ఉపద్రవం అంచున ఉపఖండం
వర్షాలు కూడా ఎక్కడికక్కడ స్థానిక పరిశ్రమలుగా మారిపోయాయి. కొన్నేళ్లుగా సమ నిష్పత్తిలో వర్షాలు కురవకపోవడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే. ఆహార పంటలు, నూనె గింజల పంటలు, ఇతర పంటలు దెబ్బతినడం, అంతిమంగా ధరలు విపరీతంగా పెరిగిపోవడం దీని ఫలితమే.
‘అరేబియా సముద్రం, బంగాళాఖాతం (హిందూ మహా సముద్రం) సహా యావత్తు భారత ఉపఖండం జూన్ నుంచి ఆగస్ట్ మాసం - ఆ తరువాత కూడా వర్షరుతువుకు దూరమయ్యే పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ఈ సరికే రావలసిన వర్షాలను దుర్భిక్ష కారకశక్తి అయిన ఎల్-నినో వ్యవస్థ అడ్డగిస్తోంది. ఈ దుస్థితి తూర్పు పసిఫిక్ నుంచి అమెరికాల వైపుగా కూడా పరివ్యాప్తమవుతోంది. భారత దేశ రాష్ట్రాలను దుర్భిక్ష ఉపద్రవం చుట్టబెట్టబోతోంది’
బుసాన్ (దక్షిణ కొరియా ప్రసిద్ధ వాతావరణ పరిశోధన కేంద్రం) హెచ్చరిక
ముందున్న ఈ ముసళ్ల పండగ గురించీ, కమ్ముకొస్తున్న పరిస్థితి గురించీ మన పాలకులూ, వాతావరణ కేంద్రాలూ సకాలంలో, సవ్యమైన హెచ్చరికలు చేయకపోవడం దురదృష్టకరం. పంటలకు ఏర్పడబోతున్న నష్టం గురించీ, వ్యవసాయాధారిత రంగాలకు పొంచి ఉన్న ప్రమాదం గురించీ రైతాంగాన్ని అప్రమత్తం చేయలేకపోవడం మరీ దారుణం. మునుపెన్నడూ ఎరుగని రీతిలో పర్యావరణంలో వస్తున్న ఈ పెను మార్పులన్నీ మానవుడు ప్రకృతితో ఆడుతున్న చెలగాటం ఫలితమేనని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్ స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. ‘క్లైమాటిక్ చేంజ్’ ఒక మౌలికమార్పుగా (జెనరిక్ టైటిల్) స్థిరపడిందని ఆయన మొన్న మే రెండో తేదీనాడే ప్రకటించారు. ‘మఖ, పుబ్బలు వరపిస్తే (వర్షం మొహం చాటేస్తే) మహా దుర్భిక్షమే’నన్నది మన వ్యవసాయ సమాజం అనుభవం. మబ్బులు పట్టినట్టు కనిపించడం, ఉరుములూ మెరుపులే తప్ప చినుకు పడకపోవడం- ఈ రోజుకీ ఇదే జరుగుతోంది. ‘అటు మఖ, ఇటు పుబ్బ వరపయితే మా అన్న సేద్యం, నా సేద్యమూ మన్నే’ అని కూడా అంటారు.
దేశంలో అరవై శాతం వ్యవసాయ భూములు వర్షాధార కొండ్రలే. ఈ ఏడు ఇప్పటి వరకు మన రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలలో పడిన వర్షపాతం 45-46 శాతం మించి ఉండదని ఒక అంచనా. వర్షాలు కూడా ఎక్కడికక్కడ స్థానిక పరిశ్రమలుగా మారిపోయాయి. కొన్నేళ్లుగా సమ నిష్పత్తిలో వర్షాలు కురవకపోవడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే. ఆహార పంటలు, నూనె గింజల పంటలు, ఇతర పంటలు దెబ్బతినడం, అంతిమంగా ధరలు విపరీతంగా పెరిగిపోవడం దీని ఫలితమే.
