‘అల’ వైకుంఠపురములో.. బుసాన్‌లో అలలపై తేలియాడే నగర నిర్మాణం | Floating City In Busan To Be Completed By 2025 | Sakshi
Sakshi News home page

‘అల’ వైకుంఠపురములో.. బుసాన్‌లో అలలపై తేలియాడే నగర నిర్మాణం

Published Thu, Nov 25 2021 4:13 AM | Last Updated on Thu, Nov 25 2021 2:37 PM

Floating City In Busan To Be Completed By 2025 - Sakshi

సముద్ర తీరంలో బతకడం ఇష్టపడనివారుండరు. ఇక సముద్రంలోనే బతికే అవకాశం వస్తే... అంతకుమించి అదృష్టమే లేదనుకుంటారు. అలాంటివారికోసమే ఈ నీటిపై తేలియాడే నగరం. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో నిర్మిస్తున్న ఈ సిటీలో నివసించాలనుకుంటే 2025 వరకు ఆగాల్సిందే. సముద్ర మట్టాలు పెరిగినప్పుడు ప్రత్యామ్నాయ ఆవాసాలుగా ఇలాంటి నగరాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మరి ఆ సముద్ర నగరాల కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.. – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

 
అలలపై తేలియాడే నగరం అనగానే మనకు వెనిస్‌ గుర్తొస్తుంది. కానీ అది కొన్ని దీవుల సముదాయం. సముద్రపు అడుగు భూభాగానికి అనుసంధానం చేసి... పూర్తిగా తేలియాడే నగరం ఇప్పుడు ఉత్తర కొరియాలోని బుసాన్‌లో నిర్మితమవుతోంది. యూఎన్‌ హ్యాబిటాట్‌ (యునెటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ సెటి ల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌) తలపెట్టిన ఈ నగర నిర్మాణాన్ని చేస్తున్నది న్యూయార్క్‌కు చెందిన ఓషెనిక్స్‌. ఈ మేరకు బుసాన్‌ మెట్రోపాలిటన్‌ సిటీతో ఒప్పందం జరిగింది. సముద్ర తీర నగరాల్లో పెరుగుతున్న రద్దీని తగ్గించడానికి ఈ నగరాలు ఉపయోగపడతాయని యూఎన్‌ భావిస్తోంది.

 

పదివేలమందికి ఆవాసంగా... 
పదివేల మంది నివసించే విధంగా 75 హెక్టార్లలో నగరాన్ని నిర్మించాలని ఓషెనిక్స్‌ భావిస్తోంది. అయితే సిటీ పరిధి ఎంతనేది ఇంకా తుది నిర్ణయం కాలేదు. కేవలం ఇళ్లే కాదు... ఇక్కడ నివసించేవారికోసం ఒక పబ్లిక్‌ స్క్వేర్, వాణిజ్య, ఆధ్యాత్మిక, క్రీడాసాంస్కృతిక, ఆరోగ్య కేంద్రాలు కూడా ఉంటాయని ఓషెనిక్స్‌ తెలిపింది. 

సాగు కూడా ఇక్కడే..
ద్వీపాల్లో ఉండే సున్నపుపూత రాయి కాంక్రీట్‌కంటే రెండు మూడు రెట్లు దృఢంగా ఉంటుంది. అయినా తేలికగా ఉంటుంది. దానికి భవన ప్లాట్‌ఫామ్‌కి అనుసంధానం చేస్తారు.  వేగంగా పెరిగే వెదురు వంటి వాటిని భవన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. ఇవి స్టీల్‌కంటే ఆరురెట్లు బలంగా ఉంటాయి. వీటివల్ల కర్బన ఉద్గారాలుండవు. గాలుల నుంచి తట్టుకునేందుకు ఏడు అంతస్తుల వరకే నిర్మిస్తారు. వేసవిలో బూసాన్‌లో విపరీతమైన వేడి ఉంటుంది.

భవనాలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుతో కింద చల్లగా ఉంటుంది. ఈ సోలార్‌ ప్యానెల్స్‌ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌నే నగరానికి ఉపయోగిస్తారు. ప్రతి ప్లాట్‌ఫామ్‌ కింద బోనులుంటాయి. వీటిలో సీ ఫుడ్‌ను పెంచుకోవచ్చు. వీటినుంచి వెలువడే వ్యర్థాలు మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఆకుకూరలు, కూరగాయల సాగుకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నారు. వేగన్‌ ఫుడ్‌ ఇష్టపడేవారు ఇక్కడ సులభంగా ఇమిడిపోవచ్చు. ఇక నివాసాల మధ్య రవాణాకోసం పెడల్‌ బోట్స్‌ను వాడనున్నారు.  

 

వరదను తట్టుకుని... 
సాధారణంగా మానవ నిర్మిత ద్వీపాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. 2019లో వచ్చిన వరదలు వెనిస్‌ను చాలా దెబ్బతీశాయి. కానీ అలాంటి ఇబ్బందులు ఎదురవకుండా వరద నిరోధక భవనాలను నిర్మించనున్నారు. సముద్రమట్టం పెరిగినా వీటికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రకృతి విపత్తులైన సునామీలు, ఐదో కేటగిరీ హరికేన్స్‌ను సైతం తట్టుకుని ఈ నగరాలు మన గలుగుతాయి. ‘‘నీటితో పోరాడేకంటే కలిసి సామరస్యంగా బతకడం నేర్చుకుంటే బాగుం టుంది. వాతావరణంలో మార్పులకనుగుణంగా వ్యూహాలననుసరిస్తూ ఈ నగరాలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని యూఎన్‌హ్యాబిటాట్‌ ఎగ్జిక్యూటివ్‌డైరెక్టర్‌ మైమునాహ్‌ మహ్మద్‌ షరీఫ్‌  అంటున్నారు. 

రూ.1500 కోట్ల వ్యయంతో..
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1500 కోట్లు అనుకున్నా.. ఫైనల్‌ డిజైన్, నిర్మాణానికి ఉపయోగించే సామగ్రిని బట్టి  ఇది మారుతుండొచ్చని అంచనా. 2025 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇళ్లు అద్దెకు ఇస్తారా? అద్దె ఎలా ఉంటుంది? కొనుక్కోవచ్చా? కొనాలనుకుంటే ఖరీదు ఎంత? ఈ విషయాలు ఇంకా తెలియలేదు. ఈ తేలియాడే నగరాల నిర్మాణం కోసం మరో పది దేశాల ప్రభుత్వాలతో ఓషెనిక్స్‌ చర్చలు జరుపుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement