Busan
-
బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి అక్టోబరు 11 వరకు దక్షిణ కొరియాలో 29వ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్) జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న 279 చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’కి చోటు లభించింది. అక్టోబరు 8, 9 తేదీల్లో ఈ చిత్రం ‘బీఐఎఫ్‌ఎఫ్’లో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని ‘కల్కి 2898ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ‘ఎక్స్’ మాధ్యమంలో ధ్రువీకరించింది. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలై, సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుంది. -
చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది!
ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్‌లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్‌ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది... విద్యార్థి తల్లిగా నమ్మించి... జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్‌ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది. చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది! చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్‌కేస్‌లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్‌కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అల’ వైకుంఠపురములో.. బుసాన్‌లో అలలపై తేలియాడే నగర నిర్మాణం
సముద్ర తీరంలో బతకడం ఇష్టపడనివారుండరు. ఇక సముద్రంలోనే బతికే అవకాశం వస్తే... అంతకుమించి అదృష్టమే లేదనుకుంటారు. అలాంటివారికోసమే ఈ నీటిపై తేలియాడే నగరం. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో నిర్మిస్తున్న ఈ సిటీలో నివసించాలనుకుంటే 2025 వరకు ఆగాల్సిందే. సముద్ర మట్టాలు పెరిగినప్పుడు ప్రత్యామ్నాయ ఆవాసాలుగా ఇలాంటి నగరాలు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మరి ఆ సముద్ర నగరాల కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ అలలపై తేలియాడే నగరం అనగానే మనకు వెనిస్ గుర్తొస్తుంది. కానీ అది కొన్ని దీవుల సముదాయం. సముద్రపు అడుగు భూభాగానికి అనుసంధానం చేసి... పూర్తిగా తేలియాడే నగరం ఇప్పుడు ఉత్తర కొరియాలోని బుసాన్‌లో నిర్మితమవుతోంది. యూఎన్ హ్యాబిటాట్ (యునెటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటి ల్మెంట్ ప్రోగ్రామ్) తలపెట్టిన ఈ నగర నిర్మాణాన్ని చేస్తున్నది న్యూయార్క్‌కు చెందిన ఓషెనిక్స్. ఈ మేరకు బుసాన్ మెట్రోపాలిటన్ సిటీతో ఒప్పందం జరిగింది. సముద్ర తీర నగరాల్లో పెరుగుతున్న రద్దీని తగ్గించడానికి ఈ నగరాలు ఉపయోగపడతాయని యూఎన్ భావిస్తోంది. పదివేలమందికి ఆవాసంగా... పదివేల మంది నివసించే విధంగా 75 హెక్టార్లలో నగరాన్ని నిర్మించాలని ఓషెనిక్స్ భావిస్తోంది. అయితే సిటీ పరిధి ఎంతనేది ఇంకా తుది నిర్ణయం కాలేదు. కేవలం ఇళ్లే కాదు... ఇక్కడ నివసించేవారికోసం ఒక పబ్లిక్ స్క్వేర్, వాణిజ్య, ఆధ్యాత్మిక, క్రీడాసాంస్కృతిక, ఆరోగ్య కేంద్రాలు కూడా ఉంటాయని ఓషెనిక్స్ తెలిపింది. సాగు కూడా ఇక్కడే.. ద్వీపాల్లో ఉండే సున్నపుపూత రాయి కాంక్రీట్‌కంటే రెండు మూడు రెట్లు దృఢంగా ఉంటుంది. అయినా తేలికగా ఉంటుంది. దానికి భవన ప్లాట్‌ఫామ్‌కి అనుసంధానం చేస్తారు. వేగంగా పెరిగే వెదురు వంటి వాటిని భవన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. ఇవి స్టీల్‌కంటే ఆరురెట్లు బలంగా ఉంటాయి. వీటివల్ల కర్బన ఉద్గారాలుండవు. గాలుల నుంచి తట్టుకునేందుకు ఏడు అంతస్తుల వరకే నిర్మిస్తారు. వేసవిలో బూసాన్‌లో విపరీతమైన వేడి ఉంటుంది. భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో కింద చల్లగా ఉంటుంది. ఈ సోలార్ ప్యానెల్స్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌నే నగరానికి ఉపయోగిస్తారు. ప్రతి ప్లాట్‌ఫామ్ కింద బోనులుంటాయి. వీటిలో సీ ఫుడ్‌ను పెంచుకోవచ్చు. వీటినుంచి వెలువడే వ్యర్థాలు మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఆకుకూరలు, కూరగాయల సాగుకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నారు. వేగన్ ఫుడ్ ఇష్టపడేవారు ఇక్కడ సులభంగా ఇమిడిపోవచ్చు. ఇక నివాసాల మధ్య రవాణాకోసం పెడల్ బోట్స్‌ను వాడనున్నారు. వరదను తట్టుకుని... సాధారణంగా మానవ నిర్మిత ద్వీపాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. 2019లో వచ్చిన వరదలు వెనిస్ను చాలా దెబ్బతీశాయి. కానీ అలాంటి ఇబ్బందులు ఎదురవకుండా వరద నిరోధక భవనాలను నిర్మించనున్నారు. సముద్రమట్టం పెరిగినా వీటికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రకృతి విపత్తులైన సునామీలు, ఐదో కేటగిరీ హరికేన్స్‌ను సైతం తట్టుకుని ఈ నగరాలు మన గలుగుతాయి. ‘‘నీటితో పోరాడేకంటే కలిసి సామరస్యంగా బతకడం నేర్చుకుంటే బాగుం టుంది. వాతావరణంలో మార్పులకనుగుణంగా వ్యూహాలననుసరిస్తూ ఈ నగరాలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని యూఎన్‌హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ మైమునాహ్ మహ్మద్ షరీఫ్ అంటున్నారు. రూ.1500 కోట్ల వ్యయంతో.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1500 కోట్లు అనుకున్నా.. ఫైనల్ డిజైన్, నిర్మాణానికి ఉపయోగించే సామగ్రిని బట్టి ఇది మారుతుండొచ్చని అంచనా. 2025 నాటికి ఈ నగర నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇళ్లు అద్దెకు ఇస్తారా? అద్దె ఎలా ఉంటుంది? కొనుక్కోవచ్చా? కొనాలనుకుంటే ఖరీదు ఎంత? ఈ విషయాలు ఇంకా తెలియలేదు. ఈ తేలియాడే నగరాల నిర్మాణం కోసం మరో పది దేశాల ప్రభుత్వాలతో ఓషెనిక్స్ చర్చలు జరుపుతోంది. -
అపర్ణ సినీ ప్రపూర్ణ
తండ్రి సినిమా క్రిటిక్, తల్లి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ దంపతుల పదేళ్ల కూతురు..ఓ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ..‘‘అమ్మా నేను భవిష్యత్‌లో మంచి నటిని కాబోతున్నాను’ అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరూ సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నవారే అయినప్పటికీ తమ చిన్నారి చెప్పిన బుజ్జిబుజ్జి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అ చిన్నారి పదహారేళ్లకే సత్యజీత్ రే సినిమాలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు ఆరంభమైన అపర్ణాసేన్ ప్రయాణం నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా... ఎడిటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ‘ద రేపిస్ట్’ సినిమా తీసి ప్రతిష్టాత్మక ‘కిమ్ జిసెక్’ పురస్కారాన్ని అపర్ణ గెలుచుకున్నారు. అనేక అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును దక్కించుకోవడం విశేషం. కుమార్తె కొంకణసేన్ శర్మతో అపర్ణాసేన్ అప్పటి కలకత్తాలోని బెంగాలీ దంపతులు చిదానంద్ దాస్‌గుప్తా, సుప్రియ దాస్‌గుప్తాలకు 1945లో అక్టోబర్ 25న అపర్ణ జని్మంచింది. ఆమె బాల్యం అంతా కలకత్తాలోనే గడిచింది. బిఏ(ఇంగ్లిష్) డిగ్రీ పూర్తిచేసింది. 