వాన రాకడ, ప్రాణం పోకడే! | abk prasad article on rain issues | Sakshi
Sakshi News home page

వాన రాకడ, ప్రాణం పోకడే!

Published Tue, Oct 10 2017 1:36 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

abk prasad article on rain issues - Sakshi

రెండో మాట
నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్న కాలంలోనే తుపాను మేఘాలు పింజలు పింజలుగా అలుముకోవచ్చుననీ, తరువాత అటు విలయం, ఇటు సమరం అన్న చందంగా అవి టార్పిడోలు, టోర్నడోలుగాను మారి ఉగ్రతాండవం చేయవచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు అతివృష్టి, అనావృష్టి బాధకు పసిఫిక్‌ తీరస్థ వైపరీత్యాలు ఎల్‌నినో, లానినోలకు కారణమవుతున్నాయన్న భావనలో ఉన్నాం. కానీ తాజాగా ముంచుకొచ్చినదే ‘క్యుములోనింబస్‌’ బెడద.

‘సౌర కుటుంబంలో జరిగే వింత పరిణామాలు భూగ్రహ వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు బృహస్పతి (జూపిటర్‌) గ్రహానికి తోబుట్టువుగా చెప్పదగిన వరుణ (నెప్ట్యూన్‌) గ్రహంలో భూమి అంత వైశాల్యంలో వీస్తున్న పెను తుపానును హవాయి దీవిలోని కెక్‌ ఖగోళ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు ఇటీవలనే కనిపెట్టారు. ఈ తుపాను మేఘం చాలా కాంతివంతంగా ఉంది.’
(4–8–2017 నాటి సమాచారం)

వెనుకటికి ఒక జ్యోతిష్కుడు ‘వానలు ముంచుతవోయ్‌! ముంచుతవోయ్‌!’ అనేవాడట. దీనికి ఓ అంతరార్థం ఉంది. వాన రాకపోయినా ముంచుడే. ఎక్కువైనా ముంచుడే అని ఆయన ఉద్దేశం. దశాబ్దకాలంగా ఈ రెండు రకాల వైపరీత్యాలను ప్రపంచం చూస్తున్నది. పాలకవర్గాలు ప్రకృతి విరుద్ధంగా అభివృద్ధి పేరుతో సాగిస్తున్న వనరుల విధ్వంసం వల్ల, అణ్వస్త్ర ప్రయోగాల కారణంగా ప్రకృతి పోకడలోనే పెనుమార్పులు సంభవిస్తున్నాయి. దీని ఫలితంగానే వనరుల వినియోగంలో సమతౌల్యం దెబ్బతిని అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. కడచిన ఏడేళ్లలో జూన్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో రుతు పవనాలు సకాలంలో రాక దేశ వ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రాజ్యమేలాయి. రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే. బంగాళాఖాతం కంటే, అరేబియా సముద్రం ఎక్కువ తేమకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

క్యుములోనింబస్‌ బీభత్సం
ఇప్పుడు ప్రకృతిలో సరికొత్త దృశ్యం– తుపాను మేఘాలు ఆకస్మికంగా ఆవరించడం, ఉరుముల గర్జనలతో, పిడుగులతో కుండపోతగా వాన ముంచెత్తడం. ఈ పరిణామానికే వాతావరణ శాస్త్రం క్యుములోనింబస్‌ అని పేరు పెట్టింది. ఈ మేఘాలు భూమికి 300–1500 మీటర్ల ఎత్తులోనే ఏర్పడతాయి. మరింత ఎత్తుకు కూడా ఎగబాకుతూ ఉంటాయి. హైదరాబాద్‌ వంటి నగరాలను, ఇతర పట్టణాలను ముంచెత్తుతాయి. రహదారులు మాయమై చెరువులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నీరే. భాస్కర రామాయణ కర్త తన కాలంలో ‘ఆకాశ గంగను తాకబోయిన’ పాతాళ జల దృశ్యాన్ని చూశాడో ఏమో కానీ, ‘వర్షాధార పూర్ణమీ నిఖిల జగము’ అని అనడం గుర్తుకు వస్తుంది. ఆకస్మికంగా కారుమేఘాలు ఆవరించడం, ఆపై అవి ఆవరించిన ప్రతి చోట, అంటే క్యుములోనింబస్‌ మేఘాలు అలుముకున్నచోట వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. పేద ప్రజలను అలవికాని కష్టాల పాల్జేస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలోను జరుగుతున్నది ఇదే. ఈ జల విధ్వంసాన్ని చూస్తే, అడవి బాపిరాజు ‘వరద గోదావరి’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటల’ లోని దృశ్యాలు గుర్తుకు రాకతప్పదు. చిత్రం ఏమిటంటే, ఈ జల విలయం వాతావరణ శాఖ అంచనాలను కూడా తారుమారు చేస్తున్నది. మరీ చీకట్లు అనలేం కానీ, ఆ మేఘాలు పగళ్లను దాదాపుగా సాయంసంధ్యగా మారుస్తున్నాయి. చంద్రుడు కూడా కనుమరుగై పోవలసి వస్తున్నది.

