floating city
-
‘అల’ వైకుంఠపురములో.. బుసాన్‌లో అలలపై తేలియాడే నగర నిర్మాణం
సముద్ర తీరంలో బతకడం ఇష్టపడనివారుండరు. ఇక సముద్రంలోనే బతికే అవకాశం వస్తే... అంతకుమించి అదృష్టమే లేదనుకుంటారు. అలాంటివారికోసమే ఈ నీటిపై తేలియాడే నగరం. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో నిర్మిస్తున్న ఈ సిటీలో నివసించాలనుకుంటే 2025 వరకు ఆగాల్సిందే. సముద్ర మట్టాలు పెరిగినప్పుడు ప్రత్యామ్నాయ ఆవాసాలుగా ఇలాంటి నగరాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మరి ఆ సముద్ర నగరాల కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ అలలపై తేలియాడే నగరం అనగానే మనకు వెనిస్ గుర్తొస్తుంది. కానీ అది కొన్ని దీవుల సముదాయం. సముద్రపు అడుగు భూభాగానికి అనుసంధానం చేసి... పూర్తిగా తేలియాడే నగరం ఇప్పుడు ఉత్తర కొరియాలోని బుసాన్‌లో నిర్మితమవుతోంది. యూఎన్ హ్యాబిటాట్ (యునెటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటి ల్మెంట్ ప్రోగ్రామ్) తలపెట్టిన ఈ నగర నిర్మాణాన్ని చేస్తున్నది న్యూయార్క్‌కు చెందిన ఓషెనిక్స్. ఈ మేరకు బుసాన్ మెట్రోపాలిటన్ సిటీతో ఒప్పందం జరిగింది. సముద్ర తీర నగరాల్లో పెరుగుతున్న రద్దీని తగ్గించడానికి ఈ నగరాలు ఉపయోగపడతాయని యూఎన్ భావిస్తోంది. పదివేలమందికి ఆవాసంగా... పదివేల మంది నివసించే విధంగా 75 హెక్టార్లలో నగరాన్ని నిర్మించాలని ఓషెనిక్స్ భావిస్తోంది. అయితే సిటీ పరిధి ఎంతనేది ఇంకా తుది నిర్ణయం కాలేదు. కేవలం ఇళ్లే కాదు... ఇక్కడ నివసించేవారికోసం ఒక పబ్లిక్ స్క్వేర్, వాణిజ్య, ఆధ్యాత్మిక, క్రీడాసాంస్కృతిక, ఆరోగ్య కేంద్రాలు కూడా ఉంటాయని ఓషెనిక్స్ తెలిపింది. సాగు కూడా ఇక్కడే.. ద్వీపాల్లో ఉండే సున్నపుపూత రాయి కాంక్రీట్‌కంటే రెండు మూడు రెట్లు దృఢంగా ఉంటుంది. అయినా తేలికగా ఉంటుంది. దానికి భవన ప్లాట్‌ఫామ్‌కి అనుసంధానం చేస్తారు. వేగంగా పెరిగే వెదురు వంటి వాటిని భవన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. ఇవి స్టీల్‌కంటే ఆరురెట్లు బలంగా ఉంటాయి. వీటివల్ల కర్బన ఉద్గారాలుండవు. గాలుల నుంచి తట్టుకునేందుకు ఏడు అంతస్తుల వరకే నిర్మిస్తారు. వేసవిలో బూసాన్‌లో విపరీతమైన వేడి ఉంటుంది. భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో కింద చల్లగా ఉంటుంది. ఈ సోలార్ ప్యానెల్స్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌నే నగరానికి ఉపయోగిస్తారు. ప్రతి ప్లాట్‌ఫామ్ కింద బోనులుంటాయి. వీటిలో సీ ఫుడ్‌ను పెంచుకోవచ్చు. వీటినుంచి వెలువడే వ్యర్థాలు మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఆకుకూరలు, కూరగాయల సాగుకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నారు. వేగన్ ఫుడ్ ఇష్టపడేవారు ఇక్కడ సులభంగా ఇమిడిపోవచ్చు. ఇక నివాసాల మధ్య రవాణాకోసం పెడల్ బోట్స్‌ను వాడనున్నారు. వరదను తట్టుకుని... సాధారణంగా మానవ నిర్మిత ద్వీపాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. 2019లో వచ్చిన వరదలు వెనిస్ను చాలా దెబ్బతీశాయి. కానీ అలాంటి ఇబ్బందులు ఎదురవకుండా వరద నిరోధక భవనాలను నిర్మించనున్నారు. సముద్రమట్టం పెరిగినా వీటికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రకృతి విపత్తులైన సునామీలు, ఐదో కేటగిరీ హరికేన్స్‌ను సైతం తట్టుకుని ఈ నగరాలు మన గలుగుతాయి. ‘‘నీటితో పోరాడేకంటే కలిసి సామరస్యంగా బతకడం నేర్చుకుంటే బాగుం టుంది. వాతావరణంలో మార్పులకనుగుణంగా వ్యూహాలననుసరిస్తూ ఈ నగరాలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని యూఎన్‌హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ మైమునాహ్ మహ్మద్ షరీఫ్ అంటున్నారు. రూ.1500 కోట్ల వ్యయంతో.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1500 కోట్లు అనుకున్నా.. ఫైనల్ డిజైన్, నిర్మాణానికి ఉపయోగించే సామగ్రిని బట్టి ఇది మారుతుండొచ్చని అంచనా. 2025 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇళ్లు అద్దెకు ఇస్తారా? అద్దె ఎలా ఉంటుంది? కొనుక్కోవచ్చా? కొనాలనుకుంటే ఖరీదు ఎంత? ఈ విషయాలు ఇంకా తెలియలేదు. ఈ తేలియాడే నగరాల నిర్మాణం కోసం మరో పది దేశాల ప్రభుత్వాలతో ఓషెనిక్స్ చర్చలు జరుపుతోంది. -
తేలియాడే దేశం..!
ఇప్పటి వరకు నీటిపై తేలియాడే ఇళ్లు చూశాం.. హోటళ్లు చూశాం.. చిన్న చిన్న విల్లాలను కూడా చూశాం కానీ.. ఇప్పుడు ఏకంగా నీటిపై తేలియాడే దేశాన్నే చూడబోతున్నాం. ఎక్కడంటే పసిఫిక్ మహాసముద్రంలో 2022 నాటికి నిజం కానుంది. దేశం ఏంటి తయారు చేయడం ఏంటని అవాక్కవుతున్నారా..? అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పేపాల్ కంపెనీ యజమాని పీటర్ థీల్ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. తొలుత ఈ దేశంలో 300 ఇళ్లను పాలినేసియా దేశం సాయంతో నిర్మించనున్నారు. ఈ దేశానికి ‘వేరియాన్’ అనే సొంత క్రిప్టోకరెన్సీని కూడా ఏర్పాటు చేసుకోనున్నారు. పైగా ఈ దేశానికి సరిహద్దు సమస్యలు, ప్రపంచ వాణిజ్య సమస్యలు ఉండబోవని రాజకీయ విశ్లేషకుడు నథాలీ మెజా గార్సియా పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పుల కారణంగా నివాసాలు కోల్పోయే శరణార్థులకు ఆశ్రయం కల్పించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక్కడ నిర్మించబోయే ప్రతి ఇల్లు కూడా పర్యావరణ హితంగా, వెదురు చెట్ల కర్రలతో నిర్మిస్తారని చెబుతున్నారు. చూద్దాం ఈ తేలియాడే దేశం కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందో లేదో..! -
కల్పన కాదు : తొలి తేలియాడే నగరం రాబోతోంది..!
ఫ్రెంచ్ పాలినేసియా : ఇది కాల్పనికత కాదు. నిజమే. త్వరలోనే ప్రపంచం తొలి తేలియాడే నగరాన్ని చూడబోతోంది. ఫ్రెంచ్ పాలినేసియా సముద్ర తీరంలో తేలియాడే నగరాన్ని నిర్మించేందుకు ఓ స్వచ్చంధ సంస్థ నడుంబిగించింది. ఇందుకోసం ఓ నిపుణుల బృందం ప్రొటోటైప్‌ను తయారు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. సముద్ర జలాలు పెరుగుతున్న నేపథ్యంలో తేలియాడే నగర నిర్మాణం మానవ జాతి మనుగడకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సీస్టెడింగ్ ఇనిస్టిట్యూట్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తేలియాడే నగర నిర్మణానికి అయ్యే ఖర్చును భరించనుంది. ఫ్రెంచ్ పాలినేసియా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. 2020 కల్లా 12 నిర్మాణాలతో తేలియాడే నగరాన్ని నిర్మించాలనే వ్యూహాన్ని సీస్టెడింగ సిద్ధం చేసింది. ఇందుకు ఆరో కోట్ల డాలర్లు ఖర్చు చేయనుంది. నగర నిర్మాణంలో వెదురు, సాధారణ చెక్క, కొబ్బరి పీచు, మెటల్, ప్లాస్టిక్‌లను వినియోగించనున్నారు. 2050 కల్లా ఇలాంటి తేలియాడే నగరాలు వేలల్లో నిర్మితమవుతాయని, వాటికి ఫ్రెంచ్ పాలినేసియా నిర్మిస్తున్న తేలియాడే నగరమే నాంది కాబోతోందని ఆ దేశాధ్యక్షుడు క్విర్క్ అన్నారు. -
జలాలపై జన నివాసాలు
ఎవరు ఔనన్నా, ఇంకెవరు కాదన్నా.... ఈ భూమ్మీద మనిషికి నూకలు చెల్లే కాలం దగ్గరకొచ్చేసింది. పర్యావరణం అతలాకుతలమవుతోంది. అకాల వరదలు నగరాలను ముంచేస్తున్నాయి. ఇంకొన్నేళ్లు పోతే... నీటి యుద్ధాలు తప్పవేమో అనేట్టుగా ఉంది పరిస్థితి. సపోజ్.. ఫర్ సపోజ్.. రేపోమాపో... ‘నేల‘పై బతికే పరిస్థితి లేకపోతే మీరేం చేస్తారు? మీరింకా అంతదూరం ఆలోచించి ఉండరుగానీ... సీస్టీడింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రం ఎంచక్కా సముద్రాలపై నగరాలు కట్టేస్తే పోలా అంటోంది. భూమ్మీద 70 శాతం ప్రాంతాన్ని ఆవరించిన సముద్రాలపై.. తేలియాడే నగరాలను కట్టాలన్న ఈ కంపెనీ ఆలోచనకు ఈ మధ్యే ఫ్రెంచ్ పాలినీసియా దేశ ప్రభుత్వం ఓకే చెప్పేసింది. న్యూజిల్యాండ్, అమెరికాల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది ఈ చిన్ని దేశం. వందకుపైగా ద్వీపాలతో 2.5 లక్షల జనాభా మాత్రమే ఉండే ఫ్రెంచ్ పాలినీసియా సమీపంలో పైలెట్ పద్ధతిన ఓ తేలియాడే నగరాన్ని కట్టాలన్నది సీస్టీడింగ్ ఆలోచన. పక్క ఫొటోల్లో కనిపిస్తున్నది అలాంటి డిజైనే. అక్కడికక్కడే పంటలు పండించుకోవడానికి, విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడానికి ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. నాచుమొక్కల పెంపకం ద్వారా అటు చేపల్ని ఇటు ఇంధనాన్ని తయారు చేసుకుంటుంది ఈ నగరం. చిన్న చిన్న ద్వీపాల మధ్య ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు విపరీత వాతావరణంతో ఇబ్బందుల్లేకుండా చేసుకుంటున్నారు. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుందని అంటున్నారు సీస్టీడింగ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి రున్డాల్ఫ్ హెన్కిన్. పర్యావరణానికి ఏమాత్రం హాని జరగని రీతిలో వ్యర్థాల రీసైక్లింగ్ కూడా జరుగుతుందని, ఏ దేశంవారైనా ఈ తేలియాడే నగరంలో నివసించేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆకాశంలో సమాంతర ప్రపంచం!
ఆకాశంలో మేఘాలపైన ఓ నగరం అలా కదులుతూ కనిపిస్తే.. మేఘాల పక్కన పెద్ద పెద్ద భవంతుల సమూహం కాసేపు కనువిందు చేస్తే.. ఎలా ఉంటుంది? ఆకాశంలో ఒక సమాంతర ప్రపంచం ఉందా? అనిపిస్తుంది. ఇదే అనుమానం చైనాలోని ఫొషాన్, జియాంగ్జీ వాసులకు కలిగింది. ఫొషాన్, జియాంగ్జి ప్రాంతాల వాసులకు ఇటీవల ఆకాశంలో మిస్టరీ నగరం కనిపించింది. పెద్దగా మేఘాలు లేకుండా నిశ్చలంగా ఉన్న ఆకాశంలో ఆకస్మాత్తుగా ఒక నగరం కదులుతూ కనిపించింది. ఇది కొన్ని నిమిషాలపాటు చూపరులను ఆకట్టుకుంది. స్థానికుడొకరు ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ నెల 13న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 41లక్షలమంది చూశారు. ఆకాశంలో కాసేపు కనిపించి ఆపై కనుమరుగైన ఈ దృశ్యంపై స్థానికులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మనకు తెలియకుండా ఉన్న సమాంతర ప్రపంచానికి సంబంధించిన దృశ్యమిదని, విశ్వంలో మరో ప్రపంచం కూడా ఉందని కొందరు వ్యాఖ్యానించగా.. కొత్త తరానికి కొత్త మతాన్ని అందించేందుకు నాసా తీసుకొస్తున్న 'ప్రాజెక్టు బ్లూ బీమ్ టెస్ట్'లో భాగమే ఇదని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. 'చైనా సాధించిన సాంకేతిక పరిజ్ఞానానికి ఇది నిదర్శనం అయి ఉంటుంది. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు చైనా అత్యంత రహస్యంగా చేపట్టిన హోలోగ్రాఫిక్ టెక్నాలజీని పరీక్షించి ఉంటార'ని ఈ వీడియోను పోస్టుచేసిన పారానార్మల్ క్రూసిబుల్ అనే యూట్యూబ్ చానెల్ పేర్కొంది.