1961లో మ్యాగ్నమ్ ఫోటోగ్రాఫర్ బ్రేయిన్ బ్రాకేను కలిసిన అపర్ణ అతను తీస్తోన్న మాన్సూన్ సీరిస్‌లో నటించింది. పదహారేళ్లకే మోడల్‌గా మారిన అపర్ణ ..ఈ అనుభవంతో సత్యజీత్రే నిర్మించిన తీన్ కన్యలో మూడో భాగం ‘సమాప్తి’ లో నటించింది. ఈ సినిమాలో అపర్ణాకు మంచి గుర్తింపు లభించింది. మరోపక్క తన చదువును కొనసాగిస్తూనే కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ బిఏ(ఇంగ్లిష్) చదివింది. సమాప్తి తర్వాత ‘బక్సాబాదరల్’, ‘ఆకాశ్ కుసుమ్’లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తరువాత నటించిన ‘అపరాజితో’ మంచి కమర్షియల్ హిట్‌ను అందించింది. ఒక పక్క సినిమా, మరోపక్క థియేటర్లలో నటిస్తూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తరువాత సత్యజీత్ రే నిర్మించిన అనేక సినిమాల్లో నటించింది. రేకు వారసురాలిగా.. అపర్ణ తండ్రి సత్యజిత్ రేలు మంచి స్నేహితులు కావడం, వల్ల రేకు సన్నిహితంగా పెరిగిన అపర్ణ ...తన మొదటి సినిమా కూడా రే దర్శకత్వం వహించడంతో..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనలా విభిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. రాజకీయాలు, వివిధ రకాల మానవ సంబంధాలపై అపర్ణా అనేక సినిమాలు నిర్మించారు. 1981లో విడుదలైన ‘36 చౌరంగీ లేన్’ అనే ఇంగ్లిష్ సినిమాతో అపర్ణాకు రచయితగా, డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. అపర్ణ సిని పరిశ్రమకు చేసిన కృషికి గాను 1986లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డులను అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా వ్యవహరించడమేగాక అనేక లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘అంతహీన్’ లో నటించగా ..ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ లుకింగ్ ఉమెన్.. బెస్ట్ లుకింగ్ ఇండియన్ ఉమెన్ జాబితాలో నిలిచిన అపర్ణ..నటిగా, దర్శకురాలిగా ఎదిగినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు, మనవ సంతానంతో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బాగా పాపులర్ అయిన మహిళా మ్యాగజీన్ ‘సనంద’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగజీన్ లో సామాజిక సమస్యలపై ఆమె ఎడిటోరియల్స్ రాస్తున్నారు. ద రేపిస్ట్.. ఈ సినిమాను పదిహేనేళ్ల క్రితమే తియ్యాలని అపర్ణాసేన్ అనుకుంది. ఆ తరువాత భారత్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను గమనిస్తూ ఉండేది. ఎవరూ కూడా పుట్టుకతో రేపిస్ట్ కారు. చిన్నప్పుడు అమాయకంగా ఉండే అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చాక వారిలో ఎందుకు అత్యాచార మనస్తత్వం ఏర్పడుతుంది? రేపిస్ట్‌గా ఎలా మారుతున్నారు? ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలు, లేదా జన్యువుల వల్ల జరుగుతోందా? ఇటువంటి ప్రశ్నలు అపర్ణ మనసులో మెదిలాయి. కానీ వేటికీ జవాబు దొరకలేదు. వీటన్నింటికి జవాబులు అన్వేషించే క్రమంలోనే ‘ద రేపిస్ట్’ సినిమా తీశారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివారు, అనేక మంది లాయర్లు, ఫెమినిస్టులు, స్నేహితులతో కలిసి చర్చించి తన కూతురు, ప్రముఖ నటి కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రధారిగా సినిమాను తీశారు. ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా తీయడం, దానికి అంతర్జాతీయ అవార్డు వరించడంతో..75 ఏళ్ల వయసులోనూ తన ప్రతిభను నిరూపించుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హారామీ
ఇమ్రాన్ హష్మి నటించిన లేటెస్ట్ హిందీ చిత్రం ‘హారామీ’కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఈ ఏడాది జరగనున్న బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘హారామీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇండో – అమెరికన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్ మదిరాజ్ దర్శకత్వం వహించారు. ముంబై వీధుల్లో జరిగే క్రైమ్ కథా చిత్రమిది. రెండేళ్ల పాటు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘మా టీమ్ అందరి శ్రమ వల్ల బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి మా సినిమా ఎంపికైందని అనుకుంటున్నాను. ఇండియన్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎప్పుడు చూపిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ఇమ్రాన్ హష్మి. అక్టోబర్ 21 నుంచి 30 వరకూ బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. -
బూసాన్‌కు గల్లీబాయ్
ఈ ఏడాది భారతదేశం తరపున ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘గల్లీబాయ్’ ప్రస్తుతం సౌత్ కొరియాకు వెళ్లనుంది. సౌత్ కొరియాలో జరగనున్న బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘గల్లీ బాయ్’ ఎంపికైంది. ఈ చిత్రోత్సవాల్లో ‘రిక్వెస్ట్ సినిమా స్క్రీనింగ్’ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. ముంబై మురికి వాడల్లో నివసించే ర్యాపర్ కథే ఈ చిత్రం. -
ఉపద్రవం అంచున ఉపఖండం
వర్షాలు కూడా ఎక్కడికక్కడ స్థానిక పరిశ్రమలుగా మారిపోయాయి. కొన్నేళ్లుగా సమ నిష్పత్తిలో వర్షాలు కురవకపోవడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే. ఆహార పంటలు, నూనె గింజల పంటలు, ఇతర పంటలు దెబ్బతినడం, అంతిమంగా ధరలు విపరీతంగా పెరిగిపోవడం దీని ఫలితమే. ‘అరేబియా సముద్రం, బంగాళాఖాతం (హిందూ మహా సముద్రం) సహా యావత్తు భారత ఉపఖండం జూన్ నుంచి ఆగస్ట్ మాసం - ఆ తరువాత కూడా వర్షరుతువుకు దూరమయ్యే పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ఈ సరికే రావలసిన వర్షాలను దుర్భిక్ష కారకశక్తి అయిన ఎల్-నినో వ్యవస్థ అడ్డగిస్తోంది. ఈ దుస్థితి తూర్పు పసిఫిక్ నుంచి అమెరికాల వైపుగా కూడా పరివ్యాప్తమవుతోంది. భారత దేశ రాష్ట్రాలను దుర్భిక్ష ఉపద్రవం చుట్టబెట్టబోతోంది’ బుసాన్ (దక్షిణ కొరియా ప్రసిద్ధ వాతావరణ పరిశోధన కేంద్రం) హెచ్చరిక ముందున్న ఈ ముసళ్ల పండగ గురించీ, కమ్ముకొస్తున్న పరిస్థితి గురించీ మన పాలకులూ, వాతావరణ కేంద్రాలూ సకాలంలో, సవ్యమైన హెచ్చరికలు చేయకపోవడం దురదృష్టకరం. పంటలకు ఏర్పడబోతున్న నష్టం గురించీ, వ్యవసాయాధారిత రంగాలకు పొంచి ఉన్న ప్రమాదం గురించీ రైతాంగాన్ని అప్రమత్తం చేయలేకపోవడం మరీ దారుణం. మునుపెన్నడూ ఎరుగని రీతిలో పర్యావరణంలో వస్తున్న ఈ పెను మార్పులన్నీ మానవుడు ప్రకృతితో ఆడుతున్న చెలగాటం ఫలితమేనని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. ‘క్లైమాటిక్ చేంజ్’ ఒక మౌలికమార్పుగా (జెనరిక్ టైటిల్) స్థిరపడిందని ఆయన మొన్న మే రెండో తేదీనాడే ప్రకటించారు. ‘మఖ, పుబ్బలు వరపిస్తే (వర్షం మొహం చాటేస్తే) మహా దుర్భిక్షమే’నన్నది మన వ్యవసాయ సమాజం అనుభవం. మబ్బులు పట్టినట్టు కనిపించడం, ఉరుములూ మెరుపులే తప్ప చినుకు పడకపోవడం- ఈ రోజుకీ ఇదే జరుగుతోంది. ‘అటు మఖ, ఇటు పుబ్బ వరపయితే మా అన్న సేద్యం, నా సేద్యమూ మన్నే’ అని కూడా అంటారు. దేశంలో అరవై శాతం వ్యవసాయ భూములు వర్షాధార కొండ్రలే. ఈ ఏడు ఇప్పటి వరకు మన రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలలో పడిన వర్షపాతం 45-46 శాతం మించి ఉండదని ఒక అంచనా. వర్షాలు కూడా ఎక్కడికక్కడ స్థానిక పరిశ్రమలుగా మారిపోయాయి. కొన్నేళ్లుగా సమ నిష్పత్తిలో వర్షాలు కురవకపోవడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే. ఆహార పంటలు, నూనె గింజల పంటలు, ఇతర పంటలు దెబ్బతినడం, అంతిమంగా ధరలు విపరీతంగా పెరిగిపోవడం దీని ఫలితమే. శాస్త్రానికీ అందని వరుణుడి తీరు తాజాగా అమెరికా, ఆస్ట్రేలియా, కొరియా, జపాన్ల మీద ప్రభావం చూపడంతో పాటు, పసిఫిక్ సముద్ర ప్రాంతంలో కూడా ఎల్-నినో, లా-నినో ప్రబలంగా ఉన్నాయి. వాతావరణ సమతుల్యతను దారుణంగా ఇవి దెబ్బతీస్తున్నాయి. ఎల్-నినో సముద్ర జలాలను వేడెక్కిస్తూ దుర్భిక్షానికి కారణమవుతోంది. లా-నినో అతివృష్టిని సృష్టిస్తుంది. కొన్ని అంతర్జాతీయ వాతావరణ కేంద్రాలు సహా, భారత వాతావరణ కేంద్రాలు కూడా వర్షపాతం గురించి కొద్దిపాటి అంచనాకు రాలేకపోతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా చాలాసార్లు అవి విఫలమవుతున్నాయి. చిన్న ఉదాహరణ- పర్యావరణంలో వస్తున్న మార్పులలో భాగంగా మధ్య భారతంలో, ఈశాన్యభారతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ పరిశోధక కేంద్రాలు జోస్యం పలికాయి. కానీ ఈ రెండు భౌగోళిక ప్రాంతాలను వర్షాలు ముంచెత్తినట్టు వార్తలు వెలువడినాయి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి (అమెరికా) చెందిన పరిశోధకులు విడుదల చేసిన పత్రం మరింత ఆందోళన కలిగిస్తున్నది. మన దేశంలో జూలై, ఆగస్ట్ మాసాలలోనే రుతుపవనాల ఉధృతి ఉంటుంది. ఈ అంశంతో పాటు, వరపు దశలను కూడా కలుపుకుని 30 ఏళ్ల కాలాన్ని పరిగణనలోనికి తీసుకుని వర్షపాతం గురించి చేసిన హెచ్చరిక అది. ‘వర్షపాత దశలనీ, అతివృష్టి ఉన్న కాలంతో పాటు అదే మోతాదులో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న కాలాన్నీ కూడా గణించాం. 1981-2011 మధ్య ఎన్ని రోజుల పాటు చుక్క కూడా పడకుండా వరపు కాలం (డ్రస్పైల్) కొనసాగిందో, ఆ ముప్పయ్ సంవత్సరాలను కూడా పరిశీలించాం. ఇలాంటి వరపు కాలాలు తరచుగా ఏడాదిలో 27 శాతం నమోదైనాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికీ వర్షాధారంగా సేద్యం చేస్తున్న రైతాంగం తీవ్రంగా దెబ్బతింటుంది’ అని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ నిపుణులు తమ పత్రంలో పేర్కొన్నారు. ‘అప్రకటిత యుద్ధంలా, వాతావరణంలో వస్తున్న ఇలాంటి అప్రకటిత మార్పుల వల్ల, ముఖ్యంగా వరపు కాలాలు పెరిగే కొద్దీ వ్యవసాయం మీద, పంటకు అందవలసిన నీటి నిర్వహణ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది’ అని కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ సలహాదారు, వాతావరణ శాస్త్రవేత్త ఎం. రాజీవన్ కూడా హెచ్చరించారు. వాతావరణ హెచ్చరికలే ముఖ్యం వాతావరణాన్ని పరిశీలిస్తూ భారత రైతాంగాన్ని చైతన్య పరచడం ఈనాడు అత్యవసరమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వాతావరణంలో వచ్చే మౌలిక మార్పుల కారణంగా వర్షాకాలంలో ఎదురయ్యే వరపు దశలను గురించి ముందుగానే అంచనా వేసి రైతులకు ెహ చ్చరికలు జారీ చేసే విధానం మీద ఇక ఎక్కువ శ్రద్ధ చూపవలసిన అవసరం ఏర్పడిందని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో భారత పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ఆచార్య రఘురామ్ ముర్తుగుడి చెబుతున్నారు. అతివృష్టికీ, అనావృష్టికీ కూడా ఇది పని చేస్తుందని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే, సాధారణ వర్షపాతంలో 10 శాతం లోటు సంభవిస్తే, అది ఆహార కొరతను దాదాపు 3 శాతం పాయింట్లకు పెంచుతుంది. విదేశాల నుంచి చేసుకోవలసిన ఆహార దిగుమతులను 65 శాతానికి పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 2009లో దుర్భిక్షం తాండవించడం వల్ల ఆహార పదార్థాల ధరలు 20 శాతానికి పైగా పెరిగాయని సాధికారిక అంచనా చెబుతోంది. దుర్భిక్ష రాజుల చరిత్ర దేశంలో తలెత్తిన దుర్భిక్ష పరిస్థితులను అదుపు చేయలేని పాలకుల జమానాలో వచ్చే పరిణామాలను గురించి ప్రాచీన కావ్యాలలోనే ఆసక్తికరమైన, వ్యంగ్యంతో కూడిన ప్రస్తావనలు ఉన్నాయి. 17వ శతాబ్దానికి చెందిన హరిభట్టు అనే కవి తన కాలం నాటి దుర్భిక్షం, క్షామ పరిస్థితులను గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, ‘నాటి ఎండలు రాజుగారి ప్రతాపంలా వ్యాపిస్తున్నాయి’ అన్నాడు. వీచే గాలి, రాజుగారి ముందు నడిచే డవాలు బంట్రోతు(నకీబు)లా సాగిందట. చెట్టూ చేమా ఎండకి మాడిపోయి బూడిద కొండల్లా కనిపించాయట. ఆకాలంలోనే అలుముకున్న క్షామ పరిస్థితులను కూడా హరిభట్టు చూసి ఉంటాడు. తిండి లేక మానవ సమూహాలు ప్రాణాలు కోల్పోగా వారి మాంసాన్ని పీక్కు తిన్న నక్కలూ, కాకులూ, కుక్కలూ, ఇతర జంతువులూ తెగ బలిసి పోయి ఉన్న సంగతిని కూడా ఆ కవి గమనించే ఉండాలి. ఎందుకంటే, ఆ జంతువులలో రాజు గారి అంగరక్షకులని కవి చూశాడు. వీటన్నిటినీ చూసే హరిభట్టు ఆ రాజుకి దుర్భిక్ష రాజు అని నామకరణం చేశాడు. అలాంటి దుర్భిక్ష పాలకులు నేడూ ఉన్నారని ప్రజలు అనుకోవలసి వస్తోంది. ‘పాదం మోపాడు, ఇక వర్షాలు పడవు’ అనుకుంటున్నారు ప్రజలు. ధూర్జటి కవి కూడా దుర్భిక్ష పాలకుల గురించి చెప్పాడు. అలాంటి పాలకులు ఉన్నచోట పంటలు పండక, తిండిలేక ప్రజానీకం ఎముకల గూళ్ల మాదిరిగా ఉన్నారని ఆయన వర్ణించాడు. సంసారాలను ఈదలేక, పెళ్లాంబిడ్డల ఆకలి బాధ చూడలేక వెట్టిచాకిరికి అమ్ముడుపోయిన వారి సంగతిని కూడా ఆయన ప్రస్తావించాడు. ఇది నాలుగు శతాబ్దాల దుర్భిక్ష పరిస్థితి. పంచతంత్రం చెప్పినా, శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం చెప్పినా, ఆఖరికి ఏ కాలం నాటి ప్రజలు కోరుకోవలసినదైనా మంచి బుద్ధి, సన్మార్గం ఉన్న పాలకులు రావాలనే! (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -ఎబికె ప్రసాద్ -
ఆరేళ్ల తర్వాత అర్హత
వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు భారత్ కొరియాపై 3-1తో గెలుపు బుసాన్ (కొరియా): భారత డేవిస్‌కప్ జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్ పోటీల్లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన పోటీలో భారత్ 3-1తో గెలిచింది. ఆదివారం జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-4, 5-7, 6-3, 6-1తో యాంగ్ క్యు లిమ్‌ను ఓడించాడు. దాంతో భారత్ విజయం ఖాయమైంది. ఫలితం తేలిపోవడంతో సనమ్ సింగ్, హ్యున్ చుంగ్ మధ్య జరగాల్సిన రెండో రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. 2008 తర్వాత భారత జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత పొందింది. చివరిసారి భారత్ 2008 వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 1-4తో రుమేనియా చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలు సెప్టెంబరు 12 నుంచి 14 వరకు జరుగుతాయి. నెదర్లాండ్స్, కెనడా, స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికా, అర్జెంటీనా, బెల్జియం, సెర్బియా జట్ల నుంచి ఒక జట్టు భారత ప్రత్యర్థిగా ఉంటుంది.