ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్‌లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది.
హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్‌ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది...
విద్యార్థి తల్లిగా నమ్మించి...
జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్‌ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది.
చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది!
చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్‌కేస్‌లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్‌కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment