ఆకాశంలో సమాంతర ప్రపంచం!
ఆకాశంలో మేఘాలపైన ఓ నగరం అలా కదులుతూ కనిపిస్తే.. మేఘాల పక్కన పెద్ద పెద్ద భవంతుల సమూహం కాసేపు కనువిందు చేస్తే.. ఎలా ఉంటుంది? ఆకాశంలో ఒక సమాంతర ప్రపంచం ఉందా? అనిపిస్తుంది. ఇదే అనుమానం చైనాలోని ఫొషాన్, జియాంగ్జీ వాసులకు కలిగింది. ఫొషాన్, జియాంగ్జి ప్రాంతాల వాసులకు ఇటీవల ఆకాశంలో మిస్టరీ నగరం కనిపించింది. పెద్దగా మేఘాలు లేకుండా నిశ్చలంగా ఉన్న ఆకాశంలో ఆకస్మాత్తుగా ఒక నగరం కదులుతూ కనిపించింది. ఇది కొన్ని నిమిషాలపాటు చూపరులను ఆకట్టుకుంది.
స్థానికుడొకరు ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ నెల 13న యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 41లక్షలమంది చూశారు. ఆకాశంలో కాసేపు కనిపించి ఆపై కనుమరుగైన ఈ దృశ్యంపై స్థానికులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మనకు తెలియకుండా ఉన్న సమాంతర ప్రపంచానికి సంబంధించిన దృశ్యమిదని, విశ్వంలో మరో ప్రపంచం కూడా ఉందని కొందరు వ్యాఖ్యానించగా.. కొత్త తరానికి కొత్త మతాన్ని అందించేందుకు నాసా తీసుకొస్తున్న 'ప్రాజెక్టు బ్లూ బీమ్ టెస్ట్'లో భాగమే ఇదని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
'చైనా సాధించిన సాంకేతిక పరిజ్ఞానానికి ఇది నిదర్శనం అయి ఉంటుంది. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు చైనా అత్యంత రహస్యంగా చేపట్టిన హోలోగ్రాఫిక్ టెక్నాలజీని పరీక్షించి ఉంటార'ని ఈ వీడియోను పోస్టుచేసిన పారానార్మల్ క్రూసిబుల్ అనే యూట్యూబ్ చానెల్ పేర్కొంది.