కాగ్‌కు కూడా బుద్ధి లేదంటారా?: ఉండవల్లి | undavalli arun kumar takes on chandrababu naidu over CAG report | Sakshi
Sakshi News home page

‘వాళ్లు చెరోపక్క నిలబడితేనే చంద్రబాబు గెలిచారు'

Published Sat, Apr 1 2017 8:02 PM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

కాగ్‌కు కూడా బుద్ధి లేదంటారా?: ఉండవల్లి - Sakshi

కాగ్‌కు కూడా బుద్ధి లేదంటారా?: ఉండవల్లి

రాజమహేంద్రవరం: ప్రజలకు ఒక్క మంచి పనీ చేయకుండా మూడేళ్లుగా ప్రతి పథకం, ప్రాజెక్టులో అవినీతికి పాల్పడుతుంటే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. కాగ్‌ నివేదిక ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల్లో అవినీతి స్పష్టమైందన్నారు. శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేద్రవరంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రయోజనం శూన్యమన్న విషయం తాను ముందు నుంచీ చెబుతున్నానని, ఇదే విషయం కాగ్‌ నివేదికతో స్పష్టమైందన్నారు.

2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో అప్పడు కాగ్‌ ఇచ్చిన నివేదిక కేవలం అంచానాలేనని, అయినా కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయిందన్నారు. ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టుపై స్పష్టంగా రూ. 375 కోట్ల అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు నిరర్థకమైందని కాగ్‌ స్పష్టం చేసిందన్నారు. పట్టిసీమ వృథా అంటున్న వారికి బుద్ధిలేదన్న చంద్రబాబు ఇప్పుడు కాగ్‌కు కూడా బుద్ధిలేదంటారా? అని ప్రశ్నించారు.

డిసెంబర్‌ 21న హైదరాబాద్‌లో పోలవరం అంచనాలు పెంపు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై శాసనసభ అంచనా కమిటీ,ప్రజాపద్దుల కమిటీల సమావేశం జరిగితే.. హైదారాబాద్‌లో జరిగే సమావేశాలకు అధికారులు హాజరుకావద్దని స్పీకర్‌ నోటీసులు ఇచ్చారని, కానీ ఎమ్మెల్యే రోజాపై చర్యలు తీసుకునేందుకు ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం మాత్రం హైదరాబాద్‌లోనే నిర్వహించారని పేర్కొన్నారు.

మంచి పనులు చేస్తేనే..
రాష్ట్రంలో అవినీతికి రెండేళ్లు సెలవు ప్రకటించాలని చెప్పారు. చంద్రబాబు కోరుకున్నట్లుగా ఆయన ఫొటో భవిష్యత్తులో గాంధీ, అంబేడ్కర్‌ ఫొటోల పక్కన ఉండాలంటే మంచిపనులు చేయాలన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంచి పనులు చేశారు కాబట్టే ప్రజలు వారి ఇళ్లలో, గుండెల్లో ఆయన ఫొటో పెట్టుకున్నారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ చేసిన మంచి పనుల వల్లే వైఎస్‌ జగన్‌కు ప్రజలు ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు స్వతంత్రంగా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ, పవన్‌కల్యాణ్‌లు చెరో పక్క నిలబడితే వైఎస్‌ఆర్‌ సీపీ కన్నా కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని చెప్పారు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎప్పడు కూడా అప్పులు చేయకుండా పాలన చేయలేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఏ ఏడాది కూడా ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లలేదని గుర్తు చేశారు. ఏ ఒక్క మంత్రి ఏ పని చేసినా అది మంత్రివర్గ సమష్టి బాధ్యత అంటున్న అచ్చెన్నాయుడు.. వైఎస్‌ఆర్‌ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలో అప్పటి మంత్రులకు కూడా వాటాలు ఉండవా అని ప్రశ్నించారు. అదే నిజమైతే వైఎస్‌ హయాంలో ఉన్న మంత్రులు ఇప్పడు చంద్రబాబు ప్రభుత్వం, పార్టీలో ఉన్నారని, వారికి ఎంత మేరకు ముడుపులు వచ్చాయో చంద్రబాబు అడగాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement