Crore for Vote case
-
ఆ కేసులో నేను ఇంప్లీడ్ అవుతా: ఉండవల్లి
- చంద్రబాబు సంభాషణ ప్రజలందరూ విన్నారు - రేవంత్‌రెడ్డిని పంపింది చంద్రబాబే - ఈ కేసులో నేను ఇంప్లీడ్ అవుతా - కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదా ఫణంగా పెట్టారు - పోలవరంతో రాష్ట్రం సస్యశ్యామలం - అందుకే వైఎస్ అంతగా ఆరాటపడ్డారు - పట్టిసీమ బోగస్ ప్రాజెక్టు సాక్షి, రాజమహేంద్రవరం : ‘ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో చంద్రబాబు సంభాషణ రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. అన్ని టీవీ చానళ్లలో ఇది ప్రచారమైంది. ఫోన్ సంభాషణ స్పష్టంగా ఉంది. చంద్రబాబు పిటిషన్‌తో ఏసీబీ దర్యాప్తుపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించినా ఈ కేసులో నిజాలు దాగవు. ఈ కేసులో నేను ఇంప్లీడ్ అవుతాను’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ఓటుకు కోట్లు కేసులాంటిదే ఉత్తరాఖండ్‌లో జరిగింది. అక్కడ సీఎంను తొలగించారు. డబ్బు సంచులతో రేవంత్‌రెడ్డిని పంపింది చంద్రబాబేనని ఆడియో, వీడియోల్లో స్పష్టమైంది. స్టీఫెన్ సన్తో చంద్రబాబు ఫోన్లో కూడా మాట్లాడారు. ఇంతకు మించి ఆధారాలు అవసరంలేదు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు ఫణంగా పెట్టారు’ అని ఉండవల్లి ధ్వజమెత్తారు. పోలవరం.. వైఎస్ కల పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం చేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారు. అందుకే పనులు మొదలు పెట్టారు. కాలువ పనుల్లో అనేక అవాంతరాలుంటాయని ముందుగా వాటి పనులు చేపట్టారు. పోలవరం పూర్తయితే దేశంలోనే అతి పెద్ద ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పడుతుంది. గోదావరి నుంచి 80 టీఎంసీలు కాదు 1000 టీఎంసీలు వాడుకున్నా ఎవ్వరూ అడగరు. పోలవరం నీటని కోస్తా జిల్లాలకు, కృష్ణా నీటిని రాయలసీమ, తెలంగాణకు మళ్లించాలని వైఎస్ఆర్ భావించారు. విశాఖ సమీపాన 90 టీఎంసీలు, కొండపల్లి వద్ద మరో 60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు స్థలాన్ని కూడా గుర్తించారు. చంద్రబాబు ఇవన్నీ వదిలేసి పట్టిసీమ కట్టారు. ఇప్పడు పురుషోత్తపట్నం అంటున్నారు. వీటితో న్యాయపరమైన చిక్కులు వస్తాయి’ అని ఉండవల్లి వివరించారు. పట్టిసీమ బోగస్ ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులకు ఒకే సారి వరదలు వస్తాయి. అందువల్ల పట్టిసీమ వల్ల ఒరిగేదేమీ లేదని అప్పడే చెప్పాను. రూ.1600 కోట్లు వృథా చేశారు. రెండు నదులకు జూలై, ఆగస్టు నెలల్లో వరద వచ్చింది. జూలైలో ఐదు రోజులు, ఆగస్టులో రెండు రోజుల తప్ప మిగిలిన అన్ని రోజులు కృష్ణా నది నుంచి నీరు సముద్రంలో కలిసింది. ఇవన్నీ నేను చెప్పడం లేదు. ప్రభుత్వమే ప్రతి రోజు రిజర్వాయర్ స్టోరేజ్ మోనిటరింగ్ సిస్టంలో ఈ వివరాలు నమోదు చేస్తోంది. పట్టిసీమపై ప్రజలను మాయ చేశారు. తప్పులను ఎత్తి చూపిన వారిపై ఎదురుదాడి చే స్తున్నారు. పట్టిసీమ బోగస్ అని నిరూపించడానికి నేను సిద్ధం. ప్రభుత్వం తరఫున ఎవ్వరైనా రావొచ్చు’ అని ఉండవల్లి సవాల్ విసిరారు. శివరామకృష్ణ కమిటీ నివేదిక అనుసరించే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశామని మంత్రి నారాయణ అబద్దాలు చెబుతున్నారని ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల దోపిడీ ఆపేందుకు ప్రయత్నం ‘సొసైటీల పేరుతో విద్యా సంస్థలు స్థాపించి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న వారిపై న్యాయపరంగా పోరాటం చేస్తాను. ప్రజలు నాతో కలిసి రావాలి. ఒక్క నారాయణ సంస్థలే కాదు అన్ని సంస్థలపై పోరాటం చేస్తాను. నారాయణ విద్యా శాఖ మంత్రి గంటా వియ్యంకుడైన తర్వాత దోపిడీ మరింత ఎక్కువైంది. తెలుగు అకాడమి పుస్తకాలు తన ప్రెస్‌లో ప్రింట్ చేసి నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడంతో తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి రూపాయల జరిమానా విధించింది. నారాయణ అధికారంలోకి వచ్చాక ఈ కేసును మాఫీ చేయించుకున్నారు’ అని ఉండవల్లి ఆరోపించారు. రాష్ట్రం విలపించిన రోజు.. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఈ రోజుకు ఏడేళ్లవుతోంది. ఆ రోజు వైఎస్ క్షేమంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ దేవుళ్లను మొక్కారు. ఆయన చనిపోవడంతో రాష్ట్రం విలపించింది. హైదరాబాద్‌లో వినాయక చవితి ఊరేగింపు రోజున గణనాధుడి విగ్రహాల పక్కన వైఎస్ చిత్రపటం పెట్టి తమ అభిమానాన్ని ప్రజలు చాటుకున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. -
చంద్రబాబు వల్లే మాకీ తిప్పలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తన తప్పిదాలతో పీకల్లోతు కూరుకుపోయిన సీఎం చంద్రబాబునాయుడు వాటి నుంచి తప్పించుకునే క్రమంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని చిరు ఉద్యోగులు మొదలు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారుల వరకు ఆవేదన చెందుతున్నారు. తన స్వార్థ రాజకీయాలు తప్ప ప్రజాప్రయోజనాలు, ఉద్యోగుల సాధక బాధకాలు రాష్ట్ర ప్రభుత్వాధినేతకు ఏమాత్రం పట్టట్లేదన్న విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం నూతన రాజధాని నిర్మాణం తప్పనిసరైనా.. అక్కడకు వెళ్లాల్సిన అవసరమున్నా... కనీస వసతులు కూడా కల్పించకుండా తరలింపుపై ఈ హడావుడి ఎందుకని ఉద్యోగులు ప్రశిస్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలంగాణ ప్రభుత్వం నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతోనే హైదరాబాద్ నుంచి తమనందర్నీ అమరావతికి ఇంత హడావుడిగా తరలిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసువల్లే తెలంగాణ ప్రభుత్వాన్ని మాటవరుసకైనా చంద్రబాబు పల్లెత్తుమాట అనలేకపోతున్నారని ఐఏఎస్, ఐపీఎస్, సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండానే అక్రమంగా నీటిప్రాజెక్టుల్ని నిర్మిస్తున్నా, ఏపీ భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలగనుందని తెలిసినా చంద్రబాబు నుంచి ఉలుకుపలుకు లేకపోవడానికి ‘ఓటుకు కోట్లు’ కేసే ప్రధాన కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘ఓటుకు కోట్లు కేసు నమోదు తర్వాత చంద్రబాబు మా తెలంగాణ సర్కారు గురించి ఒక్క మాటయినా వ్యతిరేకంగా మాట్లాడారా? విమర్శలైనా చేశారా? వారి పార్టీ నేతల్ని తీసుకెళుతున్నా... పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నా మాట్లాడుతున్నారా? మీరు క్షుణ్ణంగా పరిశీలించండి’’ అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఇప్పుడేకాదు, భవిష్యత్తులోనూ మా ప్రభుత్వం గురించి, మా సీఎం గురించి ఆయన(చంద్రబాబు) ఒక్క అంశంలోనూ నిలదీయలేరు, ప్రశ్నించలేరు’ అని మరో అధికారి చెప్పారు. ఉద్యోగుల్లో ఆందోళన.. రాజధాని అమరావతికి ఆగస్టులోగా హైదరాబాద్ నుంచి ఉద్యోగులందరూ తరలిరావాలని ముఖ్యమంత్రి, మంత్రులు చెపుతున్నారు. ఇందులోనూ స్పష్టత లేదు. ఎవరికివారు భిన్న ప్రకటనలు చేస్తూ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కొందరు సీఎం, మంత్రులకు వత్తాసు పలుకుతున్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సచివాలయ ఉద్యోగులు సమావేశమైన సందర్భంగా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించే విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఇప్పటికే పిల్లల్ని విద్యాసంస్థల్లో చేర్పించడానికి సమయం మించిపోయిందని, ప్రస్తుతం చదువుకుంటున్న స్కూళ్లలో ఫీజులు చెల్లించామని గుర్తుచేశారు. అమరావతిలో అద్దెఇళ్లు అందుబాటులో లేవని, ఉన్నవాటిలోనూ అద్దెలెక్కువని, అంతేగాక సరైన వసతులు, సదుపాయాలూ లేవని పేర్కొంటున్నారు. రెండు రోజులక్రితం నూతన రాజధాని ప్రాంతాన్ని సందర్శించిన మహిళా ఉద్యోగినులు సైతం అక్కడి వసతులపై పెదవి విరుస్తున్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది మార్చివరకు తరలింపు ఆలోచనను మానుకోవాలని పలువురు కోరుతున్నారు. ‘మాకు సాధకబాధకాలుంటాయి. చాలామంది షుగర్, బీపీలాంటి దీర్ఘకాలిక రోగాలతో బాధలు పడుతున్నారు. సరైన తిండి లేకపోతే తిప్పలు. కుటుంబం ఇక్కడుంటే మేమక్కడ ఉండాలి’ అని ఓ సీనియర్ ఉద్యోగి వాపోయారు. ‘అమరావతిలో ఏం జరుగుతోందో మాకన్నీ తెలుసు. వారి స్వప్రయోజనాలకోసం అందర్నీ ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ‘రాజధానికి పోవడం అందరి బాధ్యత. కానీ అక్కడ కనీస వసతులు, సౌకర్యాలు ఉండాలి కదా. ఏమీ ఏర్పాటవకుండా ఇంత తొందరెందుకనేదే మా ప్రశ్న’ అని మరో మహిళా ఉద్యోగిని వాపోయారు.