శాస్త్రానికీ అందని వరుణుడి తీరు
తాజాగా అమెరికా, ఆస్ట్రేలియా, కొరియా, జపాన్‌ల మీద ప్రభావం చూపడంతో పాటు, పసిఫిక్ సముద్ర ప్రాంతంలో కూడా ఎల్-నినో, లా-నినో ప్రబలంగా ఉన్నాయి. వాతావరణ సమతుల్యతను దారుణంగా ఇవి దెబ్బతీస్తున్నాయి. ఎల్-నినో సముద్ర జలాలను వేడెక్కిస్తూ దుర్భిక్షానికి కారణమవుతోంది. లా-నినో అతివృష్టిని సృష్టిస్తుంది. కొన్ని అంతర్జాతీయ వాతావరణ కేంద్రాలు సహా, భారత వాతావరణ కేంద్రాలు కూడా వర్షపాతం గురించి కొద్దిపాటి అంచనాకు రాలేకపోతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా చాలాసార్లు అవి విఫలమవుతున్నాయి. చిన్న ఉదాహరణ- పర్యావరణంలో వస్తున్న మార్పులలో భాగంగా మధ్య భారతంలో, ఈశాన్యభారతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ పరిశోధక కేంద్రాలు జోస్యం పలికాయి. కానీ ఈ రెండు భౌగోళిక ప్రాంతాలను వర్షాలు ముంచెత్తినట్టు వార్తలు వెలువడినాయి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి (అమెరికా) చెందిన పరిశోధకులు విడుదల చేసిన పత్రం మరింత ఆందోళన కలిగిస్తున్నది. మన దేశంలో జూలై, ఆగస్ట్ మాసాలలోనే రుతుపవనాల ఉధృతి ఉంటుంది. ఈ అంశంతో పాటు, వరపు దశలను కూడా కలుపుకుని 30 ఏళ్ల కాలాన్ని పరిగణనలోనికి తీసుకుని వర్షపాతం గురించి చేసిన హెచ్చరిక అది. ‘వర్షపాత దశలనీ, అతివృష్టి ఉన్న కాలంతో పాటు అదే మోతాదులో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న కాలాన్నీ కూడా గణించాం. 1981-2011 మధ్య ఎన్ని రోజుల పాటు చుక్క కూడా పడకుండా వరపు కాలం (డ్రస్పైల్) కొనసాగిందో, ఆ ముప్పయ్ సంవత్సరాలను కూడా పరిశీలించాం. ఇలాంటి వరపు కాలాలు తరచుగా ఏడాదిలో 27 శాతం నమోదైనాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికీ వర్షాధారంగా సేద్యం చేస్తున్న రైతాంగం తీవ్రంగా దెబ్బతింటుంది’ అని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ నిపుణులు తమ పత్రంలో పేర్కొన్నారు. ‘అప్రకటిత యుద్ధంలా, వాతావరణంలో వస్తున్న ఇలాంటి అప్రకటిత మార్పుల వల్ల, ముఖ్యంగా వరపు కాలాలు పెరిగే కొద్దీ వ్యవసాయం మీద, పంటకు అందవలసిన నీటి నిర్వహణ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది’ అని కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ సలహాదారు, వాతావరణ శాస్త్రవేత్త ఎం. రాజీవన్ కూడా హెచ్చరించారు.
వాతావరణ హెచ్చరికలే ముఖ్యం
వాతావరణాన్ని పరిశీలిస్తూ భారత రైతాంగాన్ని చైతన్య పరచడం ఈనాడు అత్యవసరమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వాతావరణంలో వచ్చే మౌలిక మార్పుల కారణంగా వర్షాకాలంలో ఎదురయ్యే వరపు దశలను గురించి ముందుగానే అంచనా వేసి రైతులకు ెహ చ్చరికలు జారీ చేసే విధానం మీద ఇక ఎక్కువ శ్రద్ధ చూపవలసిన అవసరం ఏర్పడిందని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో భారత పర్యావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ఆచార్య రఘురామ్ ముర్తుగుడి చెబుతున్నారు. అతివృష్టికీ, అనావృష్టికీ కూడా ఇది పని చేస్తుందని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే, సాధారణ వర్షపాతంలో 10 శాతం లోటు సంభవిస్తే, అది ఆహార కొరతను దాదాపు 3 శాతం పాయింట్లకు పెంచుతుంది. విదేశాల నుంచి చేసుకోవలసిన ఆహార దిగుమతులను 65 శాతానికి పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 2009లో దుర్భిక్షం తాండవించడం వల్ల ఆహార పదార్థాల ధరలు 20 శాతానికి పైగా పెరిగాయని సాధికారిక అంచనా చెబుతోంది.
దుర్భిక్ష రాజుల చరిత్ర
దేశంలో తలెత్తిన దుర్భిక్ష పరిస్థితులను అదుపు చేయలేని పాలకుల జమానాలో వచ్చే పరిణామాలను గురించి ప్రాచీన కావ్యాలలోనే ఆసక్తికరమైన, వ్యంగ్యంతో కూడిన ప్రస్తావనలు ఉన్నాయి. 17వ శతాబ్దానికి చెందిన హరిభట్టు అనే కవి తన కాలం నాటి దుర్భిక్షం, క్షామ పరిస్థితులను గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, ‘నాటి ఎండలు రాజుగారి ప్రతాపంలా వ్యాపిస్తున్నాయి’ అన్నాడు. వీచే గాలి, రాజుగారి ముందు నడిచే డవాలు బంట్రోతు(నకీబు)లా సాగిందట. చెట్టూ చేమా ఎండకి మాడిపోయి బూడిద కొండల్లా కనిపించాయట. ఆకాలంలోనే అలుముకున్న క్షామ పరిస్థితులను కూడా హరిభట్టు చూసి ఉంటాడు. తిండి లేక మానవ సమూహాలు ప్రాణాలు కోల్పోగా వారి మాంసాన్ని పీక్కు తిన్న నక్కలూ, కాకులూ, కుక్కలూ, ఇతర జంతువులూ తెగ బలిసి పోయి ఉన్న సంగతిని కూడా ఆ కవి గమనించే ఉండాలి. ఎందుకంటే, ఆ జంతువులలో రాజు గారి అంగరక్షకులని కవి చూశాడు. వీటన్నిటినీ చూసే హరిభట్టు ఆ రాజుకి దుర్భిక్ష రాజు అని నామకరణం చేశాడు. అలాంటి దుర్భిక్ష పాలకులు నేడూ ఉన్నారని ప్రజలు అనుకోవలసి వస్తోంది. ‘పాదం మోపాడు, ఇక వర్షాలు పడవు’ అనుకుంటున్నారు ప్రజలు. ధూర్జటి కవి కూడా దుర్భిక్ష పాలకుల గురించి చెప్పాడు. అలాంటి పాలకులు ఉన్నచోట పంటలు పండక, తిండిలేక ప్రజానీకం ఎముకల గూళ్ల మాదిరిగా ఉన్నారని ఆయన వర్ణించాడు. సంసారాలను ఈదలేక, పెళ్లాంబిడ్డల ఆకలి బాధ చూడలేక వెట్టిచాకిరికి అమ్ముడుపోయిన వారి సంగతిని కూడా ఆయన ప్రస్తావించాడు. ఇది నాలుగు శతాబ్దాల దుర్భిక్ష పరిస్థితి. పంచతంత్రం చెప్పినా, శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం చెప్పినా, ఆఖరికి ఏ కాలం నాటి ప్రజలు కోరుకోవలసినదైనా మంచి బుద్ధి, సన్మార్గం ఉన్న పాలకులు రావాలనే!
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -ఎబికె ప్రసాద్