు, వికలాంగులు వాపోతున్నారు. మండలంలో పింఛన్‌దారుల పరిస్థితి ఇలా ఉంది. వృద్ధాప్య పింఛన్లు 1380, చేనేత 41, వితంతు 886, అభయహస్తం 379, వికలాంగులు 383, ఇతర పింఛను దారులు 118మంది ఉన్నారు. వీరిలో పురి గుడిసెల్లో ఉన్న వారే అధికశాతం మంది ఉన్నారు. రూ.16లక్షల లక్ష్యం మండలంలో ఇంటి పన్ను వసూలు చేసేందుకు ఇక్కడి పంచాయతీ అధికారితో పాటు పంచాయతీ కార్యదర్శులు సుమారు 9,500 ఇళ్లు నుంచి రూ.5.50లక్షలు లక్ష్యంగా తీసుకున్నారు. దీన్ని మూడు రెట్లుకు పెంచిన ప్రభుత్వం ఏకంగా ముక్కుపిండి మరీ రూ.16లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణరుుంచింది. మార్చి నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకోకపోతే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో వేరే గత్యంతరం లేక బలవంతపు వసూళ్లుకు పూనుకున్నారు. ఏమి సౌకర్యాలు కల్పించారని? ఊరు పుట్టినప్పుడు ఇళ్లు కట్టుకున్నామని ఇప్పటి వరకు ఎవరు ఇంటి పన్ను అని అడగలేదని ఇప్పుడే ఇంటిపన్నులు గుర్తుకు వచ్చాయా? అంటూ పంచాయతీ కార్యదర్శులను పలువురు నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు లేని పన్నుల భారం ఇప్పుడే ఎందుకు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి ఏమి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఇంటి పన్ను కట్టాలో తెలియజేయాలని నిలదీస్తున్నారు. తాగునీరుకు కుళాయిల్లేవు, వీధి దీపాలు వెలగవు, పారిశుధ్యం పట్టించుకోరు, సీసీరోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధులు ఊడ్చేవారు ఎప్పుడు రారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పన్ను ఎందుకు కట్టాలో అధికారులు, పాలకులు తెలియజేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.