
ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి అక్టోబరు 11 వరకు దక్షిణ కొరియాలో 29వ బూసాన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్) జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న 279 చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’కి చోటు లభించింది.
అక్టోబరు 8, 9 తేదీల్లో ఈ చిత్రం ‘బీఐఎఫ్‌ఎఫ్’లో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని ‘కల్కి 2898ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ‘ఎక్స్’ మాధ్యమంలో ధ్రువీకరించింది. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలై, సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుంది.