ఆ కేసులో నేను ఇంప్లీడ్ అవుతా: ఉండవల్లి
- చంద్రబాబు సంభాషణ ప్రజలందరూ విన్నారు
- రేవంత్‌రెడ్డిని పంపింది చంద్రబాబే
- ఈ కేసులో నేను ఇంప్లీడ్ అవుతా
- కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదా ఫణంగా పెట్టారు
- పోలవరంతో రాష్ట్రం సస్యశ్యామలం
- అందుకే వైఎస్ అంతగా ఆరాటపడ్డారు
- పట్టిసీమ బోగస్ ప్రాజెక్టు
సాక్షి, రాజమహేంద్రవరం : ‘ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు సంభాషణ రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. అన్ని టీవీ చానళ్లలో ఇది ప్రచారమైంది. ఫోన్ సంభాషణ స్పష్టంగా ఉంది. చంద్రబాబు పిటిషన్‌తో ఏసీబీ దర్యాప్తుపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించినా ఈ కేసులో నిజాలు దాగవు. ఈ కేసులో నేను ఇంప్లీడ్ అవుతాను’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
‘ఓటుకు కోట్లు కేసులాంటిదే ఉత్తరాఖండ్‌లో జరిగింది. అక్కడ సీఎంను తొలగించారు. డబ్బు సంచులతో రేవంత్‌రెడ్డిని పంపింది చంద్రబాబేనని ఆడియో, వీడియోల్లో స్పష్టమైంది. స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో కూడా మాట్లాడారు. ఇంతకు మించి ఆధారాలు అవసరంలేదు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు ఫణంగా పెట్టారు’ అని ఉండవల్లి ధ్వజమెత్తారు.
పోలవరం.. వైఎస్ కల
పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం చేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారు. అందుకే పనులు మొదలు పెట్టారు. కాలువ పనుల్లో అనేక అవాంతరాలుంటాయని ముందుగా వాటి పనులు చేపట్టారు. పోలవరం పూర్తయితే దేశంలోనే అతి పెద్ద ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పడుతుంది. గోదావరి నుంచి 80 టీఎంసీలు కాదు 1000 టీఎంసీలు వాడుకున్నా ఎవ్వరూ అడగరు. పోలవరం నీటని కోస్తా జిల్లాలకు, కృష్ణా నీటిని రాయలసీమ, తెలంగాణకు మళ్లించాలని వైఎస్ఆర్ భావించారు. విశాఖ సమీపాన 90 టీఎంసీలు, కొండపల్లి వద్ద మరో 60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు స్థలాన్ని కూడా గుర్తించారు. చంద్రబాబు ఇవన్నీ వదిలేసి పట్టిసీమ కట్టారు. ఇప్పడు పురుషోత్తపట్నం అంటున్నారు. వీటితో న్యాయపరమైన చిక్కులు వస్తాయి’ అని ఉండవల్లి వివరించారు.
పట్టిసీమ బోగస్ ప్రాజెక్టు
గోదావరి, కృష్ణా నదులకు ఒకే సారి వరదలు వస్తాయి. అందువల్ల పట్టిసీమ వల్ల ఒరిగేదేమీ లేదని అప్పడే చెప్పాను. రూ.1600 కోట్లు వృథా చేశారు. రెండు నదులకు జూలై, ఆగస్టు నెలల్లో వరద వచ్చింది. జూలైలో ఐదు రోజులు, ఆగస్టులో రెండు రోజుల తప్ప మిగిలిన అన్ని రోజులు కృష్ణా నది నుంచి నీరు సముద్రంలో కలిసింది. ఇవన్నీ నేను చెప్పడం లేదు.
ప్రభుత్వమే ప్రతి రోజు రిజర్వాయర్ స్టోరేజ్ మోనిటరింగ్ సిస్టంలో ఈ వివరాలు నమోదు చేస్తోంది. పట్టిసీమపై ప్రజలను మాయ చేశారు. తప్పులను ఎత్తి చూపిన వారిపై ఎదురుదాడి చే స్తున్నారు. పట్టిసీమ బోగస్ అని నిరూపించడానికి నేను సిద్ధం. ప్రభుత్వం తరఫున ఎవ్వరైనా రావొచ్చు’ అని ఉండవల్లి సవాల్ విసిరారు. శివరామకృష్ణ కమిటీ నివేదిక అనుసరించే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశామని మంత్రి నారాయణ అబద్దాలు చెబుతున్నారని ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యాసంస్థల దోపిడీ ఆపేందుకు ప్రయత్నం
‘సొసైటీల పేరుతో విద్యా సంస్థలు స్థాపించి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న వారిపై న్యాయపరంగా పోరాటం చేస్తాను. ప్రజలు నాతో కలిసి రావాలి. ఒక్క నారాయణ సంస్థలే కాదు అన్ని సంస్థలపై పోరాటం చేస్తాను. నారాయణ విద్యా శాఖ మంత్రి గంటా వియ్యంకుడైన తర్వాత దోపిడీ మరింత ఎక్కువైంది. తెలుగు అకాడమి పుస్తకాలు తన ప్రెస్‌లో ప్రింట్ చేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడంతో తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి రూపాయల జరిమానా విధించింది. నారాయణ అధికారంలోకి వచ్చాక ఈ కేసును మాఫీ చేయించుకున్నారు’ అని ఉండవల్లి ఆరోపించారు.
రాష్ట్రం విలపించిన రోజు..
వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఈ రోజుకు ఏడేళ్లవుతోంది. ఆ రోజు వైఎస్ క్షేమంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ దేవుళ్లను మొక్కారు. ఆయన చనిపోవడంతో రాష్ట్రం విలపించింది. హైదరాబాద్‌లో వినాయక చవితి ఊరేగింపు రోజున గణనాధుడి విగ్రహాల పక్కన వైఎస్ చిత్రపటం పెట్టి తమ అభిమానాన్ని ప్రజలు చాటుకున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.