క్యుములోనింబస్‌ కుండపోతకు మరో లక్షణం కూడా ఉంది. అప్పుడే కుండపోత, అంతలోనే ఉక్కపోత. ఈ కారణంగా కొందరు శ్వాస కోసం పెనుగులాడవలసిన పరిస్థితి. మధ్య భారత రాష్ట్రాలలో కూడా ఇలాంటి ‘వేసవి వర్షాలు’ 1950లలో మొదలైనా, 2015కు బలహీనపడినాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా సాగుతున్న కాలంలోనే తుపాను మేఘాలు పింజలు పింజలుగా అలుముకోవచ్చుననీ, తరువాత అటు విలయం, ఇటు సమరం అన్న చందంగా అవి టార్పిడోలు, టోర్నడోలుగాను మారి ఉగ్రతాండవం చేయవచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు అతివృష్టి, అనావృష్టి బాధకు పసిఫిక్‌ తీరస్థ వైపరీత్యాలు ఎల్‌నినో, లానినోలకు కారణమవుతున్నాయన్న భావనలో ఉన్నాం. కానీ తాజాగా ముంచుకొచ్చినదే ‘క్యుములోనింబస్‌’ బెడద. ఈ మూడురకాల వైపరీత్యాల వల్ల వివిధ రకాల పంటలకు, వ్యవసాయానికి, జలరాశి ఆధారంగా ఉన్న జీవరాశి ఉనికికి ప్రమాదం ఉంది.

ముందున్నవి పెనుమార్పులు
రానున్న 40 ఏళ్లలో పెను వాతావారణ మార్పులు రాగలవనీ, ఇప్పటి ఈ విపరీత పరిస్థితికి 2025 దాకా తెరిపి ఉండక పోవచ్చునని సునిశిత వాతావరణ పరిశోధనల ఆధారంగా చెప్పారు. ఇప్పుడు కాదు 1994లోనే ‘వరల్డ్‌ వాచ్‌ ఇన్‌స్టిట్యూట్, 1999లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ సంగతిని ప్రకటించాయి (ఈ అంశాన్ని ‘సాక్షి’ వ్యాసంలో ఈ వ్యాసకర్త 26.4.2011న పేర్కొన్నాడు). ఉదర పోషణార్థం చెప్పే ‘చిట్కా’ జోస్యాలను నమ్మడానికి అలవాటుపడ టమూ ప్రమాదమే. అదే జరిగితే శాస్త్ర పరిశోధనల ఆధారంగా వెలువడిన హెచ్చరికలను నిర్లక్ష్యంచేసి ప్రభుత్వాలూ, ప్రజలూ సకల జాగ్రత్తలు పాటించ కుండా ఉండిపోయే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్‌ కేంద్రీయ పరిశోధనా సంస్థ రాష్ట్రం లోని ఏఏ ప్రాంతాలు భూకంపాల తాకిడికి గురికాగల అవకాశం ఉందో అధికారికంగా ఇటీవలనే హెచ్చరించింది.

ప్రపంచ బ్యాంకు కూడా 2010 అక్టోబర్‌లోనే రానున్న పెను వాతావరణ మార్పుల గురించి హెచ్చరికలు చేసింది. పలు ముఖాలుగా వెలువడిన ఈ ముందస్తు హెచ్చరికల ఫలితంగానే– ఇండియా, పాకిస్తాన్‌లలో భయంకరమైన ఎండల వల్ల, వడగాడ్పుల వల్ల రానున్న కొలది దశాబ్దాలలోనే 1 కోటీ 15 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్తలు అంచనా వేశారని (4.8.17) మరచిపోరాదు. అంతేగాదు, ప్రసిద్ధ ‘మిట్‌’ సాంకేతిక పరిశోధనా సంస్థ (అమెరికా) ఈ వాతావరణ మార్పుల ఫలితంగా విస్తృత స్థాయిలో 20వ శతాబ్దం చివరికల్లా పెను ఆహార సంక్షోభం ఏర్పడనున్నదని అంచనా వేసింది. ఈ మార్పుల ఫలితంగా వేసవి పెను వడగాడ్పులు దక్షిణాసియాలో వస్తాయనీ, ప్రపంచ జనాభాలో ఐదింట ఒక వంతు జనం నివసించే దక్షిణాసియా దేశాలు తీవ్రాతి తీవ్రమైన దారిద్య్రంలో దిగబడిపోతాయనీ కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అసాధారణ స్థాయిలో ఉడుకెత్తిపోతున్న ప్రాంతాలు సకాలంలో తగు జాగ్రత్తలు తీసుకొనకపోతే నష్టపోతాయని కూడా ముందస్తుగా గుర్తు చేశారు. లేకపోతే సారవంతమైన సుక్షేత్రాలు దెబ్బతినిపోవడం కూడా ఖాయమని హెచ్చరించారు. దక్షిణాసియాలోని సారవంతమైన సింధు–గంగానదీ పరీవాహక ప్రాంతం ఆ ప్రాంత ఆహార అవసరాలను తీర్చగల్గుతోంది. ఆ వాస్తవాన్ని బట్టే ఈ హెచ్చరిక చేయవలసి వచ్చిందని నిపుణులు వివరించారు. ఈ క్రమంలోనే పర్షియన్‌ అఖాతంలోని పలు ప్రాంతాలు కూడా అత్యంత అసాధారణ వడగాడ్పులకు గురవుతాయని కూడా చెప్పారు.

ఈ ఊపులోనే ఉత్తర దక్షిణ భారతాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. వీటితోపాటు జనసాంద్రత ఎక్కువగా ఉన్న తూర్పు చైనా కూడా అత్యుగ్రమైన వడగాడ్పులకు లోనుకానున్నదని వెల్లడించారు. అంతేగాదు, అతి ఉష్ణోగ్రతలు–అత్యుగ్ర ఉక్కబోతలు (వెట్‌–బల్బ్‌ టెంపరేచర్‌) కలగలిసిపోయి గాలిలో ఉండే తేమను కాస్తా మింగేస్తాయని హెచ్చరించారు. ఎందుకంటే, మానవ శరీరానికి అవసరమైన కనీస ఉష్ణోగ్రతను కాపాడడానికి సమశీతోష్ణత అవసరం కాబట్టి. ఉష్ణోగ్రత పెరిగినకొద్దీ ఉక్కబోత (చెమట) పెరుగుతుంది. ఈ పరిస్థితి పంట రాలుబడినీ దెబ్బతీస్తుంది. ఇది ముఖ్యంగా జూన్‌–సెప్టెంబర్‌ల మధ్య జరుగుతుంది. పంటలు పొట్టపోసుకుని పెరుగుతున్న సీజన్‌లో రాలుబడిని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంచనా కట్టారు.

పెరగనున్న రైతుల బలవన్మరణాలు?
30 సంవత్సరాల నిరంతర పరిశోధనల తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ (బర్కిలీ) నిపుణులు ఇండియా విషయంలో పై అంశం మరింత వాస్తవమని  నిర్ధారణకు వచ్చారు. విత్తనాలు, నాట్ల సీజన్‌లో ఒక్కరోజున 20 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటే సగటున 70మంది రైతుల బలవన్మరణాలకు దారి తీస్తుందని అంచనా వేశారు. ఎందుకంటే, ఉష్ణోగ్రత 1–1.5 డిగ్రీలు పెరిగితే పంట దిగుబడి 300–400 కేజీలకు పడిపోతుందట. ఈ శాస్త్రీయ అంచనాను సుప్రసిద్ధ భారత వ్యవసాయ శాస్త్ర నిపుణుడు డాక్టర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌ ధ్రువీకరించారు. 1967–2003 మధ్య కాలంలో భారతదేశంలో సంభవించిన రైతుల ఆత్మహత్యలతో పోల్చి–వాతావరణ మార్పులకు, పంట దిగుబడికి, రైతుల ఆత్మహత్యలకు మధ్య సంబంధాన్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ అగ్రశ్రేణి పరిశోధకురాలు మేడం తమా కార్లెటన్‌ నిరూపించారు.

పంట కాలంలో ఒక సెంటీమీటర్‌ మాత్రమే వర్షం పడితే లక్షమంది (0.8 శాతం) మరణిస్తారట. 1956–2000 మధ్యకాలంలో మన దేశంలో 13 రాష్ట్రాలలో పండిన పంటలను వాతావరణ మార్పులతో తైపారువేసి చూస్తే– పంటకాలంలో (పెరుగుదలలో ఉన్నప్పుడు) 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించిన ఉష్ణోగ్రత ఉంటే, సగటు సంవత్సర పంట రాలుబడి కాస్తా తగ్గిపోయిందని తమా కార్లెటన్‌ అంచనా వేశారు. ఫలితంగా ఆ దామాషాలోనే రైతుల ఆత్మహత్యలూ పెరుగుతాయని ఆమె నిర్ధారించారు. ఈ దృష్ట్యా, తాజాగా మన అనుభవంలోకి వచ్చిన ‘నింబస్‌’ తుపాను మేఘాలు చేసిన పని ప్రజలపైన, ప్రజా జీవనంపైన తలపెట్టిన ‘మెరుపుదాడులే’. వాటిని తప్పించుకుని బయటపడటానికీ వీలులేని పరిస్థితి. ఈ ‘నింబస్‌’ తుపాను మేఘ పంక్తి 8 రకాల ‘మేఘమాల’– ఆ పేర్లు చూడండి: క్వాల్వస్‌/కాపిలాటస్‌/ఇంకాస్‌/పానస్‌/పీలస్‌/మమ్మా/ప్రాసిపిటాటియో/టూబా. పెడబొబ్బలతో గాండ్రించే తుపాను మేఘాలు మనకు కనిపించే ఎత్తులోనే తిరుగాడుతూ, అంత జల సంపదను పొట్టలో నింపుకుని మన నెత్తిపైన కుమ్మరించి పోతాయి. కాదా మరి, ఒక ప్రాచీన కవి చెప్పినట్టుగా ‘‘ఎవ్వరికి తరంబు/కాలకృత వంచనకున్‌/వెలిగా మెలంగగన్‌!!’’